Delhi Liquor Scam: డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు సీబీఐ ప్రశ్నల వర్షం

CBI Questions Manish Sisodia in Delhi liquor Policy Case
x

Delhi Liquor Scam: డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు సీబీఐ ప్రశ్నల వర్షం

Highlights

Delhi Liquor Scam: విజయ్‌ నాయర్‌తో సంబంధమేంటని ప్రశ్నించిన సీబీఐ అధికారులు

Delhi Liquor Scam: సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో సీబీఐ ఎదుట హాజరైన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను అధికారులు 9 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వ్యాపారవేత్త విజయ్‌ నాయర్‌తో ఉన్న సంబంధాలు, మద్యం పాలసీ రూపకల్పనలో నాయర్‌ జోక్యమేంటి..? తదితర అంశాలపై సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.. విచారణకు రావాలంటూ సీబీఐ పిలిచిన నేపథ్యంలో.. మనీశ్‌ సిసోడియా తన తల్లి ఆశీర్వాదం తీసుకొని... రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధిని కూడా సందర్శించిన అనంతరం సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.

మొదటి అంతస్తులోని ఏసీబీ శాఖలో అవసరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ప్రశ్నల వర్షం కురింపించారు... కొంతమంది వ్యాపారవేత్తలు ఢిల్లీ మద్యం వ్యాపారంలో ఎందుకు జోక్యం చేసుకున్నారని.... ఢిల్లీలో వ్యాపారంపై వారికెందుకు ఆసక్తి అని... తెలంగాణకు చెందిన ఓ రాజకీయ నేతతో సమావేశమై మద్యం వ్యాపారంపై చర్చించారా..? అంటూ సిసోడియాకు ప్రశ్నలు సంధించారు. నూతన మద్యం విధానం వల్ల ఖజానాకు ఆదాయం తగ్గుతుందని మంత్రిగా మీకు తెలియదా...? అని ప్రశ్నించారు.. మద్యం వ్యాపారులకు వచ్చే 12 శాతం లాభాల్లో 6 శాతం ప్రభుత్వ అధికారులకు ఇచ్చినట్లు రుజువు చేయడానికి తమ దగ్గర ఆధారాలున్నాయని సీబీఐ అధికారులు సిసోడియాకు తెలిపారు...

ఈ విధానం వల్ల మీ ప్రభుత్వంలో ఎవరు డబ్బు సంపాదిస్తున్నారో ఓ మంత్రిగా చెప్పాలని, నూతన విధానం తర్వాత.. కేవలం ఎంపిక చేసుకున్న కొంతమంది మద్యం వ్యాపారులు మాత్రమే ఇందులో ఎందుకున్నారని ప్రశ్నించారు... ఈ వ్యాపారవేత్తలు, ప్రభుత్వం మధ్య ఏదైనా క్విడ్‌ ప్రో కో జరిగిందా... అని కూడా అడిగారు.... అయితే, సీబీఐ అడిగిన అనేక ప్రశ్నలకు సిసోడియా సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. సాక్ష్యాధారాలను ఆయన ముందుంచి కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. మద్యం పాలసీ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డితో పాటు ఫార్మా కంపెనీ అధినేత శరత్‌ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లయ్‌ని కూడా ఢిల్లీలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్‌, రామచంద్ర పిళ్లయ్ డైరెక్టర్లుగా ఉన్న రాబిన్‌ డిస్టిలరీస్‌కు చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న గోరంట్ల అండ్‌ అసోసియేట్స్‌ బుచ్చిబాబుకు కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈరోజు తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories