Assembly Elections 2023: ఎన్నికల సందర్భంగా ఐదు రాష్ట్రాల్లో ధన ప్రవాహం

Cash Flow In Five States During Elections
x

Assembly Elections 2023: ఎన్నికల సందర్భంగా ఐదు రాష్ట్రాల్లో ధన ప్రవాహం

Highlights

Assembly Elections 2023: ఎన్నికలు ముగిసేనాటికి తనిఖీల్లో పట్టుబడే సొమ్ము మరింత పెరిగే ఛాన్స్

Assembly Elections 2023: ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన 17వందల 60 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అక్టోబరు 9న ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఐదు రాష్ట్రాల్లో నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువుల రూపంలో ఈ మొత్తం పట్టుపడినట్లు ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో 2018 ఎన్నికల్లో పట్టుబడిన మొత్తం కంటే ఈసారి పట్టుబడినది దాదాపు ఏడు రెట్లని పేర్కొంది. గత ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో 239.15 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను ఈసీ జప్తు చేసింది.

17వందల 60 కోట్లలో అత్యధికంగా తెలంగాణలో దాదాపు 659 కోట్ల విలువైన లెక్కచూపని నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. తెలంగాణలో 659.2 కోట్లు పట్టుబడగా, అందులో 225.23 కోట్లు నగదు రూపేణా ఉన్నాయి. 86.82 కోట్ల విలువైన మద్యం, 103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, 191.02 కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, 52.41 కోట్ల విలువైన ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువులను ఎన్నికల అధికారులు సీజ్​చేశారు.

మిజోరంలో నిర్వహించిన తనిఖీల్లో ఒక్క రూపాయి నగదు కానీ, విలువైన బంగారు, వెండి ఆభరణాలు కానీ దొరకలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ రాష్ట్రంలో 29.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, 4.67 కోట్ల లిక్కర్, 15.16 కోట్ల విలువైన ఉచితాల వస్తు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈసారి స్టేట్, సెంట్రల్​ఏజెన్సీల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వ్యవస్థలో టెక్నాలజీ భాగస్వామ్యం పెంచామని, ఎన్నికలు ముగిసేనాటికి తనిఖీల్లో పట్టుబడే సొమ్ము మరింత పెరిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్.. ప్రలోభ రహితంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని అభ్యర్థులకు, పార్టీలకు స్పష్టం చేసినట్లు ఈసీ పేర్కొంది. ఈసారి ఎన్నికల్లో ధన ప్రవాహం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎలక్షన్‌ కమిషన్ ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ ప్రక్రియలో సాంకేతికతను కూడా పొందుపరిచినట్లు తెలిపింది.

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో ఎలక్షన్లు ముగియగా రాజస్థాన్‌లో నవంబర్ 25, తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories