Gujarat Bridge Collapse: మచ్చూ నదిపై కూలిన కేబుల్ బ్రిడ్జి.. 91మంది మృత్యువాత

Cable Bridge Collapses in Machchhu River Gujarat | Telugu News
x

Gujarat Bridge Collapse: మచ్చూ నదిపై కూలిన కేబుల్ బ్రిడ్జి.. 91మంది మృత్యువాత

Highlights

Gujarat Bridge Collapse: దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మోడీ, అమిత్ షా

Gujarat Bridge Collapse: గుజరాత్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలడంతో సుమారు 91 మందికి పైగా జలసమాధి అయ్యారు. మచ్చూ నదిపై నిర్మించిన తీగల వంతెన తెగిపోవడంతో భారీ సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై 500మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో వంద మందికి పైగా నదిలో మునిగిపోయారు. నదిలో పడిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందిన వెంటనే అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. S.D.R.F, N.D.R.F బృందాలను రంగంలోకి దిగాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు.

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో చనిపోయిన వారికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి 4లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50వేల రూపాయలు పరిహారం ప్రకటించారు. తీగల వంతెన తెగిన ఘటనపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి 2లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50వేల రూపాయల చొప్పున పీఎంవో ప్రకటించింది. విషాద ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడి మంత్రులు, అధికారులతో మాట్లాడారు. అవసరమైన తక్షణ సాయం అందించాలని సూచించారు. వందేళ్ల క్రితం నాటి వంతెనకు ఇటీవల మరమ్మతులు చేసి ప్రజల సందర్శన కోసం తెరిచారు. ఆదివారం సాయంత్రం సామర్థ్యానికి మించి వంతెనపై నిలబడటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories