ఢిల్లీలో నేడు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభం..!

BRS Party Office Inaugration Today In Delhi
x

ఢిల్లీలో నేడు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభం..!

Highlights

* పార్టీ జెండా ఎగురవేసి కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

BRS In Delhi: హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టీగా అవతరించిన 'భారత్ రాష్ట్ర సమితి' దేశ రాజధాని నుంచి కార్యకలాపాలకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఢిల్లీలో ప్రారంభోత్సవానికి బీఆర్ ఎస్ కార్యాలయం ముస్తాబైంది. హస్తినలో రాజశ్యామల యాగంతో క్రియాశీలకంగా జాతీయ రాజకీయాల్లోకి గులాబీదళపతి అడుగుపెట్టనున్నారు. నిన్నటి నుంచి జాతీయ కార్యాలయంలో యాగాలు, పూజాకార్యక్రమాలు జరుగుతున్నాయి.

దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా మార్చారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఢిల్లీ నడిబొడ్డున సర్దార్‌ పటేల్‌ రోడ్డులో ఇవాళ బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12గంటల 37 నిమిషాలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి జేడీఎస్‌ నేత కుమారస్వామి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌తో పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.

ఇవాళ మధ్నాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయానికి కేసీఆర్‌ చేరుకొంటారు. అక్కడ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో వేదపండితులు ఫణి శశాంక శర్మ, గోపీకృష్ణ శర్మలతోపాటు తదితరులు యాగ క్రతువులో భాగస్వామ్యులయ్యారు. మంగళవారమే గణపతి పూజతో యాగం మొదలయ్యింది. పూర్ణాహుతి అనంతరం పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరిస్తారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకొని తన కార్యాలయంలో కుర్చీలో ఆసీనులవుతారు. పార్టీకి సంబంధించిన పత్రాలపై కేసీఆర్ సంతకం చేస్తారు.

ఇక బీఆర్‌ఎస్‌ కోసం ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో సొంత భవనం నిర్మిస్తున్నారు. మరో ఐదారు నెలల్లో ఇది సిద్ధమవుతుంది. ఇవాళ నవచండీ హోమం కూడా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను, యాగశాలను సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పరిశీలించారు. మరోవైపు బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం వేళ ఢిల్లీలోని సర్దార్‌పటేల్‌ మార్గంలో పార్టీ శ్రేణులు జెండాలు, ఫ్లెక్సీలు పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. ఇవాళ తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడుకు చెందిన రైతు నాయకులు హాజరవుతారని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories