2023లో తెలంగాణ బీజేపీదేనంటున్నారు కమలనాథులు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పాగా వేస్తామంటున్నారు. ఏకంగా అమిత్ షానే, టూ స్టేట్స్‌పై నజర్ పెట్టారు. బీజేపీ దగ్గర...
2023లో తెలంగాణ బీజేపీదేనంటున్నారు కమలనాథులు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పాగా వేస్తామంటున్నారు. ఏకంగా అమిత్ షానే, టూ స్టేట్స్‌పై నజర్ పెట్టారు. బీజేపీ దగ్గర అన్నీ వున్నాయి. సకల శస్త్రాలూ ఉన్నాయి. కానీ కమలానికి కొదువైంది ఒకటుంది ఆ ఇద్దరూ లేకపోతే కమలానికి ఇక్కడ అంత వీజీ కాదు. ఇంతకీ బీజేపీకి కొదువైన ఆ ఇద్దరు లీడర్లు ఎవరు....?
తెలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరేయాలన్నది భారతీయ జనతా పార్టీ ప్లాన్. అందుకు తగ్గట్టే పక్కా వ్యూహాలు అమలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టార్గెట్ తెలంగాణ. మొన్నటి ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీకి, ఇక్కడ గ్రౌండ్ రెడీగా ఉన్నట్టు భావిస్తోంది. కాంగ్రెస్ డీలాపడటం, టీడీపీ ఖాళీ కావడం, రెండు పార్టీలకు చెందిన నేతలు కాషాయ కండువా కప్పుకుంటుండటంతో, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు దీటైన ప్రత్యర్థిగా బరిలో నిలవాలనుకుంటోంది బీజేపీ. మొన్నటి అమిత్ షా టూర్ కూడా ఆ దిశలోనే సాగింది.
తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరై, తెలంగాణకు ఆ పార్టీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టం చేశారు అమిత్ షా. 2023లో అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా, పని చేయాలని రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు. పార్టీ నాయకత్వం తీరు, అమిత్ షా మాటలు చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగానే ఉంది. ఇక పార్టీలో చేరికలపైనా ఆ పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇంకా చాలామంది నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు. ఇప్పుటి వరకు చూసింది ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా అని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమర సంకేతమిచ్చారు.
అటు కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు సంవత్సరాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు చూస్తారన్నారు. 2023లో తెలంగాణలో, బీజేపీ అధికారం సాధించటం ఖాయమని చెప్పారు. అయితే కాషాయ పార్టీ ఆశలు, అంచనాలు, వ్యూహాలు పకడ్బందీగా ఉన్నా, అసలు సమస్య మాత్రం వేరే ఉంది. అదే ముఖ్యమంత్రి అనదగ్గ దీటైన నాయకులు, రెండు రాష్ట్రాల్లోనూ కాగడా పెట్టి వెతికినా కానరావడం లేదు.
ప్రస్తుతం పెద్దగా ప్రాచుర్యంలో లేని నాయకులను మినహాయిస్తే ఎవరూ పార్టీ లో చేరలేదు. అసలు ఇప్పుడు బీజేపీకి కావాల్సింది కొత్త నాయకత్వాన్ని తయారు చెయ్యడం మాత్రమే కాదు, ధీటైన నాయకత్వాన్ని జనానికి చూపించగలగాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్, జగన్, చంద్రబాబులతో సమానమైన ఫేసు బీజేపీకి లేదన్న చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాదిలాగా ఓన్లీ మోడీ ముఖం చూసే ఓట్లు వేయరని, స్థానికంగా సీఎం కేండేట్ ఎవరన్న విషయాన్ని కచ్చితంగా పట్టించుకుంటారని విశ్లేషకుల అభిప్రాయం. అదే ఇప్పుడు బీజేపీకి లోపించింది.
సో..ఇప్పుడు పార్టీకి చరిష్మా ఉన్న నాయకుడు ఒకరు కావలెను అన్న చర్చ జరుగుతోంది. ఒక ప్రముఖ పార్టీకి చెందిన నాయకుడు పార్టీతో టచ్‌లో ఉన్నట్లు పార్టీలో గుసగుసలు వినిపించాయి. అమిత్ షా టూర్లోనే అతడు పార్టీలో చేరటం ఖాయం అన్నారు. కానీ ఎందుకనో జరగలేదు. ఒకరిద్దరు పెద్దగా ప్రాచుర్యంలోలేని వారు మాత్రమే పార్టీలో చేరారు.
అయితే, రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయటమే కాదు, పార్టీలో చరిష్మా ఉన్న నాయకుడి అవసరం అంతకంటే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడే 2023లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఉన్నవాళ్లను తయారు చేస్తారా లేదంటే రెడీమేడ్‌గా అవతలి పార్టీలోని పవర్‌ఫుల్ లీడర్‌ను లాగేస్తారా అన్నది చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire