BJP: ఢిల్లీలో అమిత్‌షా, జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ

BJP Meeting In Delhi
x

BJP: ఢిల్లీలో అమిత్‌షా, జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ

Highlights

BJP: ఆశావహుల లిస్ట్ హైకమాండ్‌కు అందజేసిన రాష్ట్ర నాయకత్వం

BJP: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. గెలుపు గుర్రాల కోసం క్షేత్రస్థాయి నుంచి నివేదికల ఆధారంగా తుది జాబితా ఖరారుపై దృష్టిపెడుతున్నారు. లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై బీజేపీ జోరును పెంచేసింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నివాసంలో జేపీ నడ్డా, అమిత్ షా‌తో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ నేతలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ సహా ఇతర కీలక నేతలు హాజరయ్యారు.

లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై జేపీ నడ్డాతో సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. 17 లోక్‌సభ స్థానాల్లో ఆశావాహులు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఒక్కో స్థానానికి 3 నుంచి 4 మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఆశావాహుల జాబితాను అధిష్ఠానానికి తెలంగాణ బీజేపీ నాయకత్వం అందజేసింది. రాష్ట్ర కోర్ కమిటీ ఎంపిక చేసిన సుమారు 50 పేర్లతో కూడిన జాబితాను జేపీ నడ్డాకు తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ అందజేసింది.

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను జేపీ నడ్డా, అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. నూతన నేతల చేరికలు, చేరే వారికి సీట్ల కేటాయింపు, ఆశావాహుల బలా బలాలు, గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాల సహా అభ్యర్థుల ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై అధిష్టానానికి తమ అభిప్రాయాలను రాష్ట్ర నేతలు తెలియజేశారు. ఫిబ్రవరి 29వ తేదీన జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తెలంగాణ నుంచి మెజార్టీ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.

పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్‌తో పాటు ఒకరి కంటే ఎక్కువమంది పోటీ పడుతున్న స్థానాలపై ఈ భేటీలో చర్చించారు. పోటీ చేసే అభ్యర్థుల బలబలాలపై నేతలు చర్చించారు. కొత్తగా పార్టీలోకి వచ్చే ఇతర పార్టీ నేతలపై సమావేశంలో నేతలు చర్చించారు. అభ్యర్థుల ఎంపికపై పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర నేతలు తెలిపారు.

తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలుస్తామన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్మణ్. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో యాత్రలు సభలపై అగ్రనేతలతో చర్చించినట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్ కోసం చర్చ జరిగినట్లు లక్ష్మణ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories