Bird Flu: దేశ వ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ కలకలం

Bird Flu spreading all over India creating fear
x
Infected ducks dumping in pit (representational image)
Highlights

Bird Flu: * కేరళలో విజృంభిస్తున్న బర్డ్‌ఫ్లూ * కోళ్లు, బాతులపై బర్డ్‌ఫ్లూ ప్రభావం * అప్రమత్తం అయిన కేరళ ప్రభుత్వం

కరోనా కల్లోలం నుంచి బయటపడముందుకే దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. బర్డ్‌ఫ్లూ భయం బెంబేలెత్తించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌, కేరళలో ఈ రకమైన ఫ్లూ బయటపడినట్టు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ తెలిపింది. వలస పక్షుల్లోనే ఎక్కువగా ఈ ఫ్లూ కనిపిస్తోందని కేంద్రం వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ కారణంగా దేశ వ్యాప్తంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయి.

వలస పక్షల కారణంగా చలికాలంలో వైరస్ దేశంలోకి వ్యాప్తి చెందుతోందని కేంద్రం వెల్లడించింది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో ఈ తరహా వైరస్ పక్షుల్లో బయటపడుతుందని అధికారులు చెప్తున్నారు. తాజాగా 4 రాష్ట్రాల్లో 12 బర్డ్ ఫ్లూ సెంటర్లను గుర్తించారు.రాజస్థాన్‌లో బారన్, కోటా, జాలావాడ్ ప్రాంతాల్లో కాకులపై తీవ్ర ప్రభావం ఉందని కేంద్రం వెల్లడించింది.

బర్డ్‌ఫ్లూ బయటపడడంతో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేరళలోని అలప్పుళ, కొట్టాయం జిల్లాల్లో ఈ వైరస్‌ ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. దాంతో ఇప్పటి వరకు వేల సంఖ్యలో బాతులు చనిపోయినట్టు తెలుస్తోంది. వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో మరో 40 నుంచి 50 వేల బాతులను చంపేయాల్సి రావచ్చని అధికారులు అంటున్నారంటే ఈ ఫ్లూ తీవ్రత ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. పక్షులకు, కోళ్లకు బర్డ్‌ప్లూ వస్తుందనే వార్తలతో ఢిల్లీలో చికెన్ ధర భారీగా తగ్గింది.

హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ చాలా పక్షులు చనిపోతున్నాయి. ఇందులో వలస పక్షులు కూడా ఉన్నాయి. వాటి నమూనాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీసెస్, భోపాల్‌లో పరీక్షిస్తే హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్రం తెలిపింది. ఈ వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. పక్షులను పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని పెంచడంతో పాటు వాటిపై నిఘా ఉంచాలని తెలిపింది.

మరోవైపు బర్డ్‌ఫ్లూ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ కాలేదని అధికారులు తెలిపారు. ప్రజలు భయపడాల్సింది లేదన్నారు. అయినా ఫ్లూ వచ్చే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దాంతో తెలంగాణలో అక్కడక్కడ కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అది బర్డ్‌ఫ్లూ తో చనిపోతున్నాయా లేకుంటే వేరే వైరస్ ఏమైనా సోకిందా అనే కోణంలో సైంటిస్ట్‌లు పరిశీలిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories