రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ కలకలం

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ కలకలం
x
Highlights

* వందల సంఖ్యల్లో కాకులు మృత్యువాత అప్రమత్తమైన కేంద్రం.. మార్గదర్శకాలు జారీ హిమాచల్‌ప్రదేశ్‌లో వెయ్యి వలస పక్షులు మృతి భయాందోళనలో ఇరురాష్ట్రాల ప్రజలు

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. రాజస్థాన్‌లో బర్డ్‌ ఫ్లూతో వందల సంఖ్యలో, మధ్యప్రదేశ్‌లో పదుల సంఖ్యలో కాకులు మృత్యువాత పడ్డాయి. వాటి కళేబరాలను పరిశీలించగా బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రెండు రాష్ట్రాలకూ కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. రాజస్థాన్‌లోని ఝాలావాడ్‌లో 100, బారాన్‌లో 72, కోటాలో 47, పాలిలో 19, జోధ్‌పూర్‌, జైపూర్‌లో ఏడు చొప్పున కాకులు ఇప్పటికే బర్డ్‌ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయాయి.

అలాగే జైపూర్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం జల్‌ మహల్‌ వద్ద ఆదివారం ఏడు కాకులు చనిపోయాయి. కోటా, జోధ్‌పూర్‌ డివిజన్లలో బర్డ్‌ ఫ్లూ కారణంగా ఎక్కువ సంఖ్యలో కాకులు చనిపోయాయని రాజస్థాన్‌ పశు సంవర్ధక శాఖ ప్రకటించింది. చనిపోయిన కాకుల శాంపిళ్లను మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని జంతుసంబంధ వ్యాధుల నిర్ధారణ కోసం ఉద్దేశించిన జాతీయ సంస్థకు పంపించగా బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఉన్నట్లు తేలిందని ప్రకటించింది.

అలాగే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనూ 50 కాకులు బర్డ్‌ ఫ్లూతో చనిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లూ ఉన్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లో పోంగ్‌ దాం సరస్సు లోనూ వెయ్యి వలస పక్షులు మృతి చెందాయి. ఇవి కూడా బర్డ్‌ ఫ్లూతోనే చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వాటి మృతికి గల కారణాన్ని నిర్ధారించడానికి ఆ పక్షుల శాంపిళ్లను బరేలీలోని భారతీయ పశుచికిత్స పరిశోధన సంస్థ, జలంధర్‌లోని ప్రాంతీయ వ్యాధి నిర్ధారక ల్యాబరేటరీ, డెహ్రాడూన్‌లోని భారత వన్యప్రాణి సంస్థకు పంపించామని, వాటి ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories