Uttar Pradesh: బహ్రీయీచ్‌ జిల్లాలో బుల్డోజర్‌పై బరాత్‌

Barat On Bulldozer in Uttar Pradesh | UP News
x

Uttar Pradesh: బహ్రీయీచ్‌ జిల్లాలో బుల్డోజర్‌పై బరాత్‌

Highlights

Uttar Pradesh: పెళ్లి వేడుకను చిరస్మరణీయంగా మార్చుకోవాలనే వినూత్న మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలిపిన వరుడు బాద్‌షా

Uttar Pradesh: ఇటీవల దేశవ్యాప్తంగా బాగా వినిపిస్తున్న పేరు బుల్డోజర్‌ ముఖ్యంగా యూపీలో ఎక్కువగా బుల్డోజర్‌ రాజ్‌ అంటూ ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీపై సీఎం యోగి, బీజేపీ నేతలు విరచుకుపడ్డారు. ఆ తరువాత సీఎం యోగి అక్రమ నిర్మాణదారుల గుండెల్లో బుల్డోజర్లను పరుగెత్తిస్తున్నారు. దీంతో సీఎం యోగిని బుల్డోజర్‌ బాబా అని కూడా పిలుస్తున్నారు. యూపీ, ఢిల్లీలో కూల్చివేతలతో బుల్డోజర్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో యూపీలో పెళ్లి సందర్భంలో బరాత్‌కు ఓ కొత్త జంట ఈ బుల్డోజర్‌ను ఎంచుకుంది. ఈ వివాహ వేడుక యూపీలోని బహ్రీయీచ్‌ జిల్లాలో జరిగింది. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

బహ్రీయీచ్‌ జిల్లాలోని లక్ష్మణ్‌పూర్‌ సమీపంలోని శంకర్‌పూర్‌ గ్రామంలో బాద్‌షా, రుబీనా జంట వివాహం ఘనంగా జరిగింది. ఆ తరువాత నిర్వహించే బరాత్‌కు బాద్‌షా కుటుంబ సభ్యులు బుల్డోజర్‌ను అందంగా పూలతో అలంకరించారు. అందంగా ముస్తాబైన వధూవరులు బాద్‌షా, రుబీనాను అందులో కూర్చోబెట్టి ఊరేగించారు. మొదట బుల్డోజర్‌ను విచిత్రంగా చూసినా బరాత్‌ అని తెలుసుకుని గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా బుల్డోజర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు యువకులు ఎగబడ్డారు. మరికొందరైతే బుల్డోజర్‌ బాబాకీ జై అంటూ సీఎం యోగికి జై కొట్టారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. వినూత్న వేడుకలను నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

ఈ విషయమై వరుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బాద్‌షా, రుబీనా వివాహం గుర్తుండిపోయేలా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని భావించామని తెలిపారు. అందులో భాగంగానే ఇలా బుల్డోజర్‌ను వినియోగించినట్టు తెలిపారు. తమ వివాహ వేడుక చిరస్మరణీయంగా మార్చుకోవాలనే భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్టు వరుడు బాద్‌షా తెలిపారు. ఇదే విషయమై బహ్రీయీచ్‌ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, బీజేపీ నేత అనుమా స్పందించారు. రాష్ట్రంలో సుపరిపాలనకు బుల్డోజర్‌ చిహ్నంలా మారిందని తెలిపారు. బుల్డోజర్‌ను చూసి నేరస్థులు, ఆక్రమణదారులు మాత్రమే భయపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఓ వర్గాన్నే టార్గెట్‌ చేసుకుని బుల్డోజర్లతో కూల్చివేతలకు పాల్పడుతున్నట్టు విమర్శలు గుప్పిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories