Maharashtra: మరో మలుపు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు

Another Turning Point Is Maharashtra Politics
x

Maharashtra: మరో మలుపు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు 

Highlights

Maharashtra: శరద్‌పవార్‌కు తెలిసే ఈ పరిణామాలన్నీ జరిగాయని ప్రచారం

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఎంవీఏ కూటమికి.. అజిత్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుతో మరో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. అయితే మారిన పరిణామాలన్నీ శరద్‌పవార్‌కు తెలిసే ఈ పరిణామాలన్నీ జరిగాయని.. ప్రభుత్వంలో చేరికపై ఎన్సీపీ-బీజేపీకి గతంలోనే ఒప్పందం జరిగినట్లు మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

మే 2న ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్‌పవార్‌ రాజీనామా చేశారు. అప్పట్లోనే.. బీజేపీ-ఎన్సీపీ నడుమ ఒప్పందం కుదిరిందంటూ వార్తలు వినిపించాయి. అయితే, అప్పట్లో పవార్‌ రాజీనామా చేసి తన వారసుడిగా అజిత్‌పవార్‌ పేరును ప్రకటిస్తారని.. ఎన్సీపీ-బీజేపీ సర్కారుకు ముఖ్యమంత్రిగా అజిత్‌పవార్‌ ఉంటారని వార్తలు వచ్చాయి. కానీ, అసలైన శివసేన ఎవరిదన్న అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. శిందే ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ వాటిల్లకపోవడంతో లెక్కలు మారాయి. ఎన్సీపీ.. సీఎం పదవిని డిమాండ్‌ చేసే పరిస్థితి లేకపోయింది. అయినప్పటికీ అధికారంలో ఉండే అవకాశాన్ని కోల్పోవడం ఎమ్మెల్యేలకు ఇష్టం లేక అజిత్‌ వర్గం వరకూ ప్రభుత్వంలో చేరిందని.. ఆ పార్టీకున్న 53 మంది ఎమ్మెల్యేల్లో 43 మంది మద్దతు తమకే ఉందని అజిత్‌ ప్రకటించడం వెనుక వ్యూహం ఇదేనన్న ప్రచారం జరుగుతోంది.

విపక్షాలు మోడీ సర్కార్‌పై విరుచుకుపడుతున్న సందర్భాల్లో సైతం.. శరద్‌పవార్‌ కేంద్రానికి, మోడీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్‌పై జేపీసీ వేయాలన్న విపక్షాల డిమాండ్‌ను ఆయన కొట్టిపారేశారు. 2018లో రాఫెల్‌ డీల్‌పై కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో మోదీ సర్కారుపై ధ్వజమెత్తుతున్నప్పుడు కూడా.. ఆ డీల్‌ విషయంలో మోదీ ఉద్దేశాలను ప్రజలు సందేహించట్లేదన్నారు. మోదీ విద్యార్హతలపై విపక్షాలన్నీ ప్రశ్నిస్తున్న సమయంలో.. శరద్‌పవార్‌ మాత్రం.. నిరుద్యోగం, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలున్న ప్రస్తుత సమయంలో మోదీ డిగ్రీ ఇప్పుడంత పెద్ద రాజకీయ అంశమా? అంటూ ఆ విషయాన్ని చిన్నదిగా చేసి చూపే ప్రయత్నం చేశారు.

కూటమి భాగస్వామి అయిన ఉద్ధవ్‌ ఠాక్రే విషయంలో కూడా పవార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీలో చెలరేగిన తిరుగుబాటును అణచివేయడంలో ఠాక్రే విఫలమయ్యారని, ఆయనకు రాజకీయ చాతుర్యం లేకపోవడం వల్లనే అలా జరిగిందని పవార్‌ పేర్కొన్నారు.

శరద్ పవార్ గతంలో చేసిన ఇలాంటి బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చూస్తుంటే.... ఆయనకు బీజేపీతో కలవడం పెద్ద సమస్యేమీ కాదని.. అయితే, మహావికాస్‌ అఘాడీలో ఉంటూ బీజేపీతో కలవడం బాగోదు కాబట్టి మెజారిటీ ఎమ్మెల్యేలను అజిత్‌పవార్‌ నేతృత్వంలో ప్రభుత్వంలోకి పంపి ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అజిత్‌ పవార్‌ ఇలా వెళ్లడానికి అవసరమైన నేపథ్యాన్ని సృష్టించేందుకే పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా ఆయన్ను నియమించకుండా సుప్రియాసూలే, ప్రఫుల్‌ పటేల్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమించి ఉంటారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories