Supreme Court: సుప్రీంకోర్టులో మరో కీలక పిల్ దాఖలు

Another Important PIL Has Been Filed In The Supreme Court
x

Supreme Court: సుప్రీంకోర్టులో మరో కీలక పిల్ దాఖలు 

Highlights

Supreme Court: దీనిపై సమాధానం ఇవ్వాలని ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ

Supreme Court: సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా పిల్ దాఖలైంది. పోటీలో నిలిచిన అభ్యర్థులు అందరినీ తిరస్కరిస్తూ నోటాకు ఓట్లు వేస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్‌ నిర్వహించాలని రచయిత, శివ్‌ ఖేడా తన పిటిషన్‌లో కోరారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసింది. పిల్‌ ద్వారా లేవనెత్తిన అంశాలపై విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ధర్మాసనం అంగీకరించింది.

నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులు తదుపరి ఐదేళ్లు ఏ ఎన్నికలోనూ పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించాలని పిటిషనర్‌ కోరారు. నోటాను ‘కల్పిత అభ్యర్థి’గా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల సూరత్‌ లోక్‌సభ స్థానంలో పోలింగ్‌ జరగకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును ప్రస్తావించారు. పిటిషనర్‌ ప్రస్తావించిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈసీకి నోటీసు పంపించింది. పిటిషన్‌లోని అంశాలపై ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దామని పేర్కొంది.

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే.. ఈ నోటా బటన్ నొక్కే సదుపాయం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉండవు. ఇటువంటి సందర్భంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. దీనిని మార్చాలనే.. అభ్యర్థుల కంటే.. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. ఏం చేయాలన్న ప్రశ్నను పిల్‌‌లో ప్రస్తావిచారు. దీనిపై ఈసీ సమాధానం బట్టి.. సుప్రీం తుది తీర్పు వెల్లడించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories