అగ్రిగోల్డ్‌ నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఈడీ

అగ్రిగోల్డ్‌ నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఈడీ
x
Highlights

* జనవరి 5వరకు నిందితులను ప్రశ్నించనున్న అధికారులు * నగదు విదేశాలకు బదిలీచేసినట్లు ఆధారాలు సేకరణ * పనామా సంస్థ మొసాక్‌ ఫొన్సెంకా సహకారంతో

అగ్రిగోల్డ్‌ సంస్థ.. ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేసి దుకాణం మూసేసిన సంస్థ. కానీ ఇప్పటివరకు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒకటే.. దోచేసిన సొమ్ము ఏం చేశారు..? ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు..? అవి ఏ రూపంలోకి మార్చారు..? ఇక ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరుకుతోంది. అగ్రిగోల్డ్‌ నిందితులను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు సంస్థ గుట్టును బయటపెట్టనున్నారు.

పూర్తిస్థాయిలో విచారించేందుకు అగ్రిగోల్డ్‌ నిందితులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. డిపాజిటర్ల సొమ్ముతో కూడబెట్టిన ఆస్తుల వివరాలను సేకరించే క్రమంలో జనవరి 5వరకు నిందితులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈమేరకు ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా.. డిపాజిట్ల పేరుతో 7రాష్ట్రాలకు చెందిన 32లక్షల మందిని మోసం చేసి 6వేల 380కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఇప్పటికే ఈడీ వెల్లడించింది.

ప్రజల నుండి సేకరించిన సొమ్మును నిందితులు విదేశాలకు బదిలీచేసినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. పనామా సంస్థ మొసాక్‌ ఫొన్సెంకా సహకారంతో కరేబియన్‌ సముద్రంలోని కేమన్‌ దీవుల్లో షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి 942కోట్ల 96లక్షల రూపాయల నిధులను దారి మళ్లించినట్టు గుర్తించారు. దాదాపు 4వేల 109కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు. ఇందులో ప్రధానంగా ‎ఏపీలోని 11జిల్లాలు, తెలంగాణలోని 9జిల్లాలు, కర్ణాటకలోని మూడుప్రాంతాలతోపాటు ఒడిశాలోని అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

ఇక అగ్రిగోల్డ్‌ నిందితులపై మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ ప్రకారం ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా సంస్థ ఛైర్మన్‌ అవ్వ వెంకట రామారావు, డైరెక్టర్లు వెంకట శేషు నారాయణరావుతోపాటు హేమసుందర వరప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి ఈడీకోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం ఈడీకోర్టు ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు జ్యుడీషయల్‌ రిమాండ్‌కు తరలించింది. ఈ నేపథ్యంలో ఈడీ నిందితులను ప్రశ్నించి.. పలు కీలక ఆధారాలు సేకరించనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories