Dr. Manmohan Singh: నిద్రపోతున్న మన్మోహన్ సింగ్‌ను తెల్లవారుజామునే లేపి.. ఆర్థిక మంత్రి ఆఫర్ ఇచ్చారు పీవీ నరసింహారావు
అది 1991 జనవరి. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టిన భారతదేశం అప్పుడు ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపించింది. ఆర్థికంగా దేశంలో హెచ్చరికలు...
అది 1991 జనవరి. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టిన భారతదేశం అప్పుడు ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపించింది. ఆర్థికంగా దేశంలో హెచ్చరికలు వినిపించడం మొదలైంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం 890 మిలియన్ల డాలర్లకు పడిపోయాయి. ఈ మొత్తం రెండు వారాల పాటు దిగుమతి ఖర్చులకు మాత్రమే సరిపోతుంది. ఇలాంటి కష్టకాలంలో ప్రధానమంత్రి పదవి చేపట్టిన తెలుగు నేత పీవీ నరసింహారావు.. ఆర్థిక మంత్రిత్వ శాఖను డాక్టర్ మన్మోహన్ సింగ్ కు అప్పగించారు. ఆర్థిక శాస్త్రంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకుని భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నత స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించిన మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఇండియన్ ఎకానమీని ఎలా మలుపు తిప్పారో అందరికీ తెలుసు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు దిశను నిర్దేశించిన నేతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అయితే, అసలు ఆయన ఆర్థికమంత్రి కావడమే చాలా ఆసక్తికరంగా జరిగింది. ఆ కథేమిటో ఇప్పుడు చూద్దాం.
జూన్ 20, 1991 సాయంత్రం.. తన క్యాబినెట్ సెక్రటరీ నరేష్ చంద్ర కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి నరసింహారావును కలుసుకుని, 8 పేజీల లేఖను అందించారు. ఏయే పనులపై ప్రధాని తక్షణం దృష్టి సారించాలని ఈ నోట్‌లో ప్రస్తావించారు. ఆ నోటు చదవగానే నరసింహరావు ఉలిక్కిపడ్డారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? అని నరేష్ చంద్రను అడిగారు. లేదు సార్, ఇంతకంటే దారుణం' అని చంద్ర సమాధానం ఇచ్చారు.
ఆ సమయంలో, భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆగస్టు 1990 నాటికి, ఇది కేవలం 300 కోట్ల డాలర్లకు పడిపోయింది. 1991 జనవరిలో ఈ నిల్వలు 89 కోట్లకు తగ్గిపోయాయి. రెండు వారాల దిగుమతి ఖర్చులకు మాత్రమే సరిపోయే ఆ విదేశీ మారక ద్రవ్యంతో ఎలా ముందుకు వెళ్ళాలన్నది పీవీ క్యాబినెట్‌కు పెద్ద సవాలుగా మారింది. దీనికితోడు, 1990లో గల్ఫ్ యుద్ధం కారణంగా.. చమురు ధరలు మూడింతలు పెరగడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది.
మరోవైపు, కువైట్‌పై ఇరాక్ దాడి కారణంగా, భారతదేశం వేలాది మంది కార్మికులను తిరిగి భారతదేశానికి తీసుకురావాల్సి వచ్చింది. ఫలితంగా వారి నుంచే వచ్చే విదేశీ మారకద్రవ్యం పూర్తిగా నిలిచిపోయింది. భారతదేశ రాజకీయ అస్థిరత, మండల్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా ప్రజల నిరసన ఉద్యమాలు ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరిచాయి. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధాని పీవీ ఒక సమర్థుడైన ఆర్థిక మంత్రి కోసం చూశారు. అప్పుడు ఆయనకు స్ఫురించిన పేరు డాక్టర్ మన్మోహన్ సింగ్.
భారతదేశం తీసుకున్న స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రేటు ఎనభైలలో పెరిగింది. ద్రవ్యోల్బణం 16.7 శాతానికి పెరిగింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే మంచి ప్రతిభావంతుడైన ఆర్థికవేత్తను ఆర్థిక మంత్రి చేయాలని పీవీ భావించారు. గతంలో ఇందిరాగాంధీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న తన మిత్రుడు పీసీ అలెగ్జాండర్‌తో దీని గురించి మాట్లాడాడు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్లు ఐజీ పటేల్, మన్మోహన్ సింగ్ పేర్లను పీసీ సూచించారు. అయితే, అలెగ్జాండర్ వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ వైపు మొగ్గు చూపించారు. దాంతో, మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రి పదవికి ఒప్పించే బాధ్యతను పీవీ ఆయనకు అప్పగించారు.
పి.సి.అలెగ్జాండర్ తన ఆత్మకథ 'త్రూ ది కారిడార్స్ ఆఫ్ పవర్ యాన్ ఇన్‌సైడర్స్ స్టోరీ'లో, "జూన్ 20వ తేదీన నేను మన్మోహన్ సింగ్ ఇంటికి ఫోన్ చేశాను. ఆయన యూరప్ వెళ్లారని, ఈ రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తారని ఆయన ఇంట్లో పని చేసే వ్యక్తి చెప్పారు.జూన్ 21 ఉదయం 5.30 గంటలకు నేను మళ్ళీ ఫోన్ చేశాను. అప్పుడు మన్మోహన్ నిద్రిస్తున్నారని లేపడం కుదరదనే సమాధానం వచ్చింది. నేను పట్టుబట్టిన తర్వాత ఆయనను లేపారు. నేను మన్మోహన్ ఇంటికి వచ్చి, ఆయన కలవాలని, అది చాలా ముఖ్యమని చెప్పాను” అని రాశారు.
ఆ తరువాత మన్మోహన్ సింగ్ నిద్రలో నుంచి లేచి ఫోన్లో మాట్లాడారు. అప్పుడు పీవీ సందేశాన్ని మన్మోహన్ సింగ్ కు వినిపించారు అలెగ్జాండర్. దానికి బదులుగా మన్మోహన్ సింగ్, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటని అలెగ్జాండర్‌ను అడిగారు. నేను వద్దనుకుంటే ఇలాంటి సమయంలో మీకు ఫోన్ చేసి ఉండేవాడినే కాదు, ఇలా వచ్చి కలిసే వాడినే కాదని అలెగ్జాండర్ బదులిచ్చారు.
అలా మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టడానికి సరేనన్నారు. మీకు పని చేసేందుకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను అని ప్రమాణ స్వీకారానికి ముందే మన్మోహన్ సింగ్‌కు చెప్పారు పీవీ.
మీ విధానాలు విజయవంతమైతే దానికి మేం క్రెడిట్ తీసుకుంటాం. విఫలమైతే మాత్రం మీదే బాధ్యత అని కూడా చెప్పారు.
మన్మోహన్ సింగ్ తన మొదటి బడ్జెట్‌లో ఎరువులపై ఇచ్చే సబ్సిడీని 40 శాతం తగ్గించడమే కాకుండా చక్కెర, ఎల్‌పిజి సిలిండర్ల ధరలను కూడా పెంచారు. అతను తన ప్రసంగాన్ని విక్టర్ హ్యూగో పాపులర్ కొటేషన్.. ‘No force on earth can stop an idea whose time has come’ అనే వాక్యంతో ముగించారు. ఒకరి టైమ్ వచ్చిందంటే వారి ఆలోచనలను ఏ శక్తీ ఆపలేదన్నది ఆ వాక్యానికి అర్థం.
ఆ తరువాత రోజుల్లోనూ మన్మోహన్ ఆ వాక్యానికి తగినట్లుగా ముందుకు నడిచారు. పీవీ-మన్మోహన్ జోడీ టైమ్ వచ్చింది. వారు అనుసరించిన ఆర్థిక సరళీకరణ విధానాలు సత్ఫలితాలు ఇవ్వడం మొదలైంది. ఇక వారిని ఏ శక్తీ అడ్డుకోలేకపోయింది. భారత ఆర్థిక వ్యవస్థ వారిద్దరి సంకల్పంతో కొత్త మలుపు తిరిగింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire