Cyclone Michaung: మిగ్‌జాం తుఫాను బీభత్సం.. వరద గుప్పిట్లోనే చెన్నై

After Heavy Damage In Chennai Cyclone Michaung Weakens
x

Cyclone Michaung: మిగ్‌జాం తుఫాను బీభత్సం.. వరద గుప్పిట్లోనే చెన్నై

Highlights

Cyclone Michaung: చెరువులను తలపిస్తున్న పలు ప్రాంతాలు

Cyclone Michaung: మిగ్‌జాం తుఫాన్‌ తమిళనాడు రాజధాని చెన్నైలో బీభత్సం సృష్టించింది. తుఫాన్‌ ప్రభావంతో గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు బుధవారానికి తగ్గినప్పటికీ, నగరం ఇంకా వరద ముంపులోనే ఉన్నది. భారీగా పోటెత్తిన వరద నీటితో చెన్నైలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇంకా వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

విద్యుత్ వైర్లు కొన్ని చోట్ల ఇంకా నీటిలోనే ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా కొన్ని ఏరియాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేశామని ప్రభుత్వం పేర్కొన్నది. కిల్పౌక్‌, కట్టుపక్కం తదితర ప్రాంతాల్లో విద్యుత్తు ఇంకా పునరుద్ధరణ కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు తగ్గిన చోట రహదారులను శుభ్రం చేస్తున్నామని, ప్రజలకు తాగునీటి సరఫరా కూడా చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు రాష్ట్ర బృందాలు సహాయక చర్యల్లో ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆహారం, పాల ప్యాకెట్లు అందజేస్తున్నామని వెల్లడించారు.

మరోవైపు మునక ప్రాంతాల నుంచి ప్రజలను రెస్క్యూ సిబ్బంది సహాయ శిబిరాలకు తరలించారు. వందలాది మంది ఇంకా శిబిరాల్లోనే తలదాచుకొంటున్నారు. నగర పరిధిలోని పలు చోట్ల ప్రజలు తమ పిల్లలను తీసుకొని నీటిలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కార్లు, ఇతర వాహనాలు నీటిలోనే మునిగి ఉన్నాయి. వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories