Adani Group: రికార్డును సొంతం చేసుకున్న అదానీ గ్రూప్

Adani Group Company Cross100 Billion Market
x

Adani Group:(Photo the hans india)

Highlights

Adani Group: అదానీ గ్రూప్ సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడంతో పాటు దేశీయంగా మూడో గ్రూప్‌గా ఆవిర్భవించింది.

Adani Group: ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడంతో పాటు దేశీయంగా మూడో గ్రూప్‌గా ఆవిర్భవించింది. ఇప్పటివరకూ టాటా గ్రూప్, ముకేశ్‌ అంబానీ దిగ్గజం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రమే 100 బిలియన్‌ డాలర్ల విలువను అధిగమించాయి. ప్రస్తుతం టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ 242 బిలియన్‌ డాలర్లుకాగా.. ఆర్‌ఐఎల్‌ విలువ 171 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అదానీ గ్రూప్‌ తాజా రికార్డు సాధనకు ఆరు లిస్టెడ్‌ కంపెనీలు సహకరించాయి. 1980లో కమొడిటీ ట్రేడర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన గౌతమ్‌ అదానీ.. రెండు దశాబ్దాల వ్యవధిలోనే గనులు, ఓడరేవులు విద్యుత్‌ ప్లాంట్లు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, సిటీ గ్యాస్‌, రక్షణ లాంటి పలు రంగాల వ్యాపారాలు నిర్వహించే ఓ దిగ్గజ వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగారు.

స్టాక్‌ ఎక్సేంజీలలో లిస్టయిన ఆరు అదానీ గ్రూప్‌ కంపెనీలలో నాలుగు మంగళవారం(6న) ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్టాలను తాకాయి. ఫలితంగా అదానీ గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ. 7.84 లక్షల కోట్లు పెరిగి 106.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 7.4 శాతం దూసుకెళ్లి రూ. 1,223 సమీపంలో ముగిసింది. తొలుత రూ. 1,241 వద్ద రికార్డ్‌ గరిష్టానికి చేరింది. ఇక అదానీ టోటల్‌ గ్యాస్‌ ఇంట్రాడేలో రూ. 1,250కు చేరింది. చివరికి 4 శాతం లాభపడి రూ. 1209 వద్ద స్థిరపడింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ ఒక దశలో 5 శాతం జంప్‌చేసి రూ. 1,145కు చేరినప్పటికీ.. రూ. 1,110 వద్ద నిలిచింది. అదానీ పోర్ట్స్‌ 14.5 శాతం పురోగమించి రూ. 850 వద్ద ముగిసింది. రూ. 853 సమీపంలో రికార్డ్‌ 'హై'ని చేరింది. అదానీ పవర్‌ 5 శాతం ఎగసి రూ. 98.4 వద్ద నిలవగా.. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 3.3 శాతం లాభంతో రూ. 1,203 వద్ద స్థిరపడింది. అదానీ గ్రీన్, అదానీ పవర్‌ మినహా మిగిలిన నాలుగు కౌంటర్లూ ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. ప్రస్తుతం అదానీ పవర్‌ మార్కెట్‌ విలువ రూ. 37,9852 కోట్లుకాగా.. మిగిలిన ఐదు కంపెనీలూ రూ. లక్ష కోట్ల మార్క్‌ను అధిగమించడం విశేషం!

గత రెండేళ్లలో గ్రూప్‌ ఏడు ఎయిర్‌పోర్టుల నిర్వహణను చేపట్టింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో వేగంగా విస్తరిస్తోంది. అదానీ గ్రీన్‌ ద్వారా 2025కల్లా 25 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుకోవాలని చూస్తోంది. అదానీ పోర్ట్స్‌ దేశీ పోర్టుల పరిశ్రమలో 30% వరకూ నిర్వహిస్తోంది.కృష్ణపట్నం పోర్టులో ఇప్పటి వరకూ ఉన్న విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటాను అదానీ పోర్ట్స్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. 25 శాతం వాటా విలువ 2800 కోట్ల రూపాయలు ఉంటుందని అదానీ పోర్ట్స్ సెజ్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు అదానీ పోర్ట్స్ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా డీల్‌తో కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీ పోర్ట్స్‌కు బదలాయింపు అయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories