కునో నేషనల్‌ పార్క్‌లో 8 చీతాలు.. మన వాతావరణానికి అలవాటు పడుతున్న చీతాలు

8 Cheetahs In Kuno National Park
x

కునో నేషనల్‌ పార్క్‌లో 8 చీతాలు.. మన వాతావరణానికి అలవాటు పడుతున్న చీతాలు 

Highlights

Cheetahs: చిరుతలు, హైనాల నుంచి రక్షణ కోసం ఏర్పాట్లు

Cheetahs: నమీబియా నుంచి ఇండియాకు వచ్చిన చీతాలెలా ఉన్నాయి..? మన వాతావరణానికి అలవాటు పడ్డాయా..? వాటి రక్షణ బాధ్యతపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఆఫ్రికా నుంచి వచ్చిన చీతాల గురించి ఎన్నో ప్రశ్నలు. మొత్తం 8 చీతాలపై కునో నేషనల్ పార్క్ ఫుల్ ఫోకస్ చేసింది. అహారం నుంచి సెక్యూరిటీ వరకు.. ఎక్కడా రాజీ పడటం లేదు.

ప్రాజెక్ట్‌ చీతా.. ప్రపంచంలోనే మొదటి అతిపెద్ద ఖండాంతర ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టు ద్వారా.. చీతాల తరలింపు సక్సెస్ అయ్యింది. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ఆపరేషన్‌ ద్వారా మొత్తం 8 చీతాలు మనదేశం గడ్డపై కాలుమోపాయి. ప్రధాని మోడీ తన జన్మదినాన.. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో వాటిని విడిచిపెట్టారు. బోను నుంచి బయటకు వచ్చిన చీతాలు.. తొలుత బెరుకుగా భయంగా అడుగులు వేసినా.. క్రమంగా మన వాతావరణానికి అలవాటు పడుతున్నాయి.

తాజాగా మూడు చీతాలు.. కేవలం 48 గంటల్లోనే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాయని.. చీతా కన్జర్వేషన్‌ ఫండ్‌ వెల్లడించింది. చుట్టూ మనుషుల సంచారం చూసి తొలుత అవి ఒత్తిడికి గురైనా.. ప్రస్తుతం ప్రశాంతంగా సేద తీరుతున్నాయని తెలిపింది. మున్ముందు వాటి ప్రవర్తన చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు.. సీసీఎఫ్ వివరించింది. మూడు చిరుతలకు సాషా, సవానా, సియాయా అని పేర్లు పెట్టారు. అయితే వీటి రక్షణ కోసం కునో నేషనల్‌ పార్క్‌ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా చిరుతులు, హైనాల నుంచి ఈ చీతాలను కాపాడుకునేందుకు.. పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మనుషులకు సాధ్యం కాదు కనుక.. వీటి కాపాలకు రెండు ఏనుగులను నియమించారు. నర్మదాపురంలోని సాత్పురా పులుల అభయారణ్యం నుంచి లక్ష్మి, సిద్ధనాథ్‌ అనే రెండు ఏనుగులను ఈ కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చారు. పార్కు సెక్యూరిటీ టీములతో పాటు.. ఈ ఏనుగులు రాత్రింబవళ్ళూ చీతాల రక్షణలో ఉంటున్నాయి.

ప్రస్తుతం నమీబియా చీతాలు వాటికి ఉద్దేశించిన స్పెషల్ ఎన్ క్లోజర్ లో సుమారు నెల రోజులపాటు గడపాల్సి ఉంటుంది. ఈ ఎన్ క్లోజర్ల దగ్గర ఈ ఏనుగులు రక్షణ బాధ్యతలు చేపట్టాయి. చిరుతలు, ఇతర జంతువులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిబ్బందికి సహాయం చేస్తాయి. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితమే వాటిని ఇక్కడికి తరలించారు. చీతాలను ప్రవేశపెట్టకముందు.. వాటి కోసం తయారు చేసిన ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లలోకి ప్రవేశించిన నాలుగు చిరుతలను తరిమికొట్టడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి. అయితే ఈ రెండు ఏనుగులకు గత చరిత్ర కూడా ఉంది. ఇందులో 25 ఏళ్ల లక్ష్మీ.. శాంత స్వభావం కలిగిన ఏనుగు అని.. దీనికి సఫారీ, రెస్క్యూ ఆపరేషన్‌లు, జంగిల్ పెట్రోలింగ్‌లో నైపుణ్యం ఉందని చెబుతున్నారు. అలాగే 30 ఏళ్ల సిద్ధనాథ్‌కు.. పులుల రెస్క్యూ ఆపరేషన్‌లలో రాష్ట్రంలోనే గుర్తింపు ఉందని అధికారులు తెలిపారు. 2010 లో ఇద్దరి మావటీలను చంపినట్లు తెలిపారు. అంతేకాకుండా.. గతేడాది జనవరిలో ఓ పులిని తరిమికొట్టడంలో ఈ ఏనుగు ముఖ్య పాత్ర పోషించినట్లు చెప్పారు.

అయితే చీతాల రాకపై.. ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కునో నేషనల్ పార్క్ సమీప గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. లేటెస్ట్‌గా.. ఈ చీతాల ఆహారం కోసం అధికారులు చేసిన పనికి.. బిష్ణోయ్‌ కమ్యూనిటీ ప్రజలు నిరసనలకు దిగారు. ఈ చీతాల కోసం రాజస్థాన్‌ నుంచి తెప్పించిన మచ్చల జింకలను కునో నేషనల్‌ పార్క్‌లో వదిలినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాజస్థాన్‌కు చెందిన బిష్ణోయ్‌ తెగ నిరసనలకు దిగింది. ఈ మేరకు ప్రధాని మోడీకి సైతం ఆ తెగ ప్రజలు లేఖ రాశారు. మచ్చల జింక అంతరించిపోయే స్థితిలో ఉన్న జంతుజాలమని, అధికారులు తీసుకున్న ఇలాంటి నిర్ణయంపై.. పునరాలోచన చేయాలని లేఖలో కోరారు.

అయితే మధ్యప్రదేశ్‌ అటవీ శాఖ అధికారులు ఈ వివాదంపై స్పష్టత ఇచ్చారు. రాజస్థాన్‌ నుంచి ఈ జింకలను తెప్పించలేదని స్పష్టం చేశారు. అలా తెప్పించాల్సి వస్తే.. కేంద్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. అసలు కునో నేషనల్‌ పార్క్‌లోనే.. 20 వేలకు పైగా మచ్చల జింకలున్నాయని.. కావున బయటి నుంచి తెప్పించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.

భూమ్మీద అత్యంత వేగవంతమైన జంతువుగా రికార్డులకెక్కిన ఈ చీతాలు.. మన దేశంలో 1952లో అంతరించిపోయాయి. 70 ఏళ్ల క్రితం ప్రస్తుత చత్తిస్‌గఢ్‌లో.. చివరి మూడు చీతాలను అక్కడి రాజు వేటాడి చంపడంతో.. మన దేశంలో చీతాలు అంతరించిపోయాయి. అప్పటినుంచి వాటిని తిరిగి దేశంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. తాజాగా మనదేశంలో అడుగుపెట్టిన ఈ చీతాలు నిలదొక్కుకుంటే.. పులులకు సంబంధించిన ఆరు జాతులు.. మన దగ్గర ఉన్నట్టవుతుందని అధికారులు తెలిపారు. ఇది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విషయం అని.. టూరిజం డెవలప్ అవుతుందని.. వివరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories