పండగ వేళ విషాదం.. పైకప్పు కూలి మెట్లబావిలో పడి 13 మంది మృతి..

13 Dead, 19 People Rescued in Indore Temple Stepwell Collapse
x

పండగ వేళ విషాదం.. పైకప్పు కూలి మెట్లబావిలో పడి 13 మంది మృతి..

Highlights

Indore: ఇండోర్‌ శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.

Indore: ఇండోర్‌ శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మహదేవ్‌ మందిర్‌లో పైకప్పు కూలి మెట్లబావిలో పడి 13 మంది మృతి చెందారు. మరో 19 మందిని సురక్షితంగా కాపాడారు సిబ్బంది. మెట్లబావిపై స్లాబ్‌ వేసి గదిలా వాడుతున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నట్టు గుర్తించారు.

పటేల్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న మహదేవ్​జులేలాల్​ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వేడుకలను చూసేందుకు కొందరు భక్తులు.. ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్ల బావిపై కూర్చున్నారు. దురదృష్టవశాత్తూ ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు 30 మంది భక్తులు బావిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెన, తాళ్ల సాయంతో కొందరు భక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగులపైనే ఉన్నట్లు తెలుస్తోంది.

మహదేవ్‌ మందిర్‌లో ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ఫోన్‌ చేసి పరిస్థితి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అటు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ చౌహాన్‌ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. మరోవైపు.. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం. గాయపడ్డవారికి 50వేల రూపాయలను ప్రకటించారు సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.

ప్రమాదం జరిగిన ఇండోర్‌ మహదేవ్‌ జులేలాల్‌ ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ ఏటా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు.. ఈ వేడుకలను చూసేందుకు భారీగా తరలివస్తారు. కానీ.. ఈ సంవత్సరం ఇలాంటి విషాద ఘటన జరగడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories