ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ ఆదిపురుష్ హ్యాష్‌ట్యాగ్.. బాయ్‌కాట్ పిలుపునిస్తే సినిమా ఫ్లాప్ అవుతుందా..?
Boycott: బహిష్కరణ పిలుపు.. అదేనండి బాయ్‌కాట్ ట్రెండ్.. బాలీవుడ్‌ను కుదిపేస్తోంది.
Boycott: బహిష్కరణ పిలుపు.. అదేనండి బాయ్‌కాట్ ట్రెండ్.. బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. రీజన్ ఏదైనా, ఎలాంటిదైనా దాదాపు ప్రతీ సినిమా ఈ హ్యాష్‌ట్యాగ్‌కు గురవుతోంది. వినోదాన్ని పంచాల్సిన సినిమా వివాదానికి కేరాఫ్‌గా మారుతోంది. మొన్నటివరకు బాలీవుడ్‌లో రూపొందిన సినిమాలు ఈ బాయ్‌కాట్ దాడికి గురికాగా ఇప్పుడు పాన్ ఇండియన్ మూవీస్ అన్నీ ఈ పనికిరాని ట్రెండ్‌కు బలవుతున్నాయి. మరి బాయ్‌కాట్ పిలుపు ఇచ్చినంత మాత్రాన దాన్ని సీరియస్‌గా తీసుకోవాలా..? అసలా ప్రచారాన్ని పట్టించుకోవాలా..? బాయ్‌కాట్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే సినిమా ఇక ఫ్లాపేనా..? మరి జనాధరణ పొందుతున్న సినిమాల సంగతేంటి..? బాలీవుడ్‌పై వేలాడుతున్న బాయ్‌కాట్ కత్తిపై హెచ్‌ఎంటీవీ ప్రత్యేక కథనం.
కరోనా సమయంలో అన్నింటికంటే ఎక్కువగా సినీ రంగమే తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. దాని ప్రభావం తర్వాత దక్షిణాది సినీ పరిశ్రమలు కోలుకోగా బాలీవుడ్ మాత్రం ఇప్పటికీ కిందా మీదా పడుతూనే ఉంది. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా అవి మాత్రం జనాధరణ పొందడం లేదు. ఇలాంటి సమయంలో బాయ్‌కాట్ ట్రెండ్ బాలీవుడ్‌ను కుదిపేసింది. అలా సినిమా విడుదల కావడం ఇలా బాయ్‌కాట్‌కు బలికావడం కామన్‌గా మారిపోయింది. ఇటీవల విడుదలైన చాలా చిత్రాలు ఈ రకం హ్యాష్‌ట్యాగ్‌కు గురవుతున్నాయి. తొలుత ఈ విషయంపై పెద్ద చర్చే జరిగింది.
ఆ మధ్య రిలీజ్ అయిన ఆమీర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చడ్డా తో పాటు బ్రహ్మాస్త్ర, లైగర్, విక్రమ్ వేద, రక్షాబంధన్, తాజాగా పొన్నియన్ సెల్వన్ ఇలా అన్ని సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత స్పెషల్ క్యాంపెయిన్ కూడా నిర్వహించారు. చివరకు ట్రెండింగ్‌గా మార్చారు. దీంతో సినిమాపై రిలీజ్‌కు ముందే ఫ్లాప్ ముద్ర వేసేవారు. అలా బాలీవుడ్‌లో ఏదైనా సినిమా విడుదలవుతుందంటే చాలు దాని నిర్మాత, డైరెక్టర్, ఇతర టీమ్ అంతా భయంలోకి వెళ్లేవారు. కోట్లు పెట్టి సినిమా తీస్తే చివరకు నష్టాల మూట కట్టుకునే వారు.
అయితే ఈ బాయ్‌కాట్ పిలుపునకు కారణాలు చాలానే ఉన్నాయి. మతానికో, వర్గానికో, గతంలో చేసిన పనులకో ముడిపెట్టి బాయ్‌కాట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టేవారు. ఉదాహరణకు ఆ మధ్య ఆమీర్‌ఖాన్ భారీ బడ్జెట్‌తో రిలీజ్ చేసిన లాల్‌సింగ్ చడ్డా మూవీ విడుదలకు ముందే బాయ్‌కాట్ కు గురైంది. మోడీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అంటే 2015 లో ఆమీర్‌ఖాన్, అప్పటి ఆయన భార్య కిరణ్‌రావు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తే ఇప్పుడు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. కొందరు దేశ సమైక్యతకు విఘాతం కలిగిస్తున్నారని ఆమీర్‌ఖాన్, పిల్లల భవిష్యత్తు కోసం దేశాన్ని వీడటం మంచిదని కిరణ్‌రావు వ్యాఖ్యలను పట్టుకుని హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. కానీ ఒకసారి గుర్తు చేసుకుంటే 2015 తర్వాత ఇదే ఆమీర్‌ఖాన్ నుంచి ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోని నెటిజెన్స్ లాల్‌సింగ్ చడ్డాపైనే ఎందుకు పడ్డారు..?
ఇందుకు కూడా కారణాలున్నాయి. వాస్తవానికి బాయ్‌కాట్ ట్రెండ్ ఇప్పట్లో వచ్చిందేమీ కాదు. రెండేళ్ల క్రితమే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాత సినీ ప్రేమికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుశాంత్ సింగ్‌ను నెపోటిజమే బలి తీసుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో బాయ్‌కాట్ కరణ్ జోహార్, బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ సోషల్ మీడియాలో స్పెషల్ క్యాంపేయిన్ నిర్వహించారు. ఈ క్రమంలో వారసత్వంగా వచ్చిన నటీనటులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. చాలామంది హీరోలు, హీరోయిన్లు సోషల్ దాడులను ఎదుర్కొన్నారు. బోనీకపూర్ తనయుడు అర్జున్ కపూర్, జాకీష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్, సైఫ్ కూతురు సారా అలీఖాన్, శత్రుఘ్న సిన్హా తనయ సోనాక్షి సిన్హా లాంటి నట వారసులంతా కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఆనాటి నుంచి ఈ బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ నడుస్తుంటే ఈ మధ్య పీక్స్‌కు చేరుకుంది. సుశాంత్ విషయంలో విజయం అందుకున్న నెటిజెన్స్ ప్రస్తుతం ఏదో వంక పెట్టుకుని బాయ్‌కాట్ కు పిలుపునిస్తున్నారు. ఎంతలా అంటే బహిష్కరణకు గురిచేసిన సినిమాపై కామెంట్స్ చేస్తే చాలు వారి తర్వాత చిత్రాన్ని కూడా బాయ్‌కాట్ జాబితాలోకి చేరుస్తున్నారు. లాల్‌సింగ్ చడ్డా బాగుందన్న హృతిక్ రోషన్ నెక్ట్స్ మూవీ విక్రమ్ వేద కూడా దీని బారిన పడింది. దీంతో ఇలాంటి విషయంలో ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరూ నోరు మెదపడం లేదు.
కొన్నిసార్లు బాయ్‌కాట్ కు కారణాలను విశ్లేషిస్తే చాలా సిల్లీగా ఉంటాయి. కరోనా తర్వాత అతి భారీ బడ్జెట్‌తో రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర మూవీ కూడా ఈ రకం హ్యాష్‌ట్యాగ్‌కు గురైంది. తొలుత ఈ మూవీ హీరో రణ్‌బీర్ గతంలో బీఫ్ ఇష్టంగా తింటానన్న వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ తర్వాత బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర అని పిలుపునిచ్చారు. లేటెస్ట్‌గా ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ ఆదిపురుష్ టీజర్‌పై ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. రాముడి అహార్యం నుంచి రావణుడి మేకప్ వరకు రకరకాల ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రావణుడి క్యారెక్టర్ చేసిన సైఫ్ అలీఖాన్ రూపం మహ్మద్ ఖిల్జీ లా ఉందని, ఆయన కుమారుడికి ఇండియాపై దండెత్తిన తైమూర్ ఖాన్ పేరును పెట్టుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఇటు రామాయణ ఇతిహాసాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారంటూ బాయ్‌కాట్ ఆదిపురుష్‌కు పిలుపునిచ్చారు. రీసెంట్ హిట్ మూవీ పొన్నియన్ సెల్వన్ కు కూడా ఈ బాయ్ కాట్ సెగలు తగిలాయి.
అయితే బాయ్‌కాట్ పిలుపునిచ్చినంత మాత్రాన సినిమా ఫ్లాప్ అయినట్టేనా..? సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే మూల్యం చెల్లించుకోవాల్సిందేనా..? అంటే అంత లేదనే చెప్పుకోవాలి. బ్రహ్మాస్త్ర కావచ్చు, పొన్నియల్ సెల్వన్ కావచ్చు వీటిని బాయ్‌కాట్ చేయాలంటూ ఎంతలా ట్రోల్ చేసినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బాయ్‌కాట్‌కు ఏదైనా కారణం ఉండొచ్చు కానీ కంటెంట్ ఉంటే మాత్రం అలాంటి పిలుపులకు ఎలాంటి బెరుకులు ఉండవు. జనాధరణకు ఢోకా ఉండదని నిరూపిస్తున్నాయి. ప్రస్తుతం బాయ్‌కాట్ కత్తికి పదును తగ్గింది. ఆ హ్యాష్ ట్యాగ్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. కంటెంట్ ఉండాలే కానీ సినిమాను చూసేందుకు రెడీ అవుతున్నారు. థియేటర్లా, ఓటీటీనా ఎక్కడైనా మూవీ హిట్ చేస్తున్నారు. వైఫల్యానికి కథో, కథనమో తేడా ఉండొచ్చు కానీ బాయ్‌కాట్ ప్రభావంతో ఫ్లాప్ కాదని తేలిపోయింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire