విడుదల కాకుండానే ఓవర్సీస్ లో రికార్డుల 'ఉప్పెన'

Uppena movie records in Overseas
x

ఉప్పెన సినిమాలో ఓ స్టైల్ (ఫైల్ ఫోటో)

Highlights

తెలుగు సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ ఎప్పుడూ అండగా ఉండేది. పెద్ద హీరోల సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా ఓవర్సీస్(Overseas) లో కలెక్షన్ల వర్షం...

తెలుగు సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ ఎప్పుడూ అండగా ఉండేది. పెద్ద హీరోల సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా ఓవర్సీస్(Overseas) లో కలెక్షన్ల వర్షం కురిపించేవి. ముఖ్యంగా ఓపెనింగ్ కలెక్షన్లకు ఓవర్సీస్ మార్కెట్ కీలకంగా ఉండేది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా మహమ్మారితో సినిమా పరిశ్రమ తీరుతెన్నుల్లో పెనుమార్పులు వచ్చాయి. చాలా సినిమాలు ఓటీటీలో విడుదల చేసి నిర్మాతలు హమ్మయ్య అనుకున్నారు. కొన్ని సినిమాలు మాత్రం ధియేటర్ల కోసం ఎదురుచూపులతో కాలం గడిపాయి. కరోనా పరిస్థితులు గాడిన పడటం సినిమా హాళ్లు తెరుచుకోవడంతో కొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మెల్ల మెల్లగా సినిమాల కలెక్షన్లు గాడిన పడుతున్నాయి. ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో ధియేటర్ల విషయం.

కానీ, తెలుగు సినిమా (Telugu Movies) లకు ఇక్కడి మార్కెట్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓవర్సీస్ మార్కెట్ కూడా ఉండేది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఓవర్సీస్ లో తెలుగు సినిమా రిలీజ్ పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడ మిలియన్ డాలర్ల కలెక్షన్ల పంట పండించే తెలుగు సినిమాలకు ప్రస్తుతం గిరాకీ పడిపోయింది. కరోనా భయాలు ఒక కారణం అయితే, రెండో కారణం ఓటీటీ. సినిమా విడుదలైన రెండు మూడు వారాల్లో ఓటీటీలో సినిమా రిలీజ్ అయిపోయే అవకాశాలు ఉండటంతో ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు మినిమమ్ ఓపెనింగులు కూడా లేకుండా అయిపొయింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ తప్పితే ఏ సినిమాకు ఓవర్సీస్ లో ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు.

మెగా స్టార్ చిరంజీవి ఆచార్య(Chiranjeevi Acharya), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్(Vakeel Saab) సినిమాలకు కూడా ఓవర్సీస్ మార్కెట్లో పెద్దగా బిజినెస్ లేదని చెప్పుకుంటున్నారు. ఇక్కడ మార్కెట్ పెరగాలంటే కచ్చితంగా ఒక పెద్ద సినిమా విడుదల అయి సూపర్ హిట్ కావలసిందే అని ట్రేడ్ వర్గాలు భావిస్తూ వస్తున్నాయి. కానీ, వారి అంచనాలను తల్లకిందులు చేసింది ఓ చిన్న సినిమా.

ఆ సినిమా కూడా మెగా వారసుడి సినిమా కావడం విశేషం. అది వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' సినిమా. ఈ సినిమా ఒక్క అమెరికాలోనే 80 లొకేషన్లలో విడుదల కానుందని చెబుతున్నారు. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలతో కలిపి ఈ సినిమా 110 లొకేషన్లలో విడుదల అవుందని భోగట్టా. ఇది ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. దాదాపుగా 200 లొకేషన్లలో విడుదల కానున్న 'ఉప్పెన' సినిమా హిట్ అయితే, కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. ఒక అంచనా ప్రకారం 500 డాలర్ల వరకూ కలెక్షన్లు వసూలు చేసేందుకు ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తంగా చూసుకుంటే విదేశాల్లో కలెక్షన్ల 'ఉప్పెన' పై తెలుగు సినీ పరిశ్రమ చాలా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఆ ఆశలు నెరవేరితే మళ్ళీ సినిమాలకు పూర్వపు సందడి వచ్చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories