K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత

Tollywood Director K Viswanath Passed Away
x

K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూత

Highlights

K.Viswanath: అనారోగ్యంతో కన్నుమూసిన కాశీనాథుని విశ్వనాథ్

K.Viswanath: శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సిరివెన్నెల, స్వాతిముత్యం, శుభసంకల్పం, స్వయంకృషి, సాగర సంగమం... తెలుగు సినీరంగానికి ఇలాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలనిచ్చిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె.విశ్వనాథ్‌గా ప్రఖ్యాతి గాంచిన కాశీనాథుని విశ్వనాథ్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వయోభారం వల్ల ఆయన ఈ మధ్య కాలంలో పలుమార్లు ఆస్పత్రిలో చేరినా... కోలుకుని తిరిగి వచ్చారు. అయితే రెండురోజుల క్రితం ఆయన తిరిగి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఎప్పటిలాగే తిరిగొస్తారని కుటుంబసభ్యులు, అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఆశించారు. కానీ ఆయన ఇక సెలవంటూ వెళ్లిపోయారు.

విశ్వనాథ్‌ భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద్దపులివర్రు గ్రామంలో జన్మించిన విశ్వనాథ్‌ ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయనకు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన శంకరాభరణం సినిమా విడుదల రోజైన ఫిబ్రవరి 2వ తేదీనే కె.విశ్వనాథ్‌ కన్నుమూయడం విశేషం. 1930 ఫిబ్రవరి 19న జన్మించిన విశ్వనాథ్‌.. 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందారు. ఆయన మరణంతో తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు కె.విశ్వనాథ్‌ జన్మించారు. ప్రాథమిక విద్య గుంటూరు జిల్లాలోనే సాగినా... ఆ తర్వాత ఆయన కుటుంబం విజయవాడకు మకాం మార్చింది. అయితే కాలేజీ చదువు మాత్రం గుంటూరులో సాగింది. బీఎన్‌ రెడ్డి, నాగిరెడ్డి ఆరంభించిన వాహినీ పిక్చర్స్‌లో విజయవాడ బ్రాంచికి జనరల్‌ మేనేజర్‌గా పనిచేశారు. బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత చెన్నై వాహినీ స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించారు. అన్నపూర్ణ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన 'తోడికోడళ్లు' సినిమాకు పనిచేస్తున్నప్పుడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఆదుర్తి దర్శకత్వంలో 'ఇద్దరు మిత్రులు', 'డాక్టర్‌ చక్రవర్తి' వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. కె. విశ్వనాథ్‌ ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తన సంస్థ 1965లో నిర్మించిన 'ఆత్మగౌరవం' సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు. 'సిరిసిరిమువ్వ' సినిమాతో కె.విశ్వనాథ్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది.

అప్పటి నుంచి చివరి సినిమా 2016లో నిర్మించిన 'శుభప్రదం' వరకు విశ్వనాథ్‌ 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో 41 తెలుగు కాగా... 10 హిందీ. సాగరసంగమం, శ్రుతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వయంకృషి తదితర అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. విశ్వనాథ్‌ చిత్రాలన్నీ సంగీత ప్రాధాన్యంగా సాగడం ఓ విశేషం. నటుడిగానూ వెండితెరపై తనదైన ముద్రవేశారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సీతారామయ్య గారి మనవరాలు, ఠాగూర్, అతడు, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ తదితర చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ఏ సినిమా తీసినా అది ఆరంభించి, ముగించే వరకూ షూటింగ్‌కి ఖాకీ బట్టలు ధరించడం విశ్వనాథ్‌‌కి అలవాటు. తనను తాను కార్మికుడిలా భావిస్తానని, అందుకే ఖాకీ తొడుక్కుంటానని పలు సందర్భాల్లో విశ్వనాథ్‌ పేర్కొన్నారు. తాను దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్‌ చేశారు. వాటిలో సిరిసిరిమువ్వ చిత్రాన్ని సర్గమ్‌, శంకరాభరణం సినిమాను సుర్‌సంగమ్‌, శుభోదయం చిత్రాన్ని కామ్‌చోర్‌, శుభలేఖ సినిమాను శుభ్‌కామ్నా, జీవనజ్యోతి చిత్రాన్ని సమ్‌జోగ్‌ పేర్లతో హిందీలో రీమేక్ చేశారు.

విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన 'శంకరాభరణం' సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు 'సప్తపది'కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. 'స్వాతిముత్యం' సినిమా 1986లో ఆస్కార్‌ అవార్డుల నామినేషన్లకు అధికారిక ప్రవేశం పొందింది. మొత్తం ఐదు జాతీయ అవార్డులు లభించాయి. భారతీయ సినిమాకు చేసిన సేవకు గాను విశ్వనాథ్‌కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కేతో పాటు ఐదు నంది అవార్డులు, 10 ఫిలింఫేర్‌ అవార్డులు, 'సాక్షి' లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కూడా అందుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories