వెన్నెలంటి పాటల చిరునామా వెన్నెలకంటి

వెన్నెలంటి పాటల చిరునామా వెన్నెలకంటి
x
Highlights

* 3వేల పాటలు..300 చిత్రాలకు మాటలు * అద్భుత అనువాద రచయితగా గుర్తింపు

వెన్నలంటి అక్షరాలను చుట్టి తెలుగు సాహితీలోకంలో పాటల కాంతులను వెలిగించిన వెన్నెలకంటి ఇక లేరు. అనువాదాల ఆనందాన్ని, తన వెన్నెల వన్నెలను మనకందించిన వెన్నెలకంటి మాట రాని మౌనంలా స్వర్గాల తీరాలకు తరలిపోయారు. చిత్రసీమలో చెరగని వెన్నెల సంతకాలు ఆయన పాటలు.. 3 వేలకు పైగా పాటలు రాసి సంగీత అభిమానులను మనుసు రంజింపచేశారు.

స్వాతికిరణంలో బాలనటుడు చెట్లవెంటా, గట్లమీదా తిరుగుతూ పాడుకునే ఒక పాట రాయాలంటూ కళాతపస్వి విశ్వనాథ్ వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్‌కు కబురు పంపారు. మహద్భాగ్యంగా భావించి, కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో.. కోరి కోరి కూసింది కోయిలమ్మ.. అంటూ అద్భుత పాటను అందించారు. ఆ పాటను విన్న విశ్శనాథ్‌ అలతి పదాలతో ఎంత కమ్మగా రాశావయ్యా అంటూ అభినందించారు.

వెన్నెలకంటి అంటే డబ్బింగ్‌ పాటలకు పెట్టింది పేరు. డబ్బింగ్ పాటలు రాయాలంటే చరిష్మా ఉండాలి. డబ్బింగు సినిమాల్లో కట్టుబాట్లు ఎక్కువ. పెదవుల కదలికలకు సంబంధించిన ఆంక్షలుంటాయి. ఇక క్లోజప్‌ షాట్స్ ఉన్నప్పుడు పాట రాయడానికి రచయిత శ్రమించాలి. పెదవుల కదలికలకు లోబడి అక్షర సాధన చేయాల్సి ఉంటుందని అంతటి సాహసహానికి పూనుకున్నారు వెన్నెలకంటి.

'గజినీ' సినిమాలో హృదయం ఎక్కడున్నదీ.. నీ చుట్టూనే తిరుగుతున్నదీ అనే పాటను ఇప్పుడు విన్నా యువకుల హృదయాలు గాయాలయితాయి.

ఇక 'చంద్రముఖి' సినిమాలో ''కొంత కాలం కొంత కాలం కాలమాగిపోయాలి అంటూ డబ్బింగ్‌ పాట రాశారు వెన్నెలకంటి. ముందు విజువల్‌ చూడకుండా పాట రాశారు వెన్నెలకంటి. అందులో లాంగ్‌ షాట్లు ఉండడంతో మొదట రాసిన పాట తీసేసి వేరే పాట రాశారు. తమిళ వర్షన్‌లో ''కాలం'' అనే మాట ఒకసారే వస్తుంది. కానీ తెలుగులో ''కాలం'' మీద పూర్తి ప్రయోగం చేశారు వెన్నెలకంటి.

వెన్నెలకంటి ఎన్టీ రామరావు అభిమాని. ఆయన ప్రస్థావనను తాను రాసే పాటలో ప్రస్థావించాలని భావించేవారు. ఆ సమయంలో 'భాషా' సినిమాలో చాన్స్ వచ్చేసింది. ఇంకేముంది అన్నగారి మీద ఉన్న అభిమానాన్ని వాడేసుకున్నారు. ''నేను ఆటోవాణ్ణి, ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి - న్యాయమైన రేటు వాణ్ణి.. ఎదురులేని ఆటగాణ్ణి'' ''మంచోళ్లకు మంచివాణ్ణి.. తప్పుడోళ్ల వేటగాణ్ణి.. అచ్చమైన తెలుగువాణ్ణి'' అంటూ తెలుగుదనం నింపేశారు. ఆ సాంగ్ ఎంత హిట్టయిందో మనందరికీ తెలిసిందే..

వెన్నెలకంటి మృతి పట్ల దక్షణాది సినీలోకం కంటతడి పెడుతోంది. పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. నేడు చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నాయని వెన్నెలకంటి కుటుంబసభ్యులు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories