సంచలనం రేపుతున్న ది కశ్మీర్‌ ఫైల్స్‌.. దేశవ్యాప్తంగా ఈ సినిమపై జోరుగా చర్చ..

The Kashmir Files Box Office Blockbuster
x

సంచలనం రేపుతున్న ది కశ్మీర్‌ ఫైల్స్‌.. దేశవ్యాప్తంగా ఈ సినిమపై జోరుగా చర్చ..

Highlights

The Kashmir Files: ది కాశ్మీర్‌ ఫైల్స్‌.. ఇప్పుడు ఏ నోట విన్నా ఈ సినిమా గురించే చర్చ.

The Kashmir Files: ది కాశ్మీర్‌ ఫైల్స్‌.. ఇప్పుడు ఏ నోట విన్నా ఈ సినిమా గురించే చర్చ... కశ్మీరీ పండిట్ల ఊచకోతపై కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు కలెక్షన్లలో సునామీ సృష్టిస్తోందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని.. సినిమా ప్రదర్శనను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని, వాస్తవాలను ప్రజలకు తెలియజేశారని దర్శకుడి కృషి అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మెచ్చుకున్నారు. సంచలనం రేపుతున్న ది కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై దేశవ్యాప్తంగా ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.

1990 దశకంలో జమ్మూ-కశ్మీర్‌లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన సాయుధ తిరుగుబాటు చెలరేగింది. కశ్మీరీ హిందువులు ముఖ్యంగా పండిట్లను ఇస్లామిక్‌ మిలెటంట్లు లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడుతూ నరమేధాన్ని సృష్టించాయి. కాశ్మీరీ పండిట్ల మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. సజీవ దహనాలు చేశారు... ఇళ్లను లూటీ చేసి... ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా లక్షలాది హిందూ కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో సొంత ఇళ్లను, ఆస్తులను, బంధుత్వాలను వదలి దిక్కుకొకరుగా వలస వెళ్లిపోయారు. అప్పటి వాస్తవాలను ది కాశ్మీర్‌ ఫైల్స్‌ పేరిట దర్శకుడు వివేక‌ అగ్నిహోత్రి తెరకెక్కించారు.

దశాబ్దాల కాశ్మీర్ హింసను ఇప్పటివరకు అనేక మంది పుస్తక రూపంలో వెలుగులోకి తెచ్చారు. సినిమాలు కూడా వచ్చాయి. కానీ నిర్వాసితులైన కాశ్మీర్‌ పండిట్ల కుటుంబాలు, వారి దుస్థితికి గల కారణాలపై ఎవరూ అంతగా దృష్టి పెట్టలేదు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారనే వేదన కాశ్మీరీ పండిట్లను వేదించేది. ఈ విషయమై వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది. మెజార్టీ వర్గం నాటి పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నాయా? అయ్యో.. కశ్మీరీ పండిట్లు అంత బాధపడ్డారా? అంటూ ఆవేదన చెందుతున్నారు. మరో వర్గం మాత్రం తమను రాక్షసులుగా చిత్రీకరించి తమ మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వారం క్రితం విడుదలైన ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా బాగుందని.. నాటి నిజాలను కళ్లకు కట్టినట్టు చూపిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తెలిపారు. రెండ్రోజుల క్రితం అంబేద్కర్‌ సెంట్రల్‌హాల్‌లో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ సినిమా గురించి ప్రస్తావించారు. ఇలాంటి సినిమాలను నిర్మించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా నిజాలను బయటపెట్టిందన్నారు. ఎన్నో ఏళ్లుగా దాచిపెట్టిన నిజం ఈ సినిమా ద్వారా బయటపడిందన్నారు. ఎవరైనా నిజాన్ని దాచి పెట్టాలనుకుంటున్నారో వారే ఈ చిత్ర ప్రదర్శనను వ్యతిరేకిస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ తరువాత చిత్ర బృందం ప్రధాని మోదీని కలిసింది.

కశ్మీరీ పండిట్లను ఊచకోత కోసిన హంతకులుగా తమను చూపించి దర్శకుడు తమ మనోభావాలను గాయపరిచారంటూ ఒక వర్గం వారు న్యాయస్తానాలను ఆశ్రయించారు. తాజాగా ది కశ్మీర్‌ ఫైల్స్‌ అంశం కర్ణాటక మండలని కుదిపేసింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలతో అట్టుడికింది. కొద్దిసేపు వాయిదా కూడా పడింది. మండలి చైర్మన్‌ బసవరాజ్‌ హొరట్టి కశ్మీర్‌ఫైల్స్‌ సినిమా మీద చేసిన ప్రకటనే వివాదానికి కారణం. ఈ సినిమా చూడాలని ఆయన సభ్యులను కోరడంతో సభలో గందరగోళం రేగింది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పన్ను రాయితీని ప్రకటించింది.

కర్ణాటకతో పాటు హర్యానా, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, గోవా, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలు సినిమాకు పన్ను రాయితీని మినహాయింపునిచ్చాయి. అంతేకాకుండా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ది కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా చుసేందుకు పోలీసులకు ప్రత్యేక సెలవును మంజూరు చేసింది. అయితే అస్సాం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఈ సనిమా చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా ఆఫ్‌ డే హాలిడేను ప్రకటించడం గమనార్హం. అస్సాం ప్రభుత్వం నిర్ణయంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సినిమా ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయడం కొందరిని విస్మయానికి గురిచేస్తోంది.

ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై సోషల్‌ మాడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కూడా స్పందించారు. ఈ సినిమా ద్వారా దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి బాలీవుడ్‌ పాపాలన్నింటిని కడిగిపారేశారని కంగనా రనౌత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించింది. చిత్ర పరిశ్రమ గర్వపడేలాంటి సినిమా చేశారని వివేక్‌ అగ్నిహోత్రిని, చిత్ర బృందాన్ని అభినందించారు. ఒకప్పుడు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో నిశించే కోట్లాది హిందువుల గురించి కూడా ప్రస్తావించింది. మన దేశంలో నాటి కంటే ముస్లింల సంఖ్య పెరిగిందని.. అదే బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లో హిందువుల ఎలా ఉన్నారో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

ఈ సినిమాకు ఎంత ఆదరన లభిస్తోందో.. అంతే వివాదాలు చుట్టుముడుతున్నాయి. నాణేనికి ఒకవైపు మాత్రమే చూపుతున్నారని.. తమను విలన్లుగా చూపుతున్నారని ఓ వర్గం విరుచుకుపడుతోంది. కాశ్మీరీ పండిట్ల ఊచకోతలో తమను హంతకులుగా చిత్రీకరించి.. తమ మనోభావాలను గాయపరిచారని యూపీకి చెందిన ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిత్ర ప్రదర్శనను నిలిపేయాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కోరారు. కశ్మీర్‌ తిరుగుబాటు సంఘటనలను తప్పుగా చూపించారంటూ భారత సాయుధ దళాల్లో స్వాడ్రన్‌ లీడర్‌గా పని చేసి.. అమరుడైన ఓ సైనికుడి భార్య ఈ సినిమాపై పరువు నష్టం దావా కూడా వేశారు.

మరోవైపు హిందూ సంఘాల నుంచి విశేష ఆధరణ లభిస్తోంది. మొదట్లో ఈ సినిమా పెద్దగా ఎవరి దృష్టిలో పడలేదు. ప్రధాని మోదీ, మంత్రులు దీనిపై వ్యాఖ్యలు చేయడంతో పలువురు సినిమాను చూసేందుకు థియటేర్లకు వెళ్తున్నారు. దీంతో తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం భారీగా వసూళ్లను రాబడుతోంది. ఐదు రోజుల్లోనే 60 కోట్లరూపాయలకు పైగా వసూలు చేసింది. నూరు కోట్ల వసూలు దిశగా పరుగులు పెడుతున్నట్టు చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను చూడడానికి దేశమంతటా ఆసక్తి చూపుతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. కశ్మీరీ పండిట్లు, హిందువులపై జరిగిన ఊచకోతను కళ్లకు కట్టినట్టుగా చూపారని రాజాసింగ్‌ అన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ కశ్మీర్‌ ఫైల్స్‌కు పన్ను మినహాయింపును ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణను ఒకప్పుడు పాకిస్థాన్‌లో కలపాలని కాశీం రజ్వీ ప్రయత్నించారని.. అతడికి ఫాలోవర్‌గానే ఎంఐఎం వ్యవహరిస్తోందని రాజా సింగ్‌ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories