Ananth Sriram: ఏ నిర్మాత ముందుకొస్తారో చూద్దాం... అనంత్ శ్రీరామ్ స్ట్రాంగ్ వార్నింగ్

Ananth Sriram: ఏ నిర్మాత ముందుకొస్తారో చూద్దాం... అనంత్ శ్రీరామ్ స్ట్రాంగ్ వార్నింగ్
x
Highlights

Ananth Sriram comments on Tollywood Celebrities: తెలుగు సినీపరిశ్రమ పోకడలపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ,...

Ananth Sriram comments on Tollywood Celebrities: తెలుగు సినీపరిశ్రమ పోకడలపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం... ఈ రెండిటిని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతోందన్నారు. తెలుగు సినీరంగంలో జరిగే తప్పులను బాహాటంగానే విమర్శిస్తున్నానని అన్నారు. సినీ రంగానికి చెందిన వాడిగా ఇప్పటివరకు సినిమాల్లో జరిగిన హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం సమాజానికి వివరిస్తున్నానని తెలిపారు.

ముందుగా తాను సినీ రంగం తరపున హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతున్నానని అనంత్ శ్రీరామ్ చెప్పుకొచ్చారు. ఇక్కడ తాను క్షమాపణలు చెప్పకుండా మాట్లాడే అర్హత కూడా తనకు లేదన్నారు. మన పురాణాలు, ఇతి హాసాల గొప్పతనాన్ని సినిమాల్లో తగ్గించి పాత్రలు మార్చేస్తున్నారు అని అన్నారు. చరిత్రను వక్రీకరించి హిందూ ధర్మాన్ని తక్కువగా చూపిస్తున్నారని వాపోయారు.

వ్యాసుడు, వాల్మీకిల రచనలను వినోదం కోసం వక్రీకరించారు అని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నిన్న, మొన్న వచ్చిన కల్కి చిత్రం వరకు ఆ రచనలను అవమానిస్తున్నారు అని అనంత్ శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో కర్ణుడి పాత్ర గురించి ప్రస్తావిస్తూ... ఆ పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి సినిమా వాడిగా సిగ్గు పడుతున్నాను అని అన్నారు.

"దమ్మారో దమ్" అంటూనే "హరే రామ హరే కృష్ణ" అని ఎలా అంటారని ప్రశ్నించారు. "హరే రామ హరే కృష్ణ" అనే ఇస్కాన్ వారి నినాదాన్ని సిగరేట్ తాగుతూ అవమానిస్తారా అని అనంత్ శ్రీరామ్ నిలదీశారు. ఇటువంటి వాటిని చూస్తూ ఊరుకుందామా, సహిద్దామా, భరిద్దామా అని హిందూ సమాజానికి ప్రశ్నలు సంధించారు. రాముడు, కృష్ణుడు గొప్పతనం‌ చెబుతూ సిరివెన్నెల రాసిన‌ పాటలను ఆదర్శంగా తీసుకోండని సినీ ప్రముఖులకు అనంత్ శ్రీరామ్ (Ananth Sriram comments on Tollywood celebrities) హితవు పలికారు.

మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా గురించేనా అనంత్ శ్రీరామ్ వ్యాఖ్యానించింది?

మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా పబ్ సన్నివేశంలో ప్రకాశ్ రాజ్‌కు మహేష్ బాబుని పరిచయం చేసే సన్నివేశంలో బ్యాగ్రౌండ్లో దమ్మారో దమ్ అంటూనే హరే రామ హరే కృష్ణ సాంగ్ ప్లే అవుతుంటుంది. అదే సమయంలో ప్రకాశ్ రాజ్ సిగరెట్ తాగుతూ కనిపిస్తారు. ఈ సీన్‌ను ఉద్దేశించే అనంత్ శ్రీరామ్ ఈ వ్యాఖ్యలు (Ananth Sriram comments on Mahesh Babu movie) చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ నటించిన కల్కి మూవీలో కర్ణుడి పాత్ర గురించి అయితే అనంత్ శ్రీరామ్ (Ananth Sriram comments on Kalki movie) డైరెక్టుగానే ప్రస్తావించారు.

నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీసినా మౌనంగా నిలబడ్డ కర్ణుడు ఎలా గొప్పవాడు - కల్కి చిత్ర దర్శకుడు, నిర్మాతలకు అనంత్ శ్రీరామ్ ప్రశ్న

నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీసేస్తున్నా మౌనంగా ఉండిపోయిన కర్ణుడు ఎలా గొప్పవాడు అవుతాడని అన్నారు. కల్కి సినిమాలో అగ్నిదేవుడు ద్వారా వచ్చిన అర్జునుడు కంటే... సూర్యుడు ద్వారా వచ్చిన కర్ణుడు గొప్ప అంటే హిందూ ధర్మం ఒప్పుకుంటుందా అని ప్రశ్నించారు. భారతంలోనే కాదు రామాయణంలోను, భాగవతంలోనూ ఇష్టానుసారంగా పురాణాలను మార్చివేస్తున్నారు అని అనంత్ శ్రీరామ్ అన్నారు. సినిమాల్లో వినోదం కోసం అభూత కల్పనలు వక్రీకరణలు చేస్తున్నా మనం చూస్తూ ఊరుకుంటున్నాం అని గుర్తుచేశారు. చిత్రీకరణలో, గీతాలపనలో ఎన్నో రకాల అవమానాలు జరిగాయన్నారు.


అందుకే ఆ దర్శకుడికి 15 ఏళ్లుగా పాటలు రాయలేదు

ఒక దర్శకుడు తన సినిమాలో రాసే పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే పదం ఉండకూడదని చెప్పారు. అందుకే 15 ఏళ్లుగా ఆ వ్యక్తికి తాను మళ్లీ పాటలు రాయలేదని అనంత్ శ్రీరామ్ తెలిపారు. తిరుపతి ఆలయాన్ని విమర్శిస్తూ ఉంటే నిర్మాతలు మిన్నుకుండి పోతున్నారని ఆరోపించారు. మార్కెట్ ఉందనే కారణంతో హిందూ ధర్మాన్ని అవమానించినా ప్రోత్సహిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఆ సినిమాలను బహిష్కరించాలి - అనంత్ శ్రీరామ్

హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వమే బహిష్కరించడం కంటే ముందుగా హిందువులే పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. జనం అలా చేయడం మొదలుపెట్టిన రోజు హిందువులను కించపరిచేలా ఉండే సినిమా చేసేందుకు ఏ నిర్మాత ముందుకొస్తారో చూద్దామని నిర్మాతలను నేరుగానే హెచ్చరించారు. అప్పుడే మన ధర్మానికి ఒక గౌరవం, గుర్తింపు ఉంటాయని అనంత్ శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన హైందవ శంఖారావం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ అనంత్ శ్రీరామ్ ఈ వ్యాఖ్యలు (Ananth Sriram Speech in Haindava Shankaravam) చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories