Tarakaratna: హైదరాబాద్‌కు చేరుకున్న తారకరత్న భౌతికకాయం

Tarakaratna Dead Body Reached Hyderabad
x

Tarakaratna: హైదరాబాద్‌కు చేరుకున్న తారకరత్న భౌతికకాయం

Highlights

Tarakaratna: శంకర్‌పల్లి మోకిలలోని స్వగృహానికి తారకరత్న పార్థివదేహం

Tarakaratna: నందమూరి తారకరత్న కన్ను మూశారు. జనవరి 26న యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయనకు గుండెపోటు రావడంతో కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 23 రోజులు చికిత్స పొందుతూ తారకరత్న తుది శ్వాస విడిచారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ శంకర్ పల్లిలోని మోకిళ్ల కంట్రీ విల్లాస్‌కు తారకరత్న పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. ఆయన మరణవార్తలో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి లోనైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్నకు నివాళులు అర్పిస్తున్నారు.

అలనాటి నటుడు ఎన్టీఆర్‌ కుమారుడు మోహన్‌కృష్ణ తనయుడు తారకరత్న. 1983 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో తారకరత్న జన్మించారు. అలేఖ్య రెడ్డిని 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 20 ఏళ్ల వయసులోనే కథానాయకుడిగా తారకరత్న తెరంగ్రేటం చేశారు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే నటనపై ఉన్న ఆసక్తితో.. 2002లో విడుదలైన 'ఒకటో నెంబర్‌ కుర్రాడు'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా విజయం సాధించడంతో తారకరత్నకు వరుస అవకాశాలు వచ్చాయి. అలా, ఆయన హీరోగానే కాకుండా విలన్‌, సహాయ నటుడిగానూ నటించి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. యువరత్న, భద్రాద్రి రాముడు, అమరావతి, నందీశ్వరుడు వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'అమరావతి' చిత్రానికి గానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డును అందుకున్నారు. ఇటీవల '9 అవర్స్‌' వెబ్‌ సిరీస్‌లో నటించి.. ప్రేక్షకుల్ని అలరించారు. తారకరత్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు. గతంలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేశారు.

తారకరత్న ఆస్పత్రిలో చేరగానే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల నుంచి పలువురు ప్రముఖులు నారాయణ హృదయాలయను సందర్శించారు. నందమూరి బాలకృష్ణ దగ్గరుండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. తారకరత్న తండ్రి మోహన్‌కృష్ణ, భార్య అలేఖ్యరెడ్డి, కుమార్తెలు నారాయణ హృదయాలయలోనే ఉండగా, సోదరుడు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తదితరులు ఆస్పత్రిని సందర్శించారు.

తారకరత్న మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, నారా లోకేశ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రవితేజతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories