Supreme Court: మోహన్ బాబును జైలుకు పంపాలా? లేక నష్టపరిహారం కావాలా?

Supreme Court: మోహన్ బాబును జైలుకు పంపాలా? లేక నష్టపరిహారం కావాలా?
x
Highlights

Supreme Court: జర్నలిస్ట్‌పై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది.

Supreme Court: జర్నలిస్ట్‌పై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ జరిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ జరిగే వరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

అయితే విచారణలో భాగంగా న్యాయస్థానం పలు ప్రశ్నలు అడిగింది. జర్నలిస్టులు లోపలికి వచ్చినంత మాత్రాన దాడి చేస్తారా? అంటూ మోహన్ బాబును ప్రశ్నించింది. అది ఆవేశంతో జరిగిన ఘటన అని బాధితుడికి పూర్తి నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మోహన్ బాబు తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు.

జర్నలిస్టులకు ఆహ్వానం లేకుండానే ఇంటికి వచ్చారని మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇది ఆవేశంలో జరిగిన ఘటన అని జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నట్టు తెలిపారు. నష్టపరిహారం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. మోహన్ బాబు వయస్సు 76 ఏళ్లని.. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు.

మోహన్ బాబు దాడిలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారని అతని తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ కారణంగా తాను ఐదు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందన్నారు. ఆ దాడి వల్ల వృత్తిపరంగా తనకు నష్టం జరిగిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నష్టపరిహారం కావాలా? మోహన్ బాబు జైలుకు వెళ్లడం కావాలా ? అని జర్నలిస్ట్ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ అంశం గురించి తదుపరి విచారణలో సమాధానం ఇస్తామని జర్నలిస్ట్ తరపు న్యాయవాది చెప్పడంతో మూడు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని రంజిత్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణ వాయిదా పడింది.

అసలేం జరిగిందంటే.. మంచు ఫ్యామిలీలో ఇటీవల వరుస గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో గత నెల 10న హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రంజిత్ అనే జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం కొట్టేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా నాలుగు వారాల పాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories