సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది.
Rajinikanth: ఆరడగుల అందగాడు కాదు.. ఆరు పలకల దేహం లేదు.. అదిరిపోయే డ్యాన్సులు చేయలేడు.. ఓ బక్కపలచటి రూపం ఆ రూపానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు చిన్న మేనరిజానికే ఈలలు, గోలలతో మైమరిచిపోతారు ప్రేక్షకులు. అతడే శివాజీ రావ్ గైక్వాడ్ కానీ అందరికి సూపర్ స్టార్ రజనీకాంత్ అంటేనే గుర్తుకువస్తాడు. స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రజనీని సినీ రంగంలో అత్యున్నత పురస్కారంతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు. ఈ అవార్డును కూడా భారతీయ సినీ పరిశ్రమకు ఓ వ్యక్తి చేసిన సేవలకు గుర్తింపుగా అందిస్తారు. సినీ రంగంలో అత్యున్నత పురస్కారం రావడం పట్ల రజనీ కుటుంబసభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్‌కు ఈ అవార్డును ప్రకటించడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.
51వ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రజనీకాంత్‌కు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'తరాల తరబడి ప్రాచుర్యం విభిన్నమైన పాత్రలతో రంజింపజేసి, మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తి రజనీకాంత్ అని కోనియాడారు.
భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారంతో గౌరవిస్తారు. 1969లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు. హిందీ చిత్ర సీమ నుండి 32 మంది ఈ అవార్డును అందుకున్నారు. మిగతా 18 మంది ఇతర భారతీయ భాష రంగం నుంచి ఎంపికయ్యారు. గతంలో కె.విశ్వనాథ్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు వంటి వారు ఈ అవార్డును అందుకున్నారు. గత ఏడాది రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అమితాబ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. ఈ ఏడాది గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సూపర్ స్టార్ రజనీకాంత్ కేంద్రం ప్రకటించింది. రజనీకాంత్ 2000లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.
రజనీ పలికిన పంచ్ డైలాగ్‌లు. నాన్నా.. పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది', 'బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టే', 'ఆ దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు', 'నా దారి రహదారి..' ఇలాంటి డైలాగ్‌లతో బాక్సాఫీసుని హోరెత్తించారు రజనీకాంత్. భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఆయనకు అభిమానులున్నారు. రజనీ సినిమా వస్తోందంటే దాని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే ఆయనకున్న ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారి, సేవాగుణంలో ముందుండే తలైవా అంటే అభిమానులకు చెప్పలేనంత ప్రేమ. కాలే కడుపుతోనే కళామతల్లిని నమ్ముకున్నాడు. అవకాశాల కోసం ఎదురు చూశాడు. చిన్నచిన్న వేషాలతో కెరీర్ ప్రారంభించి సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం వరకూ రజనీ లైఫ్ జర్నీ... ఎంతో ఇన్సిపిరేషన్.
రజనీకాంత్ ఈ పేరులో ఏదో మ్యాజిక్ ఉంది. సూపర్ స్టార్ స్టైల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. టవల్ తీసినా, నోటిలో బబుల్ గమ్ వేసుకున్నా, చుట్టను విసిరి నోటితో పట్టుకున్నా, కళ్లకు అద్దాలు పెట్టకున్నా ప్రతి దానిలో రజినీ మార్క్ స్టైల్ ఉంటుంది.
ఆయన నడిచొచ్చే విధానం, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, డ్యాన్స్ ఇలా ప్రతి ఒక్కటీ ప్రేక్షకుల్ని తెరకు లీనమయ్యేలా చేస్తాయి. మంచివాడు మొదట కష్టపడొచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు మొదట సుఖ పడొచ్చు కానీ ఓడిపోతాడు. భాషా మానిక్ భాషా ఈ భాషా ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు. ఇలా సూపర్ స్టార్ సినిమా అంటే డైలాగ్‌లకు పెట్టింది పేరు.
సినిమాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టైల్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. 'పుట్టుకతో వచ్చింది చచ్చేదాకా పోదు' అని 'నరసింహ' సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు ఆయన స్టైల్ ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉంది. అందుకే ఇప్పటికీ అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మామూలుగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అంటే పంచ్‌డైలాగ్‌లకు కొదువుండదు. తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ రజనీ చెప్పే డైలాగ్‌లు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంటాయి. అందుకే రజనీకాంత్ సినిమా డైలాగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు దర్శకులు, రచయితలు.
రజనీ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. 1950 డిసెంబరు 12న కర్ణాటకలో జన్మించారు. కొన్నాళ్లు కండక్టర్‌గా పనిచేసి నటనపై మక్కువతో చెన్నైకి వెళ్లారు. మద్రాసు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్‌లో డిప్లొమా చేశారు. కాలే కడుపుతోనే కళామతల్లిని నమ్ముకున్నారు. అవకాశాల కోసం ఎదురు చూశారు. అప్పుడే కె.బాలచందర్ దృష్టిలో పడ్డారు. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగల్'లో తొలి అవకాశం అందుకొన్నారు. అంచెలంచెలుగా ఎదిగి భారతీయ సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు.
కన్నడలో కథా సంగమ అనే చిత్రం చేశారు. తెలుగులో మళ్లీ బాలచందర్ దర్శకత్వంలోనే అంతులేని కథ, తమిళంలో మూడ్రు ముడిచు అనే చిత్రాలు చేసి తిరుగులేని నటుడిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో వరుసగా నటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1977లో రజనీకాంత్ 15 సినిమాలు చేస్తే అందులో ఎక్కువగా నెగిటివ్ రోల్‌తో కూడిన పాత్రలే చేశారు. కేరీర్ స్టాటింగ్‌లో విలన్‌గా నటించి పేరు తెచ్చుకొన్న ఆయన ఆ తరువాత హీరోగా వరుస విజయాలు అందుకొన్నారు. 80, 90వ దశకాల్లో చేసిన సినిమాలు ప్రభంజనం సృష్టించాయి.
దళపతి, నరసింహ, బాషా, ముత్తు, పెదరాయుడు, అరుణాచలం తదితర చిత్రాలు తమిళంతో పాటు, తెలుగులోనూ విశేష ఆదరణని సొంతం చేసుకొన్నాయి. చంద్రముఖి, శివాజీ, రోబో తదితర చిత్రాలు రజనీ స్థాయిని మరింత పెంచాయి. కథానాయకుడిగా కోట్లాది మంది గుండెల్లో ఉన్నా తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకొన్నా సాధారణ జీవితాన్ని కొనసాగించడానికే ఇష్టపడతారు రజనీకాంత్. ఇక రజనీ కెరీర్‌ను తెరిచి చూస్తే ఐదు రూపాలు నటన, స్నేహం, నిరాడంబరత, అభిమానుల పట్ల ప్రేమ, దాతృత్వ గుణం మనకు కనిపిస్తాయి. తన నటన, వ్యక్తిత్వంతో కోట్లాది అభిమానులను సంపాదించుకొన్న తలైవాకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire