పాపం సుశాంత్: నటుడిగా సిక్సర్లు బాదాడు.. జీవితాన్ని రనౌట్ చేసుకున్నాడు!
ఆర్థిక సమస్యలు, ప్రేమ విఫలం, ఒత్తిడి, మోసాలు, విరక్తి.. కారణం ఏదైనా కావొచ్చు..
ఆర్థిక సమస్యలు, ప్రేమ విఫలం, ఒత్తిడి, మోసాలు, విరక్తి.. కారణం ఏదైనా కావొచ్చు.. తాత్కాలిక సమస్యల్ని ఎదుర్కోలేక చాలా మంది సినీ నటులు క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే త్యజిస్తున్నారు. స్టార్ హోదా.. డబ్బు.. అభిమానులు.. గొప్ప పేరు ఉన్నా..ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తున్నారు.
మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది ప్రాణమే..చిచ్చోరే సినిమాలో సుశాంత్ చెప్పిన డైలాగ్. జీవితంలో ఆత్మహత్య ఒక్కటే పరిష్కార మార్గం కాదు అన్నాడు.. కానీ ఇదే మాటను నిజ జీవితంలో అన్వయించుకోలేక తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు.
వెండితెర ధోని ఆట ఆపేసాడు. మధ్యలోనే ఇన్నింగ్స్ ఆపేసిన సుశాంత్. అర్థాంతరంగా జీవితాన్ని ముగించిన యువ తార. బాలీవుడ్ యువ హీరో, ఎంఎస్ ధోని బయోపిక్ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణవార్త యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. సుశాంత్ హఠాన్మరణాన్ని అటు సినీ ప్రముఖులు, ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై తను ఉంటున్న నివాసంలోనే సుశాంత్ ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. ఎంతో భవిష్యత్తున్న సుశాంత్ మరణంతో ఉత్తర, దక్షిణాది సినీ ఇండస్ట్రీలన్నీ విషాదంలో మునిగిపోయాయి.
ఇటీవల సుశాంత్ ఇన్‌స్టాలో చేసిన చివరి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తన తల్లి గురించి కవితాత్మకంగా పెట్టిన పోస్ట్ నెటిజన్లను కంటతడిపెట్టిస్తోంది. మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా అంటూ తన అమ్మను తలచుకుంటూ జూన్3న ఇన్‌స్టాలో సుశాంత్ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.
కుంగుబాటే ఉసురు తీసిందా...? మానసిక సమస్యలే సుశాంత్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయా..? లేదా..ఇంకేమైనా కారణముందా..? సుశాంత్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి..?
కెరీర్ పరంగా ఢోకా లేదు.. ఆర్థికపరంగా ఆందోళన లేదు..కానీ సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు..?ఎంఎస్ ధోనీ మూవీలో సిక్సర్లు బాదిన సుశాంత్..తన లైఫ్ ను 34 ఏళ్లకే ఎందుకు బలవంతంగా ముగించాడు..? ఇప్పుడే ఇవే ప్రశ్నలు బాలీవుడ్ తో పాటు సుశాంత్ అభిమానుల మనసులను తొలుస్తున్నాయి. ధోనీ మూవీ తరువాత పెద్ద పెద్ద డైరెక్టర్లు, నిర్మాతలు సుశాంత్ వైపే చూశారు. దీంతో ఈ యంగ్ స్టర్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఆర్థికంగానూ సుశాంత్ నిలదొక్కుకున్నాడు. వెండి తెరకు పరిచయమైన తక్కువ సమయంలోనే తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకుని అందర్నీ దిగ్ర్బాంతికి గురి చేశాడు.
సుశాంత్ కెరీర్ విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ కొన్ని నెలలుగా మానసిక కుంగుబాటు సమస్యతో సమమతమవుతున్నట్లు తెలుస్తోంది. చివరికి ఆ ఒత్తిడే ఆయను బలితీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల తన అమ్మను తలచుకుంటూ ఇన్ స్టాలో చేసిన భావోద్వేగమైన పోస్ట్ పరిశీలిస్తే...సుశాంత్ నిజంగానే తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
సుశాంత్ ఆత్మహత్యకు మానసిక సమస్యలే కారణమని భావిస్తున్నప్పటికీ..ఇంకేమైన కారణాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. వారం క్రితమే సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలియాన్ భవంతి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దిశ ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజుల వ్యవధిలోనే సుశాంత్ తనువు చాలించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు...అయినా భయపడలేదు.. ప్రయత్నించాడు..సక్సెస్ అయ్యాడు.. డాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన సుశాంత్ బుల్లితెర అభిమానులను మెప్పించారు. ఆ తరువాత వెండితెరపైనా మెరిశాడు.. పీకే, ధోనీ, చిచ్చోరే సినిమాలతో బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు సుశాంత్.
సుశాంత్ సింగ్ 1986 జనవరి 21న పట్నాలో జన్మించాడు. చదువులో మెరిటి స్టూడెంట్.. ఏఐఈఈఈలో 7వ ర్యాంక్ సాధించిన సుశాంత్ ఢిల్లీ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ లో చేరాడు. అయితే నటనపై ఉన్న ఆసక్తి..సుశాంత్ ను ముంబైకి రప్పించింది.. డాన్సర్ అయిన సుశాంత్ మొదట బుల్లితెరపై మెరిశాడు. కిస్ దేశ్ మే హై మేరా దిల్, పవిత్ర విశ్తా షోలు ఆయనకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి.
బుల్లితెరపై సత్తా చాటిన సుశాంత్ 2013 కై పో చే తో హీరోగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అది సినీ విమర్శకులను మెప్పించడంతో.. ఆ తరువాత ఈ యంగ్ స్టర్ వెనుదిరిగి చూసుకోలేదు. శుద్ద్ దేసీ రోమాన్స్, పీకే చిత్రాలు సుశాంత్ కు మంచి గుర్తింపునిచ్చాయి. ఇక 2016లో వచ్చిన ఎంఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ మూవీతో సుశాంత్ కెరీర్ గ్రాఫ్ ను అమాంతం పెరిగింది. భారత మాజీ కెప్టెన్ ధోని జీవితం ఆధారంగా తీసిన ఆ సినిమాలో సుశాంత్ రియల్ ధోనీలా యాక్ట్ చేశాడు. ధోనీ హేర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ మొత్తం ఒంటబట్టించుకుని అందులో నటించాడు. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో ధోని అభిమానులు కూడా సుశాంత్ అభిమానులుగా మారిపోయారు.
ధోనీ మూవీ తరువాత బాలీవుడ్ లో సుశాంత్ క్రేజ్ మరింత పెరిగింది. వరుసగా అవకాశాలు రావడంతో..అక్కడి నుంచి సుశాంత్ వెనుదిరిగి చూడలేదు.. రాబ్తా, కేధార్‌నాధ్, సోన్ చిడియా, చిచ్చోరే, డ్రైవ్..ఇలా వరుస సినిమాలతో కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి స్థాయికి ఎదిగాడు. చివరగా ముఖేష్ చాబ్రా దర్శకత్వంలో దల్ బేచారా మూవీలో నటించాడు సుశాంత్.. లాక్ డౌన్ వల్ల ఈ చిత్రం విడుదల ఆగిపోయింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire