సిరి వెన్నెల.. సిరి 'వెన్న'ల పాట.. సామజవరగమనా!

సిరి వెన్నెల.. సిరి వెన్నల పాట.. సామజవరగమనా!
x
Highlights

కొన్ని పాటలు గుర్తుండిపోతాయి. కొన్ని పాటలు పదే పదే వెంటాడతాయి. సిరివెన్నెల పాటలు రెండో కోవకి చెందినవి. సందర్భం ఏదైనా అయన కలం వదిలిన గేయం మాత్రం మనల్ని వెంటాడుతుంది. అది సాంబ శివుడిని ప్రశ్నించడం కావచ్చు.. సురాజ్యం ఇవ్వలేని స్వరాజ్యం ఎందుకని అడిగినా.. జగమంత కుటుంబం నాదని మురిసిపోయినా.. ఇలా ఎలా రాసినా పదాలు ఆయనకు సలాం కొట్టాల్సిందే. మళ్ళీ అలాంటి అద్భుతం చేశారు సిరివెన్నెల.. తాజాగా అల్లు అర్జున్... త్రివిక్రమ్ ల అల‌... వైకుంఠ‌పురములో సామజవరగమన అంటూ గిలిగింతలు పెట్టె పాట ఇచ్చారు.

సామజవరగమన..త్యాగరాజ కృతి... దానిని ఏ మాత్రం టచ్ చేసినా అందరి హృదయాల్ని గాయపరిచిన వారవుతారు. ముఖ్యంగా సంగీత ప్రియులకు.. కానీ ఆపని సిరివెన్నెల సీతారామశాస్త్రి చేస్తే.. అది మరో ట్రెండ్ సెట్ చేస్తుంది. అంతేకాదు ప్రియురాలిని ఒక ప్రియుడు పొగిడే సందర్భంలో రాసిన పాటలో ఈ పదాన్ని ఆయన వాడారు. కానీ, ఆ పదం వాడటానికి ముందు ప్రియురాలికి ప్రియుడు చెప్పిన రెండు మాటలు... నిజానికి పాట ప్రారంభం అదే. ''నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుతు వెళ్లకు దయలేదా అసలు'' అవును దయలేని ప్రియురాలిని అడిగే తీరు అదే కదా. ఎంత రొమాంటిక్ ప్రారంభం చూడండి. ఆమె కాళ్ళను పట్టుకుని వదలననే కళ్ళు.. ప్రియురాలి పాదాల్ని చూస్తున్న ప్రియుడు.. ఎంత పధ్ధతి.. అవును.. అదీ సిరి'వెన్న'ల సొగసు. ఇక పాట హిట్టు కాకుండా ఎలా ఉంటుంది.

సామజవరగమనా అన్న పదం బహుశా ఆ పాట సంగీతానికి అనుగుణంగా ఎంచుకుని ఉండొచ్చేమో కానీ.. మొత్తం పాటని ఆ ఒక్క ఆపదమే మోసింది. ఇక్కడ వ్యాకరణాలు.. అర్థాలు తెలుగు పాటలకి వెతకడం ఎప్పుడో మానేశాం. ఇక, సిరివెన్నెల సాహిత్యం విషయంలో వాటి గురించి మాట్లాడే ధైర్యం కూడా చేయలేం. ''నీ కళ్ళకు కావాలె కాస్త ఇలా కాటుకలా నా కలలు.. నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందెనే సెగలు..'' అసలు ఆ భావుకత్వానికి ఎదురులేదు. ఇక 'నిష్టూరపు విలవిలలు'.. 'మనసు మీద వయసుకున్న అదుపు..' ఒక్కో పదం.. ఆ పదాల మధ్య బంధం.. ఒక్కో రకంగా మనసును మీటింది. తాజా సంగీత వాయిద్యాల మధ్య అర్థం కాకుండా పోతున్న పదాలను అర్థం చేసుకునే శ్రమ తీసుకునే ఓపిక లేక.. తెలుగు పాటని పాటలా కాకుండా వాయిద్యాల హోరులా వినడం అలవాటయిపోయిన జీవుల చెవుల్లో అమృతం పోశారు.

సాధారణంగా తమన్ సంగీతం అంటేనే వాయిద్యాలతో సయ్యాటలా ఉంటుంది . కానీ సిరివెన్నెల సిరా తగిలేసరికి ఆ వాయిద్యాల హోరు కూడా తమ పొగరును తగ్గించుకున్నట్టు వినిపించింది. ప్రతి మలుపులోనూ ఎదురు పడిన వన్నెల వనమా.. ప్రేయసిని ఇంత చిన్న పదాలతో ప్రసన్నం చేయొచ్చా? ఒకవేళ ఆమె ఈ పద్ధతికి కూడా దారిలోకి రాకపోతే సిరి వెన్నెల అలా ఎలా వదిలేస్తారు? దానికి మరింత మర్యాదను జోడిస్తారు.''నా గాలే తగిలినా..నా నీడే తరిమినా ఉలకవా.. పలకవా భామా..,'' అంటూనే, మదిని మీటు మధురమైన మనవి.. వినుమా.. అని చిన్న కొసరు తగిలించి వదిలేస్తారు. ఇక దారిలోకి రాకుండా ఉంటుందా చెప్పండి ఏ ఇంతైనా..

అయినా, శివుడినే ప్రశ్నించిన వాడు.. ఇంత ఒద్దిగ్గా పదాలు పేరిస్తే అవి కలకాలం నిలిచిపోవా.

ఇంత చెప్పుకున్నాకా ఓ విషయం చెప్పుకోకపోతే సిరివెన్నల ఏకలవ్య శిష్యుడు త్రివిక్రమ్ నొచ్చుకుంటారు. ఆ భావుకత నిలువెల్లా ఉంది కాబట్టే ఇటువంటి పాట వినే భాగ్యం మనకి దక్కింది. మాటల విరుపులు ఎంత చక్కగా తన సినిమాల్లో వినిపించి నవ్విస్తారో.. అంతకంటే చక్కగా పాటలలో సాహిత్యాన్నీ మనకు వినిపించే ప్రయత్నం ప్రతి సినిమాలోనూ చేస్తారు త్రివిక్రమ్. ఆయన ఆలోచనలకూ.. తమన్ శ్రమకూ సిరివెన్నల వేసిన సాహిత్య బంధం ఈ సరికొత్త సామజవరగమన! ఇక ఈ పాట పాడిన సిద్ శ్రీరాం ఈ తరం గాయకుడు. ఉండిపోరాదే.. మాటే వినదుగా.. ఇంకేం ఇంకేం కావలె పాటలు పాడాడు. నిజంగా ఒక గాయకునికి ఈ తరంలో పదాలు వినబడే పాటలు పాడే భాగ్యం కలగడం అదృష్టం. ఆ అదృష్టానికి శ్రీరాం న్యాయం చేశాడు. అయితే, పంటి కింది రాయిలా అక్కడక్కడ పదాలు మింగినట్టు అనిపించింది. కాళ్ల నా....కళ్ళనా అన్నదే స్పష్టంగా లేదు. అలాగే కాటుక... కూడా. కటుక అని వినిపించింది ఇటువంటి చిన్న ఇబ్బందులు పక్కన పెడితే పాట మధురమే!

మొత్తమ్మీద చాలా కాలం తరువాత వర్షాకాలం సాయంత్రం.. మబ్బులు పట్టిన ఆకాశం నీడలో.. గోదారి ఒడ్డున కూచుని దూరంగా వంతెన మీద పోతున్న రైలు శబ్దాన్నీ.. గోదావరి గలగలల సంగీతాన్నీ ముడి వేసుకుని వింటున్న అనుభూతి దక్కింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories