Somy Ali: లారెన్స్ బిష్ణోయ్‌కి సల్మాన్ ఖాన్ మాజీ గళ్‌ఫ్రెండ్ మెసేజ్.. ముఖ్యమైన విషయం చెప్పాలని నోట్

Somy Ali: లారెన్స్ బిష్ణోయ్‌కి సల్మాన్ ఖాన్ మాజీ గళ్‌ఫ్రెండ్ మెసేజ్.. ముఖ్యమైన విషయం చెప్పాలని నోట్
x
Highlights

Salman Khan's Ex-Girl Friend Somy Ali: బాబా సిద్ధిఖి మర్డర్ తరువాత ప్రస్తుతం దేశంలో అత్యధికంగా వినిపిస్తోన్న పేర్లు సల్మాన్ ఖాన్, లారెన్స్ బిష్ణోయ్....

Salman Khan's Ex-Girl Friend Somy Ali: బాబా సిద్ధిఖి మర్డర్ తరువాత ప్రస్తుతం దేశంలో అత్యధికంగా వినిపిస్తోన్న పేర్లు సల్మాన్ ఖాన్, లారెన్స్ బిష్ణోయ్. ఎందుకంటే సల్మాన్ ఖాన్‌తో స్నేహమే బాబా సిద్ధిఖి మరణానికి కారణంగా ప్రచారం జరుగుతోంది. పైగా ఎప్పటికైనా సల్మాన్ ఖాన్‌ని చంపేస్తాం అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పదేపదే బెదిరిస్తూ వస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ రెండు పేర్లు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. అయితే, వీళ్లిద్దరి మధ్యలోకి తాజాగా సల్మాన్ ఖాన్ మాజీ గళ్‌ఫ్రెండ్ సోమి అలీ కూడా వచ్చి చేరింది.

సోమీ అలీ... ఒకప్పుడు సల్మాన్ ఖాన్ ప్రియురాలు. 1990 దశకం చివర్లో కొంతకాలం పాటు వీళ్ల మధ్య ప్రేమాయణం కొనసాగింది. అప్పట్లో వీళ్లిద్దరూ కలిసి నటించిన అంత్ సినిమాలో వీళ్ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. కారణాలు ఏవైనా 1999లో వీళ్లిద్దరూ విడిపోయారు. ఆ తరువాత సోమి అలీ నటనకు గుడ్‌బై చెప్పి అమెరికా వెళ్లిపోయింది. ఇప్పుడామె "నో మోర్ టీయర్స్" అనే స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తున్నారు. మానవ రవాణా, గృహ హింస వంటి ఘటనల్లో బాధితులకు సహాయం చేయడంలో ఆ సంస్థ పనిచేస్తుంది. అలా సినిమాలకు దూరమైన తరువాత దాదాపు గత రెండు దశాబ్ధాలుగా సోమి అలీ లైమ్ లైట్‌లో లేకుండాపోయింది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆమె పేరు వెలుగులోకొచ్చింది.

సోమి అలీ పేరు వైరల్ అవడానికి కారణం ఆమె లారెన్స్ బిష్ణోయ్‌కి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక ఓపెన్ డైరెక్ట్ మెసేజ్ ఇవ్వడమే. తాజాగా లారెన్స్ బిష్ణోయ్‌ని ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టిన సోమీ అలీ.. అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. "నమస్తే లారెన్స్ భాయ్.. అంటూ సోమీ అలీ తన సందేశాన్ని ప్రారంభించారు. మీరు జైలు నుండే జూమ్ కాల్స్ చేస్తున్నారని విన్నాను. చూశాను కూడా (వార్తల్లో అనేది ఆమె ఉద్దేశమై ఉండొచ్చు). నేను కూడా మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అందుకు మార్గం ఏంటో చెప్పండి" అని అందులో పేర్కొన్నారు.

"మన ప్రపంచంలో అన్నింటికంటే అందమైన ప్రదేశం రాజస్థాన్. మేము మీ దేవాలయానికి రావాలనుకుంటున్నాం. కానీ అంతకంటే ముందుగా మేం మీతో జూమ్ కాల్ మాట్లాడాలి. కొన్ని విషయాలు చెప్పాలి. నా మాట నమ్మండి ఇది నేను మీ ప్రయోజనం కోసమే చెబుతున్నాను. అలాగే నాకు మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి" అంటూ సోమి అలీ తన సందేశాన్ని ముగించారు. లారెన్స్ బిష్ణోయ్‌ని ఉద్దేశించి సోమి అలీ చేసిన ఈ ఓపెన్ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories