Fahadh Faasil - ADHD: పుష్ప విలన్‌ ఫహాద్ ఫాజిల్‌కు వచ్చిన ఆ వ్యాధి ఏంటి? అది ఎందుకొస్తుంది, చికిత్స ఎలా?

Pushpa Actor Fahadh Faasil Diagnosed with ADHD What are the Causes of ADHD
x

Fahadh Faasil - ADHD: పుష్ప విలన్‌ ఫహాద్ ఫాజిల్‌కు వచ్చిన ఆ వ్యాధి ఏంటి? అది ఎందుకొస్తుంది, చికిత్స ఎలా?

Highlights

పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్. తాజాగా ఆయన ఆవేశం సినిమాతో మరో సూపర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు.

పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్. తాజాగా ఆయన ఆవేశం సినిమాతో మరో సూపర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు.

అయితే, వరుస హిట్‌లు అందుకుంటున్న ఫహాద్ ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తను అటెన్షన్ డిఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)తో జీవిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇంతకీ ఏడీహెచ్‌డీ అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది, దీనికి చికిత్సా విధానాలు ఏమిటి?

ఏడీహెచ్‌డీ.. ఒక మానసిక వ్యాధి

ఇది ఒక మానసిక వ్యాధి. ఏదైనా అంశంపై ఏకాగ్రత పెట్టలేకపోవడం, హైపర్ యాక్టివిటీ (అతిగా స్పందించడం), ఇంపల్సివ్ బిహేవియర్ (ఆలోచించకుండానే స్పందించడం) లాంటి ఇబ్బందులు ఏడీహెచ్‌డీలో కనిపిస్తాయి.

దీని వల్ల వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగం లేదా చదువుపై కూడా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. కొందరిలో ఆత్మవిశ్వాసం కూడా చాలా తగ్గిపోతుంటుంది.

కొందరికి చిన్న వయసులోనే ఇది మొదలు అవుతుంది. పెద్దయ్యే వరకూ ఇది పీడిస్తూనే ఉంటుంది.

ఎలా గుర్తుపట్టాలి?

ఏడీహెచ్‌డీ రోగుల్లో ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు ఉంటాయి. కొందరిలో ఒక మోస్తరు వరకే లక్షణాలు కనిపించొచ్చు. మరికొందరిలో లక్షణాలు తీవ్రంగానూ ఉండొచ్చు.

లక్షణాలు ఒక మోస్తరులో ఉండేవారిలో ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. తీవ్రంగా లక్షణాలు ఉండేవారిలోనూ ఒక్కోసారి ఈ వ్యాధిని నిర్ధారించడంలో మానసిక నిపుణులు పొరపాటు పడుతుంటారు.

మొత్తంగా ఏడీహెచ్‌డీ బాధితుల్లో ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి..

ఆలోచించకుండానే స్పందించడం (ఇంపల్సివ్‌నెస్)

సమస్యల్లో ప్రధానమైనవేవో గుర్తించలేకపోవడం

టైమ్ మేనేజ్‌మెంట్‌లో ఇబ్బందులు

ఏకాగ్రత పెట్టలేకపోవడం

ఒకేసారి భిన్నమైన పనులు చేయలేకపోవడం

విశ్రాంతి లేనట్లుగా కనిపించడం

ప్లానింగ్ లేకపోవడం

త్వరగా విసుగెత్తిపోవడం

మూడ్‌ స్వింగ్స్

ప్రారంభించిన పనిని పూర్తి చేయలేకపోవడం

అతిగా ఆవేశం

ఒత్తిడిని తీసుకోలేకపోవడం

సాధారణంగా ఈ లక్షణాలు అందరిలోనూ కనిపిస్తాయి. అయితే, ఇవి తీవ్రంగా, తరచూ వస్తున్నప్పుడు ఏడీహెచ్‌డీతో బాధపడుతున్నట్లు మానసిక నిపుణులు నిర్ధారిస్తారు.

ఒక్కోసారి యాంక్సైటీ, మూడ్ డిజార్డర్ లాంటి ఇతర సమస్యలతో ఈ లక్షణాలను పొరబడే అవకాశం ఉంటుంది.

ఏడీహెచ్‌డీ ఎందుకు వస్తుంది?

అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తోందనే అంశంపై ప్రస్తుతం చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. దీని వెనుక స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ, ఈ వ్యాధి వచ్చేందుకు ప్రభావితం చేస్తున్న కొన్ని అంశాలను పరిశోధకులు గుర్తించారు. అవి ఏమిటంటే..

జన్యువులు: కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే వారి వారసులకు ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే, ఇక్కడ జన్యువులు కూడా ప్రధాన పాత్ర పోషించొచ్చు.

పర్యావరణం: చిన్నప్పుడే సీసం లాంటి లోహాల ప్రభావానికి లోనైనప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే ముప్పు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.

నాడీ సమస్యలు: పిల్లలు పెరిగేటప్పుడు నాడీ వ్యవస్థలో ఏదైనా లోపాలు ఏర్పడినా ఏడీహెచ్‌డీ వచ్చే ముప్పు పెరుగుతుంది.

గర్భంతో ఉండేటప్పుడు మహిళలు మద్యపానం, ధూమపానం లాంటివి చేసినా పిల్లల్లో ఏడీహెచ్‌డీ ముప్పు పెరగొచ్చు.

మరోవైపు నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లోనూ ఈ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

ఒకేసారి రెండు మూడు వ్యాధులు

ఒక్కోసారి ఏడీహెచ్‌డీతో బాధపడే వారిలో రెండు కంటే ఎక్కువే మానసిక సమస్యలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో వీరికి చికిత్స అందించడం మరింత కష్టం అవుతుంది.

ముఖ్యంగా ఏడీహెచ్‌డీ రోగుల్లో మూడ్ డిజార్డర్స్ కూడా కనిపిస్తుంటాయి. వీటిలో కుంగుబాటు, బైపోలార్ డిజార్డర్ లాంటివి ముఖ్యమైనవి. ఏడీహెచ్‌డీ వల్ల పదేపదే చేసే ప్రయత్నాల్లో విఫలం కావడం, విసుగెత్తిపోవడంతో డిప్రెషన్ మరింత తీవ్రం కావచ్చు.

ఏడీహెచ్‌డీ రోగుల్లో యాంక్సైటీ సమస్యలు తరచూ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ప్రతిదానికీ ఆందోళన పడటం, గుండె వేగం పెరగడం లాంటి సమస్యలు వీరిలో కనిపించొచ్చు.

పర్సనాలిటీ డిజార్డర్లు, లెర్నింగ్ డిసేబిలిటీస్ కూడా ఏడీహెచ్‌డీ రోగుల్లో కనిపించొచ్చు.

చికిత్స ఏమిటి?

సాధారణంగా ఏడీహెచ్‌డీ రోగులకు ఔషధాలతోపాటు థెరపీని కూడా మానసిక నిపుణులు సూచిస్తుంటారు.

అయితే, మందుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మానసిక నిపుణులే. మీతో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాతే వారు మందులు సూచిస్తుంటారు.

ముఖ్యండా సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ (సీఎన్‌ఎస్) అంటే కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించే ఔషధాలను నిపుణలు సూచిస్తారు. ఇవి మెదడులోని డోపమైన్, నోరెపైన్‌ఫ్రైన్ లాంటి రసాయనాల స్థాయిలను పెంచుతాయి. దీంతో హైపర్ యాక్టివిటీ తగ్గుతుంది. చేసే పనులపై ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

కొన్నిసార్లు నాన్‌స్టిమ్యులంట్ మెడికేషన్ కూడా సూచిస్తుంటారు. అయితే, మిగతా ఔషధాలు పనిచేయనప్పుడు మాత్రమే వీటిని సూచిస్తుంటారు. ఎందుకంటే వీటితో దుష్ప్రభావాలు కాస్త ఎక్కువగా ఉంటాయి.

ప్రస్తుతం చాలా రకాల థెరపీలు ఏడీహెచ్‌డీకి అందుబాటులో ఉన్నాయి. వీటిలో సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ లాంటివి ముఖ్యమైనవి.

సోషల్ స్కిల్స్ ట్రైనింగ్, పేరెంటింగ్ స్కిల్స్ ట్రైనింగ్ లాంటివి కూడా ఏడీహెచ్‌డీ లక్షణాలను తగ్గించడానికి ప్రస్తుతం చాలాచోట్ల అందుబాటులో ఉన్నాయి.

మొత్తంగా ఏడీహెచ్‌డీతో రోజువారీ జీవితం చాలా ప్రభావితం అవుతుంది. అయితే, ఈ సమస్యను అదుపులో ఉంచుకునేందుకు ప్రస్తుతం చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం మరింత సమాచారం తెలుసుకునేందుకు, సహాయం కోసం మానసిక నిపుణులను సంప్రదించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories