చిరు-మోహన్‌బాబుల ఫ్రెండ్‌షిప్‌కు.. మా ఎలక్షన్ పెట్టిన పరీక్షేంటి?

Manchu Manoj or Prakash Raj who will get support from Megastar Chiranjeevi in Maa Elections 2021
x

ఇమేజ్ సోర్స్(ది హన్స్ ఇండియా )

Highlights

MAA Elections 2021: చిరంజీవి-మంచు మోహన్‌ బాబు రీల్‌లైఫ్‌లో ఒకప్పుడు హీరో-విలన్.

MAA Elections 2021: చిరంజీవి-మంచు మోహన్‌ బాబు రీల్‌లైఫ్‌లో ఒకప్పుడు హీరో-విలన్. కొన్నేళ్లపాటు రియల్‌లైఫ్‌లోనూ అవే ఫైటింగ్ సీన్లు. కట్‌ చేస్తే, ఇప్పుడు వారిద్దరూ స్నేహితులు. ఒకప్పుడు తిట్టుకున్నవారే, ఇప్పుడు పరస్పరం ప్రశంసించుకుంటున్నారు. కానీ ఈ ఇద్దరి ఫ్రెండ్‌షిప్‌‌కు ఇప్పుడు మా ఎలక్షన్స్‌, ఎగ్జామ్‌ పెట్టాయి. ఒకవైపు మంచు విష్ణు పోటీపడుతుంటే, మరోవైపు ప్రకాశ్‌ రాజ్‌కు నాగబాబు సపోర్ట్ ఇస్తున్నారు. మరి నాగబాబు మాటే మెగా ఫ్యామిలీ మాట అనుకోవాలా? లేదంటే చిరంజీవి తటస్థ వైఖరి పాటిస్తారా? మా ఎలక్షన్స్‌ మెగా ఫ్యామిలీ-మంచు ఫ్యామిలీల మధ్య మరోసారి రచ్చకు క్లాప్‌ కొట్టాయా?

మెగాస్టార్‌ చిరంజీవి, డైలాగ్‌ కింగ్ మంచు మోహన్‌ బాబులు, ఎప్పుడు తిట్టుకుంటారో, ఎప్పుడు పొగడ్తలు కురిపించుకుంటారో, ఇండస్ట్రీలోనే ఎవరికీ బోధపడదు. సినిమా తెరపైనే కాదు, తెర వెనక కూడా వీరిద్దరి ఫ్రెండ్‌షిప్‌ అర్థంకాని పజిలే. తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో లెజెండ్, సెలబ్రిటీ అవార్డుల గురించి, వేదికపై ఎలాంటి యుద్ధం జరిగిందో తెలుగు జనం చూశారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఇద్దరి నడుమ వార్‌ కంటిన్యూ అయ్యింది. చిరంజీవి అనే మాట ఎప్పుడు వినిపించినా, ఎక్కడ వినిపించినా, మోహన్‌ బాబు ఫైర్‌ విల్‌ బి ఫైర్ అన్నట్టుగా అసహనంగా ఊగిపోయేవారు. చిరంజీవి మాత్రం పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించేవారు కాదు. అయితే, రాజకీయాల్లోనే కాదు సినిమా ఇండస్ట్రీలోనూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరన్నట్టుగా, ఇద్దరి నడుమ మళ్లీ స్నేహం క్లాప్‌ కొట్టింది. అనేక వేదికల్లో ఇరువురూ కలిసి పాల్గొన్నారు. పరస్పరం అభినందించుకున్నారు. రెండు ఫ్యామిలీల నడుమ మంచి రిలేషనే వుందిప్పుడు. దాసరి నారాయణ రావు తర్వాత, సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవేనని మోహన్‌ బాబు అన్నట్టుగా ఫిల్మ్‌ నగర్‌ జనాలు చెప్పుకుంటారు. రీసెంట్‌గా మోహన్‌ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమాకు చిరంజీవి వాయిస్‌ ఓవర్ కూడా ఇచ్చారు.

ఇలా చిరు-మోహన్‌ బాబులు, దోస్త్ మేరా దోస్త్ అన్నట్టుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కానీ వీరి స్నేహానికి కాలం మళ్లీ ఓ పరీక్ష పెట్టింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ రూపంలో, ఇరువురి నడుమ గిల్లికజ్జాలకు ముహూర్తపు సన్నివేశం మొదలైందన్న డిస్కషన్ సాగుతోంది ఫిల్మ్ ‌నగర్‌లో. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మా ఎలక్షన్స్, సెప్టెంబర్‌లో జరగబోతున్నాయి. ఇఫ్పటి నుంచే ఎన్నికల వేడి రగులుకుంది. మా అధ్యక్ష రేసులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మంచు మోహన్‌ బాబు కుమారుడు, హీరో విష్ణు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు జీవితా రాజశేఖర్, హేమా కూడా పోటీకి సై అంటున్నారు. అటు హీరో కల్యాణ్‌ రామ్‌ కూడా బరిలో నిలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, మా పోరులో ఎంతమంది వున్నా, ప్రకాశ్‌ రాజ్-మంచు విష‌్ణుల మధ్యే ప్రధాన పోటీ అన్నది స్పష్టమైంది. అదే ఇప్పుడు మెగా ఫ్యామిలీ-మంచు ఫ్యామిలీ మధ్య రగడకు స్క్రీన్ ప్లే అల్లింది. ఎందుకంటే, ప్రకాశ్‌ రాజ్‌కు నాగబాబు మద్దతిస్తున్నట్టుగా బహిరంగంగా ప్రకటించారు. కొన్ని రోజుల ముందు చిరంజీవిని ప్రకాశ్‌ రాజ్ కలిశారు. మా ఎలక్షన్స్‌లో నిలబడాలని అనుకుంటున్నానని, తనకు మద్దతివ్వాలని చిరంజీవిని ప్రకాశ్‌ రాజ్ కోరినట్టు వార్తలొచ్చాయి. అదే నిజమా అన్నట్టుగా నాగబాబు కూడా ప్రకాశ్‌ రాజ్్కు సపోర్ట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. మరి నాగబాబు మాటే మెగా ఫ్యామిలీ మాటా? తన ప్రియ స్నేహితుడి కుమారుడికి చిరంజీవి సపోర్ట్ ఇస్తారా? లేదంటే ఇచ్చిన మాట ప్రకారం ప్రకాశ్‌ రాజ్‌కే ఓటేస్తారా? రెండూ లేదంటే తటస్థ వైఖరి తీసుకుని పెద్ద మనిషిలా వ్యవహరిస్తారా? ఇదే ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీని తలపిస్తోంది ఫిల్మ్ ‌నగర్‌లో.

సాధారణంగా ప్రతీసారి మా ఎలక్షన్స్ జరిగిన టైంలో, మెగా ఫ్యామిలీ తరపున అధికార ప్రతినిధిగా మాట్లాడేది నాగబాబే. నాగబాబు మాటే మెగా ఫ్యామిలీ మాటగా చెల్లుబాటయ్యేది. మా ఎలక్షన్స్‌లో గెలుపును మెగా ఫ్యామిలీ ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా, మద్దతు కోసం మొదట మెగా ఫ్యామిలీ మెట్లెక్కుతారు. ప్రకాశ్‌ రాజ్ ఇప్పటికే చిరంజీవితో మాట్లాడారు. ఈ నేపథ్యంలో నాగబాబు మాటే, చిరంజీవి మాటనా లేదంటే, ఎవరికీ మద్దతివ్వకుండా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటారా అన్నది ఉత్కంఠగా మారింది.

దాసరి నారాయణ రావు చనిపోయిన తర్వాత, ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు చిరంజీవి. లాక్‌డౌన్‌ టైంలో జూనియర్ ఆర్టిస్టులకు, సినీ కార్మికులకు, వృద్ద నటులకు అండగా నిలిచారు. వారికి రేషన్‌ అందించారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌‌‌‌ కూడా చేపట్టారని తెలుస్తోంది. సినిమా షూటింగ్‌లు లేని టైంలో, ఇండస్ట్రీలో అందర్నీ కలుపుకుని, నేనున్నానంటూ, నిధులు సేకరించి, అందరికీ అండగా వున్నారని, చిరంజీవి గురించి ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న మా ఎలక్షన్స్‌లో, చిరంజీవి మద్దతు మాట కీలకం కానుంది. అందులోనూ ఇండస్ట్రీలో ఎక్కువమంది హీరోలు మెగా ఫ్యామిలీ నుంచే. రాజకీయంగా కూడా అటు తెలంగాణ సీఎం, ఇటు ఏపీ సీఎంతో చిరంజీవికి మంచి సంబంధాలున్నాయి. కరోనా టైంలో షూటింగ్‌లకు పర్మిషన్లు, ఇతర సౌకర్యాల గురించి ఇద్దరు సీఎంలతో తన బృందంతో మాట్లాడారు చిరంజీవి. అందుకే ఏ రకంగా చూసినా, మా ఎలక్షన్స్‌లో చిరంజీవి సపోర్ట్‌ అత్యంత కీలకం. మరి తన స్నేహితుడు మోహన్‌ బాబు కుమారుడు బరిలో నిలబడుతున్న టైంలో, చిరంజీవి ఎటువైపు అడుగులేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మోహన్‌ బాబు. భోళా మనిషి. ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా రియాక్ట్ అవుతారన్నది ఇండస్ట్రీలో ఎవర్ని అడిగినా చెబుతారు. చిరంజీవితో మోహన్‌ బాబు స్నేహం కూడా ఈమధ్యే చిగురిస్తోంది. ప్రకాశ్‌ రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతిస్తోందని తెలిసినా, తన కుమారున్ని పోటీకి దింపారు మోహన్‌ బాబు. ఇఫ్పటికే సూపర్ స్టార్ కృష్ణతో పాటు అనేకమందిని కలిసి మద్దతు అడిగారు. ఇలాంటి తరుణంలో చిరంజీవి మద్దతు తన స్నేహితుని కుమారుడికి ఇస్తారా? లేదంటే అధికారికంగా ప్రకాశ్‌ రాజ్్ను సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటిస్తారా? అన్నది బోధపడ్డం లేదు. నాగబాబు మాటే మెగా ఫ్యామిలీ మాట అయితే, మాత్రం మోహన్‌‌బాబు-చిరుల ఫ్రెండ్‌షిప్‌కు అగ్నిపరీక్షే. చూడాలి, ఎవరికి చిరు మద్దతిస్తారో లేదంటే మెగా ఫ్యామిలీ అభిప్రాయంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తాను ఎవరికీ సపోర్ట్ చెయ్యడంలేదని తటస్థంగా వుంటారో చూడాలి, ఏమవుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories