Krishnam Raju: 'అంతిమతీర్పు'లో పత్రికాధిపతిగా విలక్షణమైన నటన
Krishnam Raju: తెలుగు చిత్రసీమలో మరో పాతతరపు ధ్రువతార నింగికేగింది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటుడిగా సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న కృష్ణంరాజు.. అటు రాజకీయాల్లోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించాలనే తహతహ ఆయనకు ఉన్నా.. అందుకు తగిన సహకారం దొరకలేదనే అసంతృప్తికి లోనైనట్టు చెబుతారు. ఏ పార్టీలో ఉన్నామన్నది కాకుండా.. ఏం చేశామన్నదే ఆయన ఫిలాసఫీగా ఉండేదని.. అయితే రాజకీయాల్లో ఉండే అనేక రకాల ఒత్తిళ్లు, పరిమితుల కారణంగా.. ఏ పార్టీలో కూడా కృష్ణంరాజు పూర్తిగా ఒదిగి ఉండలేకపోయారన్న అభిప్రాయాలున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రేక్షకులకు తన విలక్షణమైన నటనను అపురూపమైన జ్ఞాపకంగా అందించారు కృష్ణంరాజు. 1940 జనవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు పూర్తి పేరు.. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. తెలుగు ప్రేక్షకులకు ఓ భారీ నట విగ్రహంగా మాత్రమే తెలిసిన కృష్ణంరాజులో బహుముఖీనమైన అభిరుచులు, ఆకాంక్షలు ఉన్నాయి. సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో అనేక పాత్రలను ఎంతో విజయవంతంగా పోషించినట్టు ఆయన సినీ ప్రస్థానం చెబుతుంది. తెలుగునేలపై స్వేచ్ఛా పోరాటాల సమయంలో తనదైన ముద్రవేసిన ఆంధ్రపత్రికకు కృష్ణంరాజు ఓ సాధారణ రిపోర్టర్ గా పనిచేశారు. డిగ్రీ తరువాత నటజీవితం వైపు ఆకర్షితులయ్యారు. 1966లో చిలకా గోరింక సినిమాతో తెరంగేట్రం చేసిన కృష్ణంరాజు.. 1970, 80వ దశకంలో రారాజుగా వెలుగొందారు. ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ వంటి మహానటుల హవా కొనసాగుతున్న కాలంలో.. తనదైన గంభీర ముద్రతో, ప్రత్యేకమైన హావభావాలతో, పదాలు పలికించలేని ముఖకవళికలతో తెలుగు ప్రేక్షకులకు వెండితెర మీద కొత్తరుచులు చూపించారు. రెబల్ స్టార్ గా చిరస్థాయిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.
స్ఫూరద్రూపి అయిన ఈ రెబల్ స్టార్.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ఎంతో ప్రయత్నించారు. 1992లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 1998లో కాకినాడ నుంచి బీజేపీ తరఫున గెలిచి ఓ ప్రజానాయకుడిగా రాణించారు. లక్షా 65 వేల ఓట్ల మెజారిటీ సాధించి వాజ్‌పేయి వంటి మహా నేతల దృష్టిని ఆకర్షించారు. అందుకే ఆయనకు విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి మంత్రిత్వ శాఖల్లో సహాయమంత్రిగా అవకాశం కల్పించారు. అంతేకాదు.. అనేక పార్లమెంటరీ కమిటీల్లోనూ సభ్యత్వం కల్పించి ఆయన ఆలోచనలకు అవకాశం కల్పించారు. ఆనాటి బీజేపీ నేతల వ్యవహార శైలి కారణంగానే కృష్ణంరాజు కమలనాథులవైపు మొగ్గు చూపారంటారు. అయితే ఆ తరువాత ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా ఏపీలో బీజేపీ పర్ఫామెన్స్ పెద్దగా లేనికారణంగా.. బీజేపీలో కొనసాగలేకపోయారు. ఆ కారణంగానే తనకు ఆప్తుడైన చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరిపోయారని విశ్లేషకులు భావిస్తారు. అయితే ఆ పార్టీ కూడా ఓ చరిత్రగా మిగిలిపోవడంతో.. చాలాకాలం పాటు రాజకీయాల పట్ల మౌనముద్ర దాల్చారని సన్నిహితులు చెబుతుంటారు. ఆ తరువాత కమలనాథులు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తుండడంతో.. బీజేపీ మీద ఆశలు పెంచుకున్నారంటారు.
ఏపీలో పార్టీ బలోపేతానికి కమలనాథులు తీసుకునే చర్యల్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించడం, పలువురు సీనియర్ నటులను కూడా బీజేపీ నేతలు సంప్రదిస్తూం ఉండడం వంటి కారణాలతో కృష్ణంరాజులో ఆశలు మల్లీ చిగురించాయంటారు. ఈ క్రమంలోనే ఈ రెబల్ స్టార్.. గవర్నర్ పదవిని ఆశించారని, తన కోరికను బీజేపీ నేతలు తప్పక తీరుస్తారన్న అభిప్రాయంలో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే తెలుగు ప్రజల అభిమాన నటుడు.. అనుకోకుండా అంతిమయాత్రకు సిద్ధమవడంతో ఆవేదన చెందుతున్నారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనోత్సవాల కోసం హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. అందుకోసం ఆయన 16వ తేదీనే హైదరాబాద్ చేరుకుంటున్నారు. అయితే బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి, కేంద్రంలో మంత్రిపదవి అలంకరించిన వ్యక్తిగా కృష్ణంరాజుకు బీజేపీ నేతలు పెద్దఎత్తున నివాళులు అర్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెబల్ స్టార్ కుటుంబ సభ్యులను అమిత్ షా స్వయంగా కలిసి కృష్ణంరాజుకు నివాళులు అర్పిస్తారని, ఆయన కుటుంబానికి సంఘీభావం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కృష్ణంరాజు మరణవార్త తెలిసిన వెంటనే అమిత్ షా ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణంరాజు మనల్ని విడిచిపెట్టారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, ఆయన బహుముఖ నటనతో, సమాజ సేవతో కోట్లాది మంది హృదయాలు గెలుచుకున్నారని అమిత్ షా ట్వీట్ చేశారు. ఆయన మరణం మన తెలుగు చిత్రసీమకు తీరని లోటు మిగిల్చిందన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్ షా కలిసే సమయంలో ఆయన నటవారసుడైన ప్రభాస్ కూడా అక్కడే ఉండేలా బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో మరో నటుడు నిఖిల్‌తో కూడా భేటీ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ తో షా భేటీ అయిన రోజునే నిఖిల్ కూడా కలవాల్సి ఉండగా అనుకోకుండా అది వాయిదా పడిందని చెబుతున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో 183 సినిమాలు చేసిన సుదీర్ఘమైన నట ప్రస్థానం కలిగిన కృష్ణంరాజు.. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారని చెబుతారు. భారతీయ సంప్రదాయాలన్నా, భారతీయ జీవన విధానమన్నా ఎక్కువగా ఇష్టపడే రెబల్ స్టార్.. రోజూ రెండుసార్లు యోగా చేసేవారని చెబుతారు. రెగ్యులర్ గా యోగా చేసేవారికి శరీరం లొంగిపోతుందని, 8 గంటల నిద్ర అనే బానిసత్వం నుంచి విముక్తి పొందుతుందని ఆయన నమ్మేవారు. నిత్య యోగా వల్ల 2 గంటల నిద్ర కూడా సరిపోతుందనేవారు. నిద్రను నియంత్రించడం ద్వారా ఎక్కువ గంటలు శ్రమించే అవకాశం శరీరానికి దొరుకుతుందని, అదే విజయానికి కారణమవుతుందని కృష్ణంరాజు నమ్మేవారు. సినిమాల్లో సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆయన తెలుగు అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమ ప్రయాణానికి సిద్ధమవడం తెలుగు లోకాన్ని విషాదంలో ముంచేసింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire