Jani Master కనిపించుట లేదు... గాలిస్తున్న పోలీసు ప్రత్యేక బృందాలు

Jani Master Case
x

Jani Master కనిపించుట లేదు... గాలిస్తున్న పోలీసు ప్రత్యేక బృందాలు

Highlights

Jani Master Case Updates: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాపై రేప్ కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

Jani Master Case Updates: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాపై రేప్ కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో ఆయనను డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫిలిం చాంబర్ ఆప్ కామర్స్ సిఫారసు చేసింది. ఈ కేసు నమోదైన తర్వాతి నుంచి జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అసలు ఏం జరిగింది?

జానీ మాస్టర్ తో బాధితురాలికి 2017లో పరిచయం ఏర్పడింది. ఓ రియాల్టీ షో లో ఏర్పడిన పరిచయం కారణంగా తన టీమ్ లో చేరాలని జానీ మాస్టర్ నుంచి ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ తో తాను అతని టీమ్ లో 2019లో చేరినట్టుగా ఆమె తెలిపారు.

ముంబైలో షూటింగ్ కోసం తనతో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్లను జానీ మాస్టర్ తీసుకెళ్లారని... అక్కడే హోటల్ రూమ్ లో అతను అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు చెప్పారు. ఈ విషయం బయటకు చెబితే పని నుంచి తొలగిస్తానని బెదిరింపులకు దిగేవాడన్నారు. ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లిన సమయంలో కూడా తనను పలుమార్లు లైంగిక వేధించాడని ఆ ఫిర్యాదులో తెలిపారు.

వ్యానిటీ వ్యాన్ లో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడని....లైంగిక వాంఛ తీర్చలేదని ఒకసారి తన జుట్టు పట్టుకుని అద్దానికి కొట్టినట్టుగా ఆమె ఆరోపించారు.కొన్ని సమయాల్లో ఆయన భార్య సమక్షంలోనే తనపై దాడి జరిగిందని కూడా ఆమె వివరించారు. ఈ వేధింపులు భరించలేక ఆయన టీమ్ నుంచి బయటకు వచ్చినట్టుగా తెలిపారు. తనకు పని లేకుండా చేస్తామని బెదిరింపులకు కూడా దిగారని చెప్పారు. ఈ ఫిర్యాదు ఆధారంగా షేక్ జానీ భాషాపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో 376 (2)(ఎన్), 506, 323 సెక్షన్ల కింద సెప్టెంబర్ 16న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బాధితురాలికి వైద్య పరీక్షలు

బాధితురాలి నుంచి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. మరికొన్ని ఆధారాల కోసం ఆమెను ప్రశ్నిస్తామని పోలీసులు చెబుతున్నారు. మైనర్ గా ఉన్న సమయంలోనే బాధితురాలిపై లైంగిక దాడి జరిగిందని గుర్తించారు. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం బాధితురాలిని పోలీసులు మరోసారి ప్రశ్నించనున్నారు. తన వద్ద ఉన్న ఆధారాలను కూడా పోలీసులకు అందిస్తానని కూడా ఆమె చెప్పారు.

జానీ మాస్టర్ ఎక్కడ?

నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐ ఆర్ నమోదు కావడంతో జానీ మాస్టర్ అందుబాటులో లేకుండా పోయారని పోలీసులు చెబుతున్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరులో జానీ మాస్టర్ ఉన్నారనే సమాచారంతో నార్సింగి పోలీసులు నెల్లూరు పోలీసులను సంప్రదించారు. అక్కడి పోలీసులతో సమన్వయం చేసుకొని జానీ మాస్టర్ ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కు రెండు మూడు రోజుల్లో పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.

డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని సిఫారసు

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర ప్రసాద్ ఆదేశించారు. ఆయనపై ఆరోపణలు రుజువు కాకపోతే ఆ పదవిలో కొనసాగుతారు. ఒకవేళ ఆరోపణలు రుజువైతే ఆయన స్థానంలో మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

ఫిలిం ఛాంబర్ కు ముందే ఫిర్యాదు

నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి రెండు మూడు వారాల ముందే బాధితురాలు ఈ విషయాన్ని ఫిలిం చాంబర్ దృష్టికి తీసుకెళ్లింది. ఫిలిం జర్నలిస్టుల దృష్టికి తొలుత ఆమె ఈ విషయాన్ని తీసుకెళ్లింది. అయితే వారి సలహా మేరకు ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయించింది. వర్క్ పరంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారని తొలుత బాధితురాలు ఫిర్యాదు చేసింది.... ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బాధితురాలు తమ దృష్టికి తెచ్చారని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు చెప్పారు.

ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ ప్రతినిధులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసినందున ఆమెకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టాలెంట్ కు తగినట్టుగానే అవకాశాలు ఉంటాయని ఫిలిం ఛాంబర్ హామీ ఇచ్చింది. యువతి జరుపుతున్న పోరాటానికి తాము సంపూర్ణ మద్దతిస్తామని చాంబర్ తెలిపింది.

బాధితురాలి ఫిర్యాదుతో పాటు జానీ మాస్టర్ స్టేట్ మెంట్ ను కూడా రికార్డ్ చేశామన్నారు. ఇండస్ట్రీలో ఇబ్బందులు పడేవారి కోసం భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. జానీ మాస్టర్ కేసు 90 రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు ఫిర్యాదు చేయాలని టీఎఫ్ సీసీ కోరింది. [email protected] కు మెయిల్ చేయవచ్చని సూచించారు. లేదా 9849972280 నెంబర్ కు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని ఫిలిం ఛాంబర్ కోరింది. మరో వైపు బాధితురాలికి వర్క్ ఇచ్చేందుకు ప్రముఖ హీరో అల్లు అర్జున్ ముందుకు వచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ఆరు నెలల జైలు శిక్ష

జానీ మాస్టర్ కు 2019 మార్చి 27న ఓ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించింది మేడ్చల్ కోర్టు. 2015లో మహిళపై దాడి కేసులో జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో జానీ మాస్టర్ సహా మరో ఐదుగురికి జైలు శిక్ష విధించింది కోర్టు. మహిళా కొరియోగ్రాఫర్ల పట్ల ఉపయోగించే జానీ మాస్టర్ భాష సరిగా ఉండదనే ఆరోపణలున్నాయి.

టాలీవుడ్ కమిటీ రిపోర్ట్ ను బయటపెడతారా?

సెక్సువల్ హరాస్మెంట్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీస్’ అనే పేరుతో 2022 జూన్ 1న అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి నివేదికను కమిటీ అందించింది. టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడేళ్ల పాటు పలు అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ను అందించింది. అయితే ఈ నివేదికను ఆ ప్రభుత్వం బయటపెట్టలేదు. హేమ రిపోర్ట్ బయటకు రావడంతో కేరళ సినీ పరిశ్రమలోని అంశాలు కలకలం రేపాయి. రెండేళ్ల క్రితం నివేదికను బహిర్గతం చేయాలని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మహిళా నటులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

లైంగిక వేధింపుల అంశంపై ఎఫ్ఐఆర్ గురించి జానీ మాస్టర్ ఇంతవరకు స్పందించలేదు. ఈ కేసులో పోలీసులతో పాటు ఫిలిం ఛాంబర్ కూడా సమాంతరంగా విచారణ చేస్తోంది. ఈ విచారణ నివేదికల ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకుంటారు. మరోవైపు భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేలా టాలీవుడ్ సినీ పరిశ్రమ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories