Game Changer Review: ఇది శంకర్ సినిమాయేనా?

Game Changer Review: ఇది శంకర్ సినిమాయేనా?
x
Highlights

Game Changer Review: రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

Game Changer Review: రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 10వ తేదీన రిలీజ్ చేశారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కాకపోతే పలు కారణాలతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ : రామ్ నందన్ ( రామ్ చరణ్) ఐఏఎస్ గా మారిన ఐపీఎస్. ప్రియురాలు దీపిక(కియారా అద్వానీ) కోరిక మేరకు అనేక ప్రయత్నాలు చేసి ఐపీఎస్ నుంచి ఐఏఎస్ కు అప్గ్రేడ్ అవుతాడు. ఆంధ్రాలో పోస్టింగ్ పడిన మొదటి రోజే ఇల్లీగల్ దందాలు చేసే అందరికీ మినీ హార్ట్ ఎటాక్ ఇస్తాడు. ఈ నేపథ్యంలో మంత్రి బొబ్బిలి మోపిదేవి(sj సూర్య ) వ్యాపారాలను కూడా మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది..దీంతో మోపిదేవికి రామ్ నందన్ కు మధ్య వివాదం మొదలవుతుంది. అయితే ఎప్పటికైనా సీఎం అవ్వాలని కలలుకనే మోపిదేవి తన తండ్రి, ముఖ్యమంత్రి అయిన బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) తన మంత్రి పదవి పీకేస్తున్నాడని తెలిసి అతన్ని అంతమొందిస్తాడు.

అయితే ఊహించని విధంగా ఒక వీడియో మెసేజ్ చనిపోక ముందే తన సహచరులకు పంపిస్తాడు సత్యమూర్తి. అందులో తన వారసుడిగా రామ్ నందన్ ను ప్రకటిస్తాడు సత్యమూర్తి. కుమారుడైన తనను కాకుండా రామ్ నందన్ ను ఎందుకు ప్రకటించాడా అని మోపిదేవి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు. అయితే అసలు మోపిదేవి, అతని అన్న ముని మాణిక్యం(జయరాం) ఇద్దరినీ కాదని బొబ్బిలి సత్యమూర్తి ఎందుకు రామ్ నందన్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించాడు? అసలు అప్పన్న( రామ్ చరణ్) పార్వతి (అంజలి) ఎవరు? అప్పన్నను పోలిన ముఖ కవళికలతోనే రామ్ నందన్ ఎందుకు ఉన్నాడు? చివరికి రామ్ నందన్ ముఖ్యమంత్రి అయ్యాడా? లేక మోపిదేవి ముఖ్యమంత్రి అయ్యాడా? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:

ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ గేమ్ చేంజర్ సినిమా నిజంగానే రామ్ చరణ్ శంకర్ ఇద్దరికీ గేమ్ చేంజరా అంటే కాదనే చెప్పాలి. శంకర్ మార్క్ సినిమాలు అంటే ఇప్పటికే ప్రేక్షకులకు ఒక అంచనా ఉంది కానీ ఆ అంచనాను అందుకోవడంలో శంకర్ ఫెయిలయ్యాడు. అవుట్ డేటెడ్ కథతో ఎప్పుడో 20, 30 ఏళ్ల క్రితం నాటి స్టోరీతో ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేసి ఫెయిలయ్యాడు. నిజానికి ఈ రోజుల్లో బయట జరుగుతున్న రాజకీయాలను పరిశీలిస్తేనే ఎంతో ఎంగేజింగ్ గా అనిపిస్తున్నాయి. కానీ కల్పిత పాత్రలతో కూడా ఆ ఎంగేజ్ మెంట్ క్రియేట్ చేయడంలో శంకర్ ఫెయిల్ అయ్యాడు. నిజానికి శంకర్ ఇలాంటి సినిమాలు ఎప్పుడో చేసేసాడు. ఇప్పుడు ఆయన నుంచి అంతకుమించి ఆశిస్తారు కానీ శంకర్ మాత్రం అక్కడే ఉండిపోయానని ఈ సినిమా ద్వారా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.

భారతీయుడు 2 రిజల్ట్ తర్వాత శంకర్ ఈ సినిమా కోసం అనేక మార్పులు చేర్పులు చేశారని ప్రచారం జరిగింది కానీ అవేమీ నిజం కాదేమో అని సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది. సినిమాలో ఏ విషయం కొత్తగా అనిపించలేదు. పూర్తిస్థాయిలో సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విషయంలో తడబడింది. ఒకప్పుడు శంకర్ సినిమాలు ఊహకు అందకుండా ఉంటే ఈ సినిమా మాత్రం తర్వాత ఏం జరగబోతుంది అనేది సగటు ప్రేక్షకుడు ఈజీగా అర్థం చేసుకునేలా ఉంది. సినిమా మీద ఆసక్తి పెంచి ఏ ఎలిమెంట్స్ విషయంలోనూ శంకర్ కేర్ తీసుకోలేదేమో అని అనిపించింది.

నటి నటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ అప్పన్న, రామ్ నందన్ అనే రెండు పాత్రలలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రధానమైన హైలెట్ అని చెప్పొచ్చు. అలాగే ఆయనే సినిమాకి ప్రధానమైన అసెట్. ఆయనతోపాటు sj సూర్య చేసిన సీన్స్ అయితే ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. వీరిద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కియారా అద్వానీ పాత్ర ఇరికించిన విధంగా ఉంటే అంజలి పాత్ర అవసరమైనా ఎందుకో చాలా నిడివి తక్కువగా ఉంది. ఇక ఉన్నంతలో వీరిద్దరూ మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్ క్యారెక్టర్ అదిరిపోయింది. తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.

ఇక నటుడు జయరాం కూడా ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే చాలామంది కమెడియన్స్ ని సినిమాలో తీసుకున్నా సరే ఒక్కచోట కూడా కామెడీ సీన్ రాకుండా శంకర్ జాగ్రత్త తీసుకున్నట్టనిపించింది. మిగతా పాత్రలు వేటికీ పెద్దగా ప్రాధాన్యం లేదు. రామ్ చరణ్ - sj సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే తమన్ అందించిన సాంగ్స్ గురించి ఇప్పటికే రిపోర్ట్ ఏంటో మీకు తెలుసు. విజువల్ గా మాత్రం సాంగ్స్ బాగున్నాయి ఇక ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ఒక మంచి అసెట్. సినిమాటోగ్రఫీ ఆశించిన స్థాయిలో లేదు. శంకర్ సినిమా అంటే వేరే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అది ఎందుకో తప్పిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. డాన్సులలో రాంచరణ్ అదరగొట్టాడు.. తెలుగు డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక దిల్ రాజు నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి అవసరానికి తగ్గట్టుగా సినిమాని గ్రాండ్ గా తీసుకురావడంలో నిర్మాణం విలువలు ముఖ్యపాత్ర పోషించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories