కాంట్రవర్సీ ఫైల్స్‌.. రాజకీయంగా మరోసారి ప్రకంపనలు..

Delhi Files movie on Delhi Riots | Telugu News
x

The Delhi Files: ఢిల్లీ గొడవల నేపథ్యంలో ద ఢిల్లీ ఫైల్స్

Highlights

The Delhi Files: పౌరసత్వ సవరణ బిల్లు, తదనంతర గొడవలపై సినిమా‌‌.. హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలే ప్రధానాంశం

The Delhi Files: ఇన్నాళ్లు బాలివుడ్‌లో ఇన్నాళ్లు బయోపిక్‌ సినిమాల హవా నడిచింది. కానీ కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాతో ట్రెండ్‌ మారింది. వివాదాస్పద అంశాలపై సినిమాలను చేసేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. కశ్మీర్‌లో పండిట్ల ఊచకోతను తెరపై చూపిన దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు పొందారు. తాజాగా రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన గొడవలను కూడా తెరకెక్కించేందుకు వివేక్‌ యత్నిస్తున్నారు. ఢిల్లీ ఫైల్స్‌ పేరుతో మరో వివాదాస్పద అంశాన్ని సినిమా తీసేందుకు శ్రీకారం చుట్టారు.

1990 దశకంలో జమ్మూ-కశ్మీర్‌లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన సాయుధ తిరుగుబాటు చెలరేగింది. కశ్మీరీ హిందువులు ముఖ్యంగా పండిట్లను ఇస్లామిక్‌ మిలెటంట్లు లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడుతూ నరమేధాన్ని సృష్టించాయి. కాశ్మీరీ పండిట్ల మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. సజీవ దహనాలు చేశారు. ఇళ్లను లూటీ చేసి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా లక్షలాది హిందూ కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో సొంత ఇళ్లను, ఆస్తులను, బంధుత్వాలను వదలి దిక్కుకొకరుగా వలస వెళ్లిపోయారు. అప్పటి వాస్తవాలను ది కాశ్మీర్‌ ఫైల్స్‌ పేరిట దర్శకుడు వివేక‌ అగ్నిహోత్రి తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన కశ్మీర్‌ ఫైల్‌ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను కొట్టింది. ఎవరూ ఊహించనంతగా బాక్సాఫీసు వద్ద 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఓ వర్గం దీన్ని వ్యతిరేకించినా బీజేపీ నేతలు దీన్ని ఓన్‌ చేసుకుని మరీ ముందుకు నడిపించారు.

దీనిపై పలువురు విమర్శలు గుప్పించినా మెజార్టీ ప్రేక్షకుల ఆదరణ పొందిన దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి మరో వివాదాస్పద అంశాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ది ఢిల్లీ ఫైల్స్‌ పేరుతో కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నట్టు వివేక్‌ ప్రకటించారు. 2020లో ఢిల్లీ అల్లర్ల అంశాన్ని తీసుకున్నారు. 2019లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2020 లో హిందువులు, ముస్లింల మధ్య ఢిల్లీలో జరిగిన ఘర్షణలనే ఇతివృత్తంగా తీసుకుని తెరమీద చూపనున్నారట. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎన్నో దారుణాలు వెలుగుచూశాయి. పలువురిని హత్య చేసి డ్రైనేజీల్లో మృతదేహాలను పడేసిన ఘటన అందరినీ భయాందోళనలకు గురిచేసింది. అంకిత్ శర్మ అనే ఐబీ ఆఫీసర్‌ను 6 గంటల పాటు శరీరంలోని అన్ని అవయవాలపై 400 కత్తిపోట్లు పొడిచి నరకం చూపించి చంపారని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. ఈ హింసాత్మక ఘటనపై రోజుల తరబడి చర్చ జరిగింది.

ఢిల్లీ హింసాత్మక ఘటనల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. 38 మంది మృతి చెందగా వందలాది మంది గల్లంతయ్యారు. పలువురి మృతదేహాలు డ్రైనేజీ కాల్వల్లో లభించాయి. ఇక క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఘర్షణలు తగ్గుముఖం పట్టినా ఆ దారుణాల తాలుకు విషాదం మాత్రం ఇప్పటికీ బాధితుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. నాటి దారుణాలను కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు వివేక్ అగ్నిహోత్రి సిద్ధమవుతున్నారు. రాజకీయంగా ఎన్నో వివాదాలకు కారణమైన ఢిల్లీ హింసాత్మక ఘటనల వెనుక ఎవరున్నారు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వివేక్ సినిమాను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ అల్లర్లను కథాంశంగా తీసుకోవడంతో ఇప్పటి నుంచే ది ఢిల్లీ ఫైల్స్‌ సినిమా హాట్ టాపిక్‌గా మారింది.

కశ్మీరీ పండిట్లను ఊచకోత కోసిన హంతకులుగా తమను చూపించి దర్శకుడు తమ మనోభావాలను గాయపరిచారంటూ ఒక వర్గం వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అంతేకాకుండా ఆ సినిమాకు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పన్ను రాయితీని కూడా ప్రకటించాయి. దీనిపై అటు అధికార బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర వాగ్వాదాలకు కారణమయింది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ది కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా చూసేందుకు పోలీసులకు ప్రత్యేక సెలవును మంజూరు చేసింది. అయితే అస్సాం ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఈ సినిమా చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా ఆఫ్‌ డే హాలిడేను ప్రకటించడం గమనార్హం. ఒక సినిమా ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయడం కొందరిని విస్మయానికి గురిచేస్తోంది.

మరి కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే ఈ సినిమా వివాదాలతో పాటు ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుందా? లేదా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories