Corona effect on theater workers: కరోనా కల్లోలంలో థియేటర్ కార్మికులకు నిత్యకష్టాలు !

Corona effect on theater workers: కరోనా కల్లోలంలో థియేటర్ కార్మికులకు నిత్యకష్టాలు !
x
Highlights

Corona effect on theater workers:కరోనాతో జన జీవనం చిన్నాభిన్నం అయ్యింది. కుటుంబాలకు కుటుంబాలే కుదేలయ్యాయి. కోలుకోలేని ఆర్ధిక నష్టాల్లో కూరుకు పోయాయి. వ్యాపారాలు నడవక ఉపాధి అవకాశాలు లేక పస్తులుండాల్సిన పరిస్ధితులు దాపురించాయి.

కరోనాతో జన జీవనం చిన్నాభిన్నం అయ్యింది. కుటుంబాలకు కుటుంబాలే కుదేలయ్యాయి. కోలుకోలేని ఆర్ధిక నష్టాల్లో కూరుకు పోయాయి. వ్యాపారాలు నడవక ఉపాధి అవకాశాలు లేక పస్తులుండాల్సిన పరిస్ధితులు దాపురించాయి. ఏ రంగాన్ని చూసినా ఇప్పుడు ఇదే తీరు. మూడు నెలలుగా జీతాలు లేవు. కరోనా కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. దీంతో థియేటర్స్ లో పని చేసే కార్మికులు అర్ధాకలితో అలమటించి పోతున్నారు. ఆదుకునే వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్న విశాఖ సినిమా కార్మికుల వెతలపై స్పెషల్ రిపోర్ట్.

ఎప్పుడూ చూడని.. ఎన్నడూ వినని ఓ మహమ్మారి ఎన్నో జీవితాలను వీధుల పాలు చేసింది. కసితీరా కాటేసి కల్లోలం సృష్టించింది. మూడు నెలల పాటు పనీ పాటా లేక ఇళ్ళకే పరిమితం చేసింది. దీంతో ఎన్నో జీవితాలు ఇప్పుడు ఆకలితో అలమటించి పోతున్నాయి. అద్దెలు కట్టలేక, పిల్లలను చదివించుకోలేక, వైద్యం చేయించుకోలేక నానా కష్టాలు పడుతున్నారు. అన్ని రంగాలలో ఇదే పరిస్ధితి. ఎక్కడ చూసినా ఇదే దుస్థితి.

లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడి వంద రోజులు అయ్యింది. ఈ రంగాన్ని నమ్ముకుని ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు ఇప్పుడు వారి పరిస్ధితి అగమ్య గోచరంగా మారింది. ముఖ్యంగా విశాఖపట్టణం జిల్లాలోనే 150 వరకు సినిమా థియేటర్లు ఉండగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కలుపుకుని ఉత్తరాంధ్రలో మొత్తం 400 పైగా థియేటర్లు పని చేస్తున్నాయి. వీటిలో దాదాపు నాలుగు వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఆయా థియేటర్ల బయట ఏడు వేల మంది చిరు వ్యాపారులు తమ వ్యాపారాల ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వీరి పరిస్ధితి ప్రశ్నార్ధకంగా మారింది. కోవిడ్ ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లు నిలిచి పోయాయి. థియేటర్లు ఆగిపోయాయి. అయితే ఖర్చులు మాత్రం తగ్గలేదు. సినిమాలు ప్రదర్శించినా ప్రదర్శించకపోయినా కరెంట్ బిల్లులు మాత్రం చెల్లించాల్సిందే. కార్మికులకు జీతాలు ఇవ్వాల్సిందే. ఇప్పటికే సగం జీతాలు మాత్రం ఇవ్వగలుగుతున్నాం. పరిస్ధితి ఇలాగే ఉంటే అవి కూడా చెల్లించడం కష్టమే అంటున్నారు యజమానులు.

ప్రభుత్వాలు అనుమతి ఇస్తే అన్ని జాగ్రత్తలు తీసుకుని థియేటర్లు ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. బస్సులు, రైళ్ళు, విమానాలలలో పాటిస్తున్న, ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య సూత్రాలను తాము కూడా తూచా తప్పక పాటిస్తామని అంటున్నారు. దీనివల్ల కార్మికులకు తిరిగి ఉపాధి లభిస్తుందని యాజమాన్యాలు అంటున్నాయి. మూడు నెలలుగా థియేటర్లు మూత పడ్డా యజమానులు సగం జీతం ఇచ్చి తమను ఆదుకున్నారని, ముందు ముందు ఇదే పరిస్ధితి కొనసాగితే తమ జీవితాలు మరీ దుర్భరంగా మారే అవకాశాలు ఉన్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికులతో పాటు ఇతరులకు అందజేస్తున్న విధంగా తమకు కూడా ప్రభుత్వాలు ఆర్ధిక సాయం అందించాలని వారు కోరుతున్నారు.

వారికిచ్చే జీతాలు అంతంత మాత్రమే. అదీ మూడు నెలలుగా సగం జీతం మాత్రమే. పని లేకపోయినా యజమానులు దయదలిచి ఇస్తున్న వేతనం అది. ఇక మీదట అలాంటి పరిస్ధితి ఉంటుందో ఉండదో తెలియదు. ఇంకొన్నాళ్ళు థియేటర్లు మూత పడితే తమ బతుకులు ఏమిటా అని కార్మికులు కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు. వచ్చే సగం జీతాలు కూడా రాకపోతే బతుకులు ఎలా వెళ్ళ దీయాలా అని ఆవేదన చెందుతున్నారు. ఆందోళన పడుతున్నారు. ఇది ఒక్క ఉత్తరాంధ్ర కార్మికుల పరిస్ధితే కాదు. ఇలా దేశవ్యాప్తంగా ఎంతో మంది సినీ కార్మికులు పడుతున్న ఆవేదన. కరోనా సృష్టించిన కల్లోలంతో ఇలా ఎన్నో జీవితాలు ఇప్పుడు రోడ్డున పడే దుస్ధితి ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories