Kalki 2898 AD: కల్కిపై ప్రశంసల జల్లు.. నారా లోకేష్‌, రాజమౌళి సహా పలువురు సెలబ్రిటీల రియాక్షన్‌

Along with Nara lokesh and some celebrities response about Kalki Movie
x

Kalki 2898 AD: కల్కిపై ప్రశంసల జల్లు.. నారా లోకేష్‌, రాజమౌళి సహా పలువురు సెలబ్రిటీల రియాక్షన్‌ 

Highlights

Kalki 2898 AD: సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం కల్కి సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Kalki 2898 AD: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమా అంచనాలకు అనుగుణంగా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలకు ముందే మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలైన తొలి షో నుంచి మంచి టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. నాగ అశ్విన్‌ అద్భుత విజన్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌హాసన్‌ నటన అద్భుతంగా ఉందంటూ సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు.

సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం కల్కి సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. సినిమాకు వస్తోన్న అద్భుతమైన రివ్యూలు వినడం చాలా సంతోషంగా ఉందన్న లోకేష్.. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణెలకు అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమాను గ్లోబల్‌ స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేశారని లోకేష్‌ రాసుకొచ్చారు.

ఇక కల్కి మూవీ విజయంపై హీరో నాని సైతం స్పందించారు. 'అంతర్జాతీయ స్థాయి చిత్రం. పురాణాలకు సైన్స్‌ను ముడిపెట్టి తీసిన మాస్‌ ఇండియన్ ఫిల్మ్‌.. తెలుగు ల్యాండ్‌ నుంచి చూస్తారా? అయితే ‘కల్కి 2898 ఏడీ’ని చూడండి. నాగ్ అశ్విన్‌, ప్రభాస్‌ అన్న, వైజయంతీ మూవీస్‌తో పాటు చిత్రబృందం అందరికీ శుభాకాంక్షలు. ఎంతో గర్వంగా ఉంది' అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

కల్కి మూవీపై హీరో మంచు మనోజ్‌ పోస్ట్ చేస్తూ.. 'నలుమూలల నుంచి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వినిపిస్తోంది. టీమ్‌కు శుభాకాంక్షలు. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కు హ్యాట్సాఫ్‌. నిర్మాత దూరదృష్టి, అంకితభావం ఈ పురాణకథకు ప్రాణం పోశాయి. భారతీయ సినీ రంగంలో ‘కల్కి’ ఓ మైలురాయి' అంటూ పేర్కొన్నారు.

దర్శక దిగ్గజం జక్కన్న కూడా ఈ సినిమాపై స్పందించారు. ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. కల్కి 2898 ఏడీ కోసం నిర్మించిన సరికొత్త ప్రపంచం అదిరింది. ఈ సన్నివేశాలు చూస్తుంటే ఎక్కడికో వెళ్లిపోయిన ఫీలింగ్ కలిగింది. డార్లింగ్ అయితే తన టైమింగ్, ఈస్‌తో చంపేశాడు. ఇక అమితాబ్ జీ, కమల్ సార్, దీపిక.. ప్రభాస్‌కి గొప్పగా సపోర్ట్ చేశారు. ఇక చివరి 30 నిమిషాల సినిమా అయితే నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయింది. ఇలాంటి సినిమా తీసేందుకు ఎంతో కృషి చేసిన నాగి సహా మొత్తం వైజయంతీ టీమ్‌కి హ్యాట్సాఫ్ అంటూ రాసుకొచ్చారు. కాగా కల్కి మూవీలో రాజమౌళి నటించిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories