Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌.. ఈ కేసులో నేరం రుజువైతే ఎంత కాలం శిక్ష పడుతుంది?

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌.. ఈ కేసులో నేరం రుజువైతే ఎంత కాలం శిక్ష పడుతుంది?
x
Highlights

Allu Arjun arrested and released on interim bail, what happened in Allu Arjun Case: చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ఇంటికి...

Allu Arjun arrested and released on interim bail, what happened in Allu Arjun Case: చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఆయన్ను తమ బండెక్కించుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు, ఆయన తన భార్య స్నేహా రెడ్డికి ముద్దుపెట్టుకుని, ఆమెకు ధైర్యం చెప్పి వెళ్లిన దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో కొద్దిసేపు విచారించిన పోలీసులు ఆ తరువాత ఆయన్ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, శుక్రవారం సాయంత్రానికి ఆయనకు హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ రావడంతో ఊరట లభించింది.

అల్లు అర్జున్ లాయర్లు ఏం చెబుతున్నారు?

డిసెంబర్ 11న అల్లు అర్జున్ తెలంగాణ హై కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాల్సిందిగా ఆయన కోర్టును కోరారు. ఆ పిటిషన్ ఇంకా విచారణకు రాకముందే శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ అవడం, నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగిపోయింది. ఈ అరెస్ట్‌ను ఖండిస్తూ శుక్రవారం అల్లు అర్జున్ తరపు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

సోమవారం వరకు తమ క్లయింట్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయకుండా హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా వారు కోర్టును కోరారు. తొక్కిసలాట ఘటనతో తన క్లయింట్‌కు సంబంధం లేదని అల్లు అర్జున్ తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. సాధారణ ప్రేక్షకుడిగానే అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లారని లాయర్లు కోర్టుకు చెప్పారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. మరోవైపు అసలు బెనిఫిట్ షోకు అనుమతి తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు.

ఇంతకీ అల్లు అర్జున్ పై నమోదైన కేసు ఏంటి?

పుష్ప 2 మూవీ విడుదల సందర్భంగా డిసెంబర్ 4న సంధ్యా థియేటర్‌లో బెనిఫిట్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చారు. ఆయన్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలోనే రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడైన 9 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

థియేటర్‌లో సరైన సౌకర్యాలు కల్పించకుండా ఎక్కువ సంఖ్యలో జనాన్ని లోపలికి అనుమతించారని మృతురాలి భర్త మొగుడంపల్లి భాస్కర్ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత సిబ్బందిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితుడి ఫిర్యాదుతో భారత న్యాయ సంహితలోని 105, 118(1) r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సెక్షన్లు రెండూ నాన్-బెయిలబుల్ కేసులకు సంబంధించినవే. 105 సెక్షన్ ప్రకారం నిందితులు దోషిగా తేలితే జరిమానాతో పాటు కనీసం 5 ఏళ్ల నుండి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 118(1) కింద దోషిగా తేలితే జరిమానాతో పాటు ఏడాది నుండి గరిష్టంగా జీవిత ఖైదు వరకూ శిక్ష పడే అవకాశం ఉంది.

సంధ్య థియేటర్ యాజమాన్యం ముందే చెప్పలేదా?

తొక్కిసలాట ఘటనలో తమ వైఫల్యం ఏమీ లేదని సంధ్యా థియేటర్ యాజమాన్యం చెబుతోంది. తాము డిసెంబర్ 2వ తేదీనే పోలీసులకు ఒక లేఖ రాసినట్లు చెబుతున్నారు. పుష్ప మూవీ రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4, 5వ తేదీల్లో థియేటర్ కు భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందని థియేటర్ యాజమాన్యం ఆ లేఖలో తెలిపింది.

అంతేకాకుండా సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్, హీరోయిన్, ఇంకా మూవీ యూనిట్ సభ్యులు వస్తున్నందున థియేటర్ వద్ద బందోబస్తు కల్పించాల్సిందిగా రాసిన ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే, పోలీసులు మాత్రం బాధితులు థియేటర్ యాజమాన్యంపై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వైఖరిపై అల్లు అర్జున్ రియాక్షన్

పోలీసులు అరెస్ట్ చేయడంలో తప్పు లేదు కానీ ఏకంగా తన బెడ్ రూమ్ కే రావడం కరెక్ట్ కాదని అల్లు అర్జున్ అన్నారు. తాను డ్రెస్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తనని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే అల్లు అర్జున్ వైఖరిపై నెటిజెన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. మీ సినిమా చూడ్డానికి వచ్చిన మహిళ ప్రాణం పోయింది. ఆమె కొడుకు హాస్పిటల్లో చావుబతుకుల్లో ఉన్నారు. మీకేమో బట్టలు మార్చుకునే అవకాశం ఇవ్వలేదని బాధవుతోందా అని నెటిజెన్స్ మండిపడుతున్నారు.

కేటీఆర్ ట్వీట్‌పై సోషల్ మీడియా రియాక్షన్స్

అల్లు అర్జున్ అరెస్టును కేటీఆర్ ఖండించారు. తొక్కిసలాట ఘటనలో నష్టపోయిన బాధితుల పట్ల తనకు పూర్తి సానుభూతి ఉందంటూనే అల్లు అర్జున్ నేరుగా బాధ్యులు కానీ ఘటనలో ఆయన్ని అరెస్ట్ చేశారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదే విషయమై నెటిజెన్స్ స్పందిస్తున్నారు. తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోయినప్పుడు బాధితుల పక్షాన నిలవలేదు కానీ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయగానే కేటీఆర్ ఎందుకంత ఫీలవుతున్నారని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

అల్లు అరవింద్ ఇంటికి చిరంజీవి

అల్లు అర్జున్ అరెస్టు అయ్యారని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ హుటాహుటిన అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. అల్లు అరవింద్ కుటుంబానికి ధైర్యం చెప్పారు.

ట్విస్ట్ ఇచ్చిన రేవతి భర్త

అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తరువాత రేవతి భర్త మొగుడంపల్లి భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ కొత్త వాదన వినిపించారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. అవసరమైతే తన ఫిర్యాదు వాపస్ తీసుకుంటానని చెప్పారు. వాస్తవానికి రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదులో అల్లు అర్జున్ పేరు కూడా ఉంది.

కానీ ఇప్పుడు అల్లు అర్జున్‌కు సంబంధం లేదని చెబుతుండటంపై నెటిజెన్స్ సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ వారం రోజుల్లోనే ఏం మారిందని ఆమె భర్త వెర్షన్ మారిందని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగానే భాస్కర్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే ఈ కేసు ఇక అంతటితో క్లోజ్ అయిపోయినట్లేనా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది.

ఈ కేసులో అల్లు అర్జున్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు ఊరట లభించింది. ఇప్పుడు విచారణ ఏ కోణంలో సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. Pushpa 2 profits Sharing: అల్లు అర్జున్, రష్మిక మందన, సుకుమార్.. వీరిలో ఎవరు ఎంత తీసుకున్నారు? నిర్మాతకు మిగిలేదెంత? తెలియాలంటే ఈ కింది వీడియో చూడండి.


Show Full Article
Print Article
Next Story
More Stories