Sarath Babu: నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి విషమం..!

Actor Sharath Babus Health Condition Serious
x

Sarath Babu: నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి విషమం..!

Highlights

Sarath Babu: సీనియర్ నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది.

Sarath Babu: సీనియర్ నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై శరత్‌బాబుకు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులతో పాటు, కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో శరత్‌బాబు బాధపడుతున్నాడు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్ వెల్లడించారు.

విలక్షణ నటుడు శరత్ బాబు. తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగాలలో 220కిపైగా సినిమాల్లో నటించారు. కథ నాయకుడుగానే కాకుండా విలన్ పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించారు. శరత్ బాబు 1951 జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించారు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. కె.ప్రభాకర్, కె.బాబూరావు సినీ రంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్ బాబుగా మార్చారు. హీరోగా శరత్ బాబు తొలి చిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. ఆ తర్వాత కన్నెవయసు సినిమాలో నటించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు.

తెలుగులో బాలచందర్ డైరెక్షన్ లో చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు శరత్ బాబు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. లెజెండరీ డైరెక్టర్ కే బాలచందర్ తెరకెక్కించిన గుప్పెడు మనసు మూవీతో శరత్ బాబు వెలుగులోకి వచ్చారు. ఆయన చివరిగా కనిపించిన తెలుగు చిత్రం వకీల్ సాబ్.

శరత్ బాబు సినిమాల్లో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను 1974లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్లు పెద్ద. 1988లో విబేధాలతో విడాకులు తీసుకున్నారు. అనంతరం 1990లో నంబియార్ అనే మహిళను శరత్ బాబు వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా బంధం సవ్యంగా సాగలేదు. 2011లో విడాకులు తీసుకుని విడిపోయారు.

1981, 1988, 1989 సంవత్సరాలలో మూడుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని శరత్ బాబు అందుకున్నారు. మొదటిసారి సీతాకోక చిలుక, రెండవసారి ఓ భార్య కథ, మూడవసారి నీరాజనం సినిమాలలో తన నటనకు నంది పురస్కారం పొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories