తరతరాలకు తన్మయ తరంగమై పల్లవిస్తున్న ఆ గాంధర్వ స్వరమే ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం. పలుకులమ్మ పరిపూర్ణ అనుగ్రహంతో, గానకళాకోవిదుడై, తెలుగు...
తరతరాలకు తన్మయ తరంగమై పల్లవిస్తున్న ఆ గాంధర్వ స్వరమే ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం. పలుకులమ్మ పరిపూర్ణ అనుగ్రహంతో, గానకళాకోవిదుడై, తెలుగు యశస్సుకు తార్కాణంగా నిలిచిన నిత్య గాయకుడు, నిఖిల గాయకుడు. బాలుగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అన్ని భాషల్నీ అమ్మ భాషలుగా చేసుకున్నారు. ఆయా భాషల్లోని మాటల భావాత్మని తన గొంతులో పలికించారు. ఆ భాషల శ్రోతలకు గళపరిమళాన్ని పంచి, స్వర సామ్రాజ్య చక్రవర్తిగా ఎదిగారు. అలాంటి బాలు మన తెలుగువాడు కావడం మనం మరీ మరీ మురిసిపోవలసిన విషయం.
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ముద్దుగా పిలుచునే పేరు ఎస్పీ బాలు. ఎంత ఎత్తుకు ఎదిగినా తానింకా బాలుడినేని వినమ్రంగా చెప్పుకునే బాలుపై ఒక సందర్భంలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి ఓ అందమైన కవిత అల్లారు. కలువలు పూచినట్లు... చిరుగాలులు చల్లగ వీచినట్లు... అంటూ సాగిన కరుణశ్రీ పద్యం, బాలు వాచిక ప్రతిభను గుర్తుకు తెస్తుంది. ఎందుకంటే బాలు స్వరంలో హాస్యం లాస్యం చేస్తుంది శృంగారం సింగారాలు పోతుంది.. విషాదం మన కంట నీరొలికిస్తుంది.. భక్తిభావం భగవద్దర్శనం చేయిస్తుంది.
బాలు నట గాయకుడు. ఏ నటుడి కోసం పాడుతున్నాడో ఆ నటుడి హావ భావాల్ని, నటనా ధోరణిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని, దానికి అనుగుణంగా గాత్రాన్ని మలిచి పాటకు ప్రాణం పోయడం బాలుకు గొంతుతో పెట్టిన విద్య. అది ఆయన స్వరానికున్న అనితరసాధ్య విస్తృతి. ఏ భావాన్నైనా అలవోకగా పలికించగలరు. దానికి తోడు శిఖరాయమైన ఆ ప్రతిభ దైవదత్తమని మనఃపూర్వకంగా నమ్మి, ఏ మాత్రమూ అహంకారం లేకుండా, సాధనతో పరిపూర్ణతను సిద్ధింప చేసుకున్న మానవతామూర్తి బాలు.
కవి ఏ సందర్భంగా ఆ పదాన్ని వాడాడో తెలుసుకోవడంలో బాలు తర్వాతే ఎవరైనా అంటారు. భాషాభావ సంస్కారంతో, సమయోచితరీతిలో ఆ పదాల విలువ పెంచేవిధంగా ఆయన తన సర్వశక్తులను ఒడ్డుతారు. స్వరచాలనం చేసి, పాటకు మన మదిలో శాశ్వత్వాన్ని ప్రతిపాదించిన నాదయోగి బాలు. శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోయినప్పటికీ, శృత పాండిత్యంతో, అత్యంత అభినివేశంతో, దీక్షాదక్షుడై గెలిచారు. కఠోర సాధన చేసి, త్యాగయ్య, శంకరాభరణం చిత్రాల్లో శాస్త్రీయ సంగీత ఆధారిత గీతాలను ఆలపించారు. పండిత పామర మనోరంజకంగా పాడారు. అత్యున్నత పురస్కారాలను దక్కించుకున్నారు. గాన తపస్విగా మన మదిలో చెరగని ముద్ర వేశారు.
తొలినాళ్ళలో చేయూతనిచ్చిన గురువు పట్ల అభిమానంతో తన స్టూడియోకు కోదండపాణి పేరును పెట్టుకొని గురుదక్షణ చెల్లించుకున్నారు. తానే కాదు యావత్ తెలుగు లోకం దైవసమానుడిగా భావించే ఘంటసాల విగ్రహాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయించడంలో ముందున్నారు. ఇవన్నీ బాలు సంస్కారానికి, మహోన్నత వ్యక్తిత్వానికి, శుభలక్షణ సంపన్నతకు నిలువెత్తు నిదర్శనాలు. వర్తమాన గాయనీ గాయకుల్లో స్ఫూర్తిని రగిలిస్తూ వారి ప్రతిభకు పట్టం కడుతూ, తెలుగు పాట కీర్తి కేతనాన్ని విశ్వ వేదికపై రెపరెపలాడించిన బాలు ఎప్పటికీ చిరస్మరణీయులే.
బహుముఖీయమైన ప్రజ్ఞా ప్రభాసిగా ఎదిగినా సముద్రమంత ఆర్తితో శిఖరాయమానమైన కీర్తిని సాధించినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని, వేలాదిమంది స్నేహితుల్నీ సంపాదించుకున్న మనసున్న మనిషి బాలు. గొంతులో తగ్గని మార్దవం, పలుకుబడిలో ఒలికే అందాలు, పాట భావంలో ఒదిగేపోయే తత్త్వం, రాజీలేని తపన ఇవన్నీ బాలులోని సంగీత పాటవానికి నిదర్శనాలు. సాహితీ అభిలాషతో కూడిన సంగీత ప్రజ్ఞ, స్పష్టమైన గానపద్ధతి, అద్భుత నటనా కౌశలం సొంతం చేసుకున్న బాలు సుస్వర సర్వస్వమై ఎదిగారు. అందిపుచ్చుకున్న లెక్కలేనన్ని పురస్కారాలలో పద్మశ్రీ, పద్మభూషణ్, శత వసంత భారతీయ చలన చిత్ర మూర్తిమత్వ పురస్కారాలు చెప్పుకోదగ్గవి. పాటకోసమే పుట్టి, పామర, పండితారాధ్యుడై ప్రభాసించారు బాలు. అచ్చ తెలుగు గళాకారుడు, నిత్యనూతన పథికుడాయన. సంగీతలోకాన చిరయశస్సుతో జీవించాలని తపన పడ్డ గానతపస్వీ.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire