'యాత్ర' మూవీ రివ్యూ

యాత్ర మూవీ రివ్యూ
x
Highlights

చిత్రం: యాత్ర నటీనటులు: మమ్మూట్టి, జగపతి బాబు, సుహాసిని, ఆశ్రిత వేముగంటి, సచిన్ ఖేడేకర్, అనసూయ, రావు రమేష్ తదితరులు సంగీతం: కే సినిమాటోగ్రఫీ:...

చిత్రం: యాత్ర

నటీనటులు: మమ్మూట్టి, జగపతి బాబు, సుహాసిని, ఆశ్రిత వేముగంటి, సచిన్ ఖేడేకర్, అనసూయ, రావు రమేష్ తదితరులు

సంగీతం: కే

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

ఎడిటింగ్‌: ఏ శ్రీకర్ ప్రసాద్

నిర్మాత: విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి

దర్శకత్వం: మహి వి రాఘవ్

బ్యానర్: 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్

విడుదల: 08/02/2019

జననేతగా తెలుగు వారి మనసుల్లో తనదైన ముద్రను వేసుకున్నారు దివంగత నేత, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ మహనీయుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'యాత్ర'. వైఎస్సార్ చేపట్టిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని మహి వి. రాఘవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైస్సార్ పాత్రలో నటించారు. విజయమ్మ పాత్రలో నటి, నాట్యమణి ఆశ్రిత వేముగంటి కనిపించారు. పాదయాత్ర కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్య కారణమని భావన చాలా మందిలో ఉంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రజల గుండెల్లో ఇప్పటికీ పది పదిలంగా ఉన్న రాజన్న జ్ఞాపకాలను సినిమా ఏ విధంగా ఆవిష్కరించిందో చూసేద్దామా

క‌థ:

ఇది పార్షియల్ మరియు ఈవెంట్ బేస్డ్‌ బయోపిక్‌ అని తెలిసిన విషయమే. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్ర, అసలు ఆ పాదయాత్రకు రాజశేఖర్ రెడ్డి పూనుకోవడానికి గల కారణాలు, పాదయాత్రలో భాగంగా రాజన్నకు ఎదురైన అనుభవాలు, వాటి వల్ల వైఎస్‌ లో వ్యక్తిగతంగా వచ్చిన మార్పులు వంటి అంశాలను దర్శకుడు ఈ చిత్రంలో చూపించారు. వైఎస్‌ వ్యక్తిత్వాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకనిర్మాతలు. కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన గొప్పతనంతో ఎలా రాజవైభోగం తెచ్చారు? అనేది కీలకాంశంగా చెప్పుకోవచ్చు. రాయలసీమకు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబీకుడు తెలుగు రాష్ట్రంలో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఎలా సంపాదించారు అనేది మనం తెరపై చూడాల్సిందే.

న‌టీన‌టులు :

బయోపిక్‌ కాబట్టి సినిమా మొత్తం కేవలం రాజశేఖర్‌రెడ్డి పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ పాత్రలో మమ్ముట్టి నటన అద్భుతంగా ఉందని చెప్పాలి. ఆ డైలాగు డెలివరీ కానీ, ముఖ కవళికలు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ తెర మీద నిజంగా రాజన్ననే చూస్తున్నామా అనే భావన కలిగిస్తుంది. రాజశేఖర్ రెడ్డి రాజసం, హుందాతనం అన్నిటిని తెర మీద అద్భుతంగా చూపించారు. విజయమ్మ పాత్రలో ఆశ్రిత చాలా బాగా నటించారు. ఆమె నటన కథకు బలాన్ని చేకూర్చింది. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఆమె నటన బాగుంది. రావూ రమేష్ కూడా కీలకమైన పాత్రలో కనిపించారు. తనదైన శైలి లో, మరిపించే నటనతో కేవీపీ పాత్రకు ప్రాణం పోశారు. అనసూయ, సుహసిని, పోసాని కృష్ణమురళిలు తదితరులు కూడా వారి పోషించిన పాత్రలను బాగానే పండించారు.

సాంకేతిక వర్గం:

రెగ్యులర్‌ బయోపిక్‌లాగా కాకుండా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడు కథలో లీనం అయ్యేలా చేశాడు దర్శకుడు మహి. వి. రాఘవ్. పాదయాత్రలో కూడా ప్రేక్షకులు స్వయానా భాగమైనట్టు అనిపిస్తుంది సినిమ చూస్తున్నంతసేపూ. అప్పటి రాజకీయ పరిస్థితులను బాగా చూపించాడు. కొన్నిచోట్ల పొలిటికల్‌ సెటైర్‌లు కూడా బాగానే పేలాయి. కొన్ని డైలాగ్స్‌ కు కామెడీ టచ్‌ ఉండటం ప్లస్ అయ్యింది. ప్రతి డైలాగు ప్రజలు రాజన్నను దేవుడిలా ఎందుకు కొలుస్తారో తెలియజేసేలా ఉంటాయి. వైఎస్సార్ వ్యక్తిత్వానికి అద్ధం పట్టేలా సినిమాను చిత్రీకరించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కే అందించిన సంగీతం అంతగా మెప్పించలేదు. రాజన్న గొప్పతనాన్ని ఎలివేట్ చేసేలా సంగీతం లేదు. ఇక సత్యన్ సూర్యన్ కెమెరా పనితనం చాలా బాగుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది.

బాలలు:

మమ్మూట్టి నటన

డైలాగులు

కథ

బలహీనతలు:

సంగీతం

కథ స్లో గా ఉండడం

చివరి మాట:

క్లైమాక్స్‌లో వచ్చే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీన్స్‌ సినిమాకే హైలైట్. వైఎస్‌ఆర్‌ జీవితాన్ని, ఆయన గొప్పతనాన్ని చూసిన ప్రేక్షకుల మనసులను చివర్లో వచ్చే రియల్‌ ఫుటేజ్‌ కదిలిస్తుంది. తెలుగు రాజకీయాలలో కీలకమైన మలుపు తీసుకువచ్చిన మహానాయకుడికి ఈ సినిమా ఒక అద్భుతమైన నివాళి.

బాటమ్ లైన్:

అందరూ తప్పకుండా చూడాల్సిన 'యాత్ర'.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories