చిత్రం: ప్రేమ కథా చిత్రం 2 నటీనటులు: సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ధి ఇద్నాని, విద్యుల్లేఖ, కృష్ణ తేజు, ఎన్టీవీ సాయి తదితరులు సంగీతం: జీవన్...
చిత్రం: ప్రేమ కథా చిత్రం 2
నటీనటులు: సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా, సిద్ధి ఇద్నాని, విద్యుల్లేఖ, కృష్ణ తేజు, ఎన్టీవీ సాయి తదితరులు
సంగీతం: జీవన్ బాబు
ఛాయాగ్రహణం: సి. రామ్ ప్రసాద్
ఎడిటింగ్: ఎస్.బీ.ఉద్ధవ్
నిర్మాతలు: ఆర్. సుదర్శన్ రెడ్డి
దర్శకత్వం: హరి కిషన్
బ్యానర్: ఆర్.పీ.ఏ. క్రియేషన్స్
విడుదల తేదీ: 06/04/2019
గత కొంతకాలంగా యువ హీరో సుమంత్ అశ్విన్ కెరీర్ లో ఒక హిట్ సినిమా కూడా రాలేదు. తాజాగా గతేడాది విడుదలైన 'హ్యాపీ వెడ్డింగ్' అనే సినిమా కూడా డిజాస్టర్ గా మారింది. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ తన ఆశలన్ని తన తదుపరి సినిమా అయిన 'ప్రేమ కథా చిత్రం 2' పైనే పెట్టుకున్నాడు. టైటిల్ చూస్తేనే ఇది 'ప్రేమ కథా చిత్రం' సీక్వెల్ అని అర్థం అయిపోతుంది ఈ సినిమాకు సీక్వెల్ అని అనిపించినప్పటికీ నటీనటులు మరియు దర్శకుడు కూడా వేరు కాబట్టి 'ప్రేమ కథా చిత్రం 2' కొత్త స్టోరీ అని తెలుస్తోంది. నందిత శ్వేత మరియు సిద్ధి ఇద్నాని ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి హరికిషన్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఇవాళ అనగా ఏప్రిల్ 6, 2019 న విడుదలైంది. 'ప్రేమ కథా చిత్రం' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన 'ప్రేమ కథా చిత్రం 2' సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో చూసేద్దామా..
కథ:
దాదాపు పేర్లు అన్ని ప్రేమ కథ చిత్రం సినిమా లో ఉన్న లాగానే ఉంటాయి. బిందు అనేది మాత్రమే కొత్త క్యారెక్టర్. ఇక సినిమా కథ లోకి వస్తే, బిందు (సిద్ధి ఇద్నాని) సుధీర్ (సుమంత్ అశ్విన్) తో ప్రేమలో పడుతుంది. అతనినే పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. కానీ ఈ లోపు సుధీర్ నందు (నందిత శ్వేత) అనే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనే విషయం ఆమెకు తెలుస్తుంది. దాంతో మనసు విరిగిన బిందు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. కానీ మళ్ళీ ప్రేతాత్మగా మారి తిరిగి వస్తుంది. నందు మీద పగ తీర్చుకోవాలనే కసి తో రగిలి పోతున్న బిందు ఆత్మ సుధీర్ ని కూడా వేధిస్తూ ఉంటుంది. ఇక చివరికి ఏమవుతుంది? సుదీర్ ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు? అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటులు:
మిగతా అన్నీ చిత్రాలతో పోలిస్తే సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో బాగా ఇంప్రూవ్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. తన హావభావాలు లోనే కాక డైలాగ్ డెలివరీలో మరియు బాడీ లాంగ్వేజ్ లో కూడా మంచి డిఫరెన్స్ ను కనపరిచాడు సుమంత్ అశ్విన్. ఇక ఈ సినిమా మొత్తం నందిత శ్వేతా మరియు సిద్ధి ఇద్నాని పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వీరిద్దరూ సినిమాలో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా నందిత శ్వేత కు ఇదివరకు హారర్ సినిమాల్లో నటించిన అనుభవం బాగా ఉండటంతో ఈ సినిమాలో ఆమె పర్ఫామెన్స్ ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. సిద్ధి ఇద్నాని కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. సుమంత్ అశ్విన్ తో తన కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. విద్యుల్లేఖ తన పాత్రకు న్యాయం చేసింది. కృష్ణ తేజు తన పెర్ఫార్మెన్స్తో కచ్చితంగా నవ్వు తెప్పిస్తాడు. ఎన్టీవీ సాయి కూడా చాలా కన్విన్సింగ్ గా నటించాడు. మిగతా నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక వర్గం :
దర్శకుడు హరి కిషన్ ఈ సినిమా కోసం ఒక యావరేజ్ కథను ప్రిపేర్ చేసుకున్నాడు. పేరుకి హారర్ కామెడీ అయినప్పటికీ ఈ సినిమాలో కామెడీ ఎక్కువ హారర్ తక్కువ అన్నట్టు ఉంటుంది. అయితే దాదాపు కామెడీ సీన్ లు అన్ని ప్రేక్షకులను నవ్వు తెప్పించే లాగా ఉండవు. కొన్ని సీన్లలో రొటీన్ కామెడీ, రొటీన్ హారర్ ఎపిసోడ్లను రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆర్ సుదర్శన్ రెడ్డి అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ క్వాలిటీ పరంగా ఏ మాత్రం రాజీ పడలేదు. జీవన్ బాబు అందించిన సంగీతం చాలా బాగుంది. పాటలు పెద్దగా అలరించలేకపోయినప్పటికీ నేపధ్య సంగీతం చాలా బాగుంది. ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో జీవన్ బాబు అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. సినిమాటోగ్రాఫర్ సి. రామ్ ప్రసాద్ చాలా మంచి విజువల్స్ ను అందించారు. ఎస్ బి ఉద్దవ్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.
బలాలు:
నటీనటులు
ఆఖరి 10 నిమిషాలు
బలహీనతలు:
కథ బలహీనంగా ఉండడం
బలవంతంగా నవ్వు తెప్పించాలని చూసే కామెడీ
అసలు భయం వేయని హారర్ సీన్లు
చివరి మాట:
దాదాపు అన్ని హారర్ కామెడీ నీ సినిమా ల లాగానే 'ప్రేమ కథా చిత్రం 2' లో కూడా కథ చాలా బలహీనంగా ఉంటుంది. చిత్ర దర్శకుడు కేవలం కామెడీ మరియు కొన్ని హారర్ సన్నివేశాలతో సినిమా మొత్తం నడిపినట్లు ఉంటుంది సినిమా బాగానే స్టార్ట్ అయినప్పటికీ, మొదటి హాఫ్ పర్వాలేదనిపిస్తుంది. మొదటి హాఫ్ లో ఉండే కామెడీ సన్నివేశాలు కూడా నవ్వు తెప్పిస్తాయి. కానీ రెండవ భాగంలో కథలో వచ్చిన మలుపుల వల్ల కొన్ని సన్నివేశాలను బలవంతంగా నవ్వు తెప్పించడానికి పెట్టినట్లు అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ లో కూడా కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. చివరగా లాజిక్ పట్టించుకోకుండా హారర్ కామెడీ చిత్రాలను బాగా ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు కూడా 'ప్రేమ కథ చిత్రం 2' నచ్చకపోవచ్చు.
బాటమ్ లైన్:
కథ అసలు లేని 'ప్రేమ కథా చిత్రం 2'.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire