ప్రతిరోజు పండగే రివ్యూ

ప్రతిరోజు పండగే రివ్యూ
x
Prathiroju Pandagae review
Highlights

అమ్మా, నాన్న, అక్క, చెల్లి, అన్న,తమ్ముడు, మామా అత్తా, వదిన, బావ, తాత, మామ్మ.. ఇలా అందరూ కల్సి ఒకే దగ్గర ఉంటె అది ప్రతిరోజూ పండగే! చావును కూడా అందరి...

అమ్మా, నాన్న, అక్క, చెల్లి, అన్న,తమ్ముడు, మామా అత్తా, వదిన, బావ, తాత, మామ్మ.. ఇలా అందరూ కల్సి ఒకే దగ్గర ఉంటె అది ప్రతిరోజూ పండగే! చావును కూడా అందరి మధ్యలో సరదాగా ఆహ్వానించే పరిస్థితి వస్తే.. అది 'ప్రతిరోజూ పండగే' సినిమా అవుతుంది. కుటుంబ కథలు అప్పుడప్పుడు వస్తాయి. అందులోనూ ఇమేజి చట్రంలో ఉండే హీరోలు కుటుంబ కథల్లో కనిపించడం అరుదే. ఇక సంక్రాంతి పండుగ వస్తే మాత్రం ఎవరో ఒకరు ఒక కుటుంబ కథ తో వెండి తెర మీద సందడి చేయడం టాలీవుడ్ లో మామూలే. ఆ సినిమాలు కూడా దాదాపుగా ప్రేక్షకులను ఆకట్టుకుని విజయవంతం అవడమూ సహజమే. ఈ సంవత్సరం ఆ ప్రయత్నం దర్శకుడు మారుతి..మెగా మేనల్లుడు సాయి తేజ్ లతో గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ చేశాయి. కామెడీగా విజయాల్ని మూటగట్టుకునే మారుతి, ఇమేజి చట్రంలోకి రాకుండా సినిమాలు చేస్తున్న సాయి తేజ్ ఈ సినిమాతో విజయాల పండగ చేసుకున్నారా లేదా అనేది చూద్దాం.

కథ ఇదీ..

రాజమహేంద్రవరంలో ఒక తాత గారు.. కేన్సర్ తో కొన్ని రోజుల్లో చనిపోతారని డాక్టర్లు చెప్పారు. అయన కుటుంబ సభ్యులు అందరూ వేరే వేరే ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. ఆయన ఆరోగ్యం బాగాలేదని వారందరికీ కబురు వెళ్ళింది. ఇవి చివరి రోజులనీ అందరికీ తెల్సింది. కానీ, అందరూ ఏవో కారణాలతో వెంటనే రాలేమని, కొన్ని రోజుల తరువాత వస్తామని చెప్పేశారు. అయితే, ఆయన గారి మనవడు మాత్రం వెంటనే వచ్చి వాలిపోయాడు. తాత గారి పరస్థితి చూసి చలించిపోయాడు. జీవించి ఉండే కొంత కాలమైనా తన తాత గారిని సంతోషంగా ఉంచాలనుకున్నాడు. అందుకోసం కుటుంబ సభ్యులందర్నీ వెంటనే అక్కడికి రాప్పించేలా చేశాడు. ఇక అక్కడ నుంచి ఏం జరిగింది.. అక్కడికి వచ్చిన తాత గారి కుటుంబం అంతా ఆయనకు ఎటువంటి ఇబ్బందులు తెచ్చింది? ఆ ఇబ్బందులను మనవడు ఎలా దాటించాడు. తాతగారి మరణం కూడా సంతోషంగా సాగిపోవాలని ఆ మనవడు చేసిన ప్రయత్నాలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ప్రతిరోజూ పండగే!

ఎలా వుందంటే..

పండగలాంటి సినిమానే ఇది. మామూలు కథ.. నిజానికి భావోద్వేగమైన పాయింట్ ఈ కథ వెనుక ఉంది. దానికి కమ్మని కామెడీ పూత పూసి.. గోదారి అందాల గుబాళింపు దట్టించి.. పల్లె సీమల సొగసుల్ని తెర నిండా పరిచేసి కథనాన్ని ముందుకు లాక్కెళ్ళిపోయాడు మారుతి. మరణం విశాదన్నిస్తుంది. కానీ, ఈ సినిమాలో మరణాన్ని కూడా సంతోషంగా స్వాగతించాలి అనే పాయింట్ తో ప్రేక్షకులందరినీ ఆలోచింప చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కామెడీగా సినిమా మొత్తం నడిచిపోయింది. పిల్లలు వివిధ కారణాలతో పెద్దలకు దూరమవుతారు. అటువంటి వారంతా ఒక దగ్గరకు చేరితే ఎలా ఉంటుంది అనేది బాగున్నా..పిల్లలందర్నీ స్వార్థపరులు అనేలా చూపించిన విధానం కొంత బాగోలేదు. కామెడీగా కథను నడిపించేయడం తో ఈ లోపం కనిపించదు. ఇక క్లైమాక్స్ కొంచెం బాగా చేసి ఉంటె బావుండేది కానీ, మారుతి కామెడీకి పెద్ద పీట వేయడంతో అది అలా అలా అయిపొయింది అంతే.

ఎవరెలా చేశారంటే..

సాయి తేజ్ మనవడిగా ఒదిగిపోయాడు. తాతగా సత్యరాజ్ వంటి పెద్ద నటుడు ఉన్నా.. ఎక్కడా తొణక్కుండా చేశాడు. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉన్న పాత్ర అయినా చాలా బాగా చేశాడు. ఇక సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కామెడీ కి వెన్నెముక లాంటి పాత్ర సత్యరాజ్ కొడుకు గా చేసిన రావు రమేష్ ది. తనదైన శైలిలో ఆ పాత్రలో జీవించాడు రావురమేష్. ఇక రాశీ ఖన్నా పల్లె అందాలలో మెరిసిపోయింది. మిగిలిన వారంతా కూడా సినిమాలో బాగా చేశారు. వారి నటన కూడా సినిమాకి ప్లస్ అయింది.

సాంకేతికంగా..

దర్శకుడు మారుతి కామెడీ గురించి తెల్సిందే. సాయి తేజ్ తో ఇలాంటి సినిమా చేయడమే ఆసక్తికరం. భావోద్వేగాల్ని సున్నితంగా కామెడీ గా చూపించి..చివరికి చక్కని సందేశాన్ని ఇచ్చేలా సినిమాని బాగా తీశాడు మారుతి. ఎక్కడా తడబడకుండా తను అనుకున్న లైన్ లో కథనాన్ని నడిపించాడు. జైకుమార్ ఫోటోగ్రఫీ పల్లె అందాల్ని ఒడిసి పట్టుకుంది. తమన్ సంగీతం చాలా బావుంది. పాటలతో పాటు నేపధ్య సంగెతం కూడా బావుంది. ఎడిటింగ్ కూడా సినిమాకి ప్లస్ అయింది.

మొత్తమ్మీద సంక్రాంతికి చాలా ముందుగానే సాయి తేజ్, మారుతి నవ్వుల విందు ఇచ్చేసినట్టే ఉంది.

ప్రతిరోజూ పండగే ట్విట్టర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories