18 Pages Movie Review: '18 పేజెస్‌' మూవీ రివ్యూ.. కొన్ని పేజీలు..

Nikhil Siddhartha 18 Pages Movie Review
x

18 Pages Movie Review: ‘18 పేజెస్‌’ మూవీ రివ్యూ..

Highlights

18 Pages Movie Review: ‘18 పేజెస్‌’ మూవీ రివ్యూ..

చిత్రం: 18 పేజెస్

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, దినేష్ తేజ్, అజయ్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, సరయు, తదితరులు

సంగీతం: గోపి సుందర్

సినిమాటోగ్రఫీ: ఏ వసంత్

నిర్మాత: బన్నీ వాస్

దర్శకత్వం: సూర్య ప్రతాప్ పల్నాటి

బ్యానర్లు: జి ఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్

విడుదల తేది: 23/12/2022

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ మధ్యనే "కార్తికేయ 2" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా మళ్లీ నిఖిల్ సిద్ధార్థ్ మరియు అనుపమ పరమేశ్వరన్ లు హీరో హీరోయిన్లు "18 పేజెస్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాకి "కుమారి 21ఎఫ్" ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి కథను అందించారు. టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఇవాళ అనగా డిసెంబర్ 23, 2022 న థియేటర్లలో విడుదలైంది. "కార్తికేయ 2" తోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ జంట ఈ సినిమాతో ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించారో చూసేద్దామా..

కథ:

సిద్దు అలియాస్ సిద్ధార్థ్ (నిఖిల్) ఒక యాప్ డెవలపర్ గా పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక అమ్మాయి తో బ్రేకప్ అయిన బాధలో మందు కొడుతూ రోడ్డు మీద తిరుగుతూ ఉండగా తనకి ఒక డైరీ దొరుకుతుంది. సోషల్ మీడియాకి దూరంగా మనుషులకి దగ్గరగా ఉండే ఒక అమ్మాయి నందిని (అనుపమ పరమేశ్వరన్) రాసిన డైరీ అది. ఆ డైరీలో పేజీలు చదవడం పూర్తయ్యాక ఆమె తో ప్రేమలో పడతాడు సిద్ధార్థ్. ఎలాగైనా తనను కలవాలని ఆమె ఊరు కూడా వెళతాడు. కానీ ఆమె ఊర్లో ఉండదు. దీంతో బాధగా హైదరాబాద్ కి తిరిగి వచ్చేసిన సిద్దుకి ఒక కవర్ కోసం నందిని మీద అటాక్స్ జరిగాయని తనని చంపడానికి చూశారని తెలుస్తుంది. పేపర్లో నందిని చనిపోయిందన్న వార్త కూడా వస్తుంది. ఇంతకీ ఆ కవర్లో ఏముంది? నిజంగా నందిని చనిపోయిందా? తనకి ఏమైంది అని సిద్ధార్ధ్ కనిపెట్టగలిగాడా? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

నిఖిల్ ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు అని చెప్పుకోవచ్చు. సినిమాలోని తన పాత్రకి నిఖిల్ చాలా బాగా సెట్ అయ్యాడు. తన నటనతో ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇక స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియాకి దూరంగా ఉండే ఒక అమ్మాయి నందిని పాత్రలో అనుపమ పరమేశ్వరన్ జీవించిందని చెప్పుకోవాలి. చాలా వరకు ప్రేక్షకులను ఈ పాత్ర ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటుంది. డైరెక్టర్ ఆమె పాత్రను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ కూడా ఆ పాత్రలో అంతే బాగా నటించింది. హీరో స్నేహితురాలుగా కనిపించే సరయు తన పంచ్ డైలాగ్ లు, కామెడీతో బాగానే అలరించింది. పోసాని కృష్ణమురళి కూడా తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. అజయ్ మరియు దినేష్ తేజ్ పాత్రల పరిధి కొంత తక్కువే అయినప్పటికీ వాళ్ళు కూడా నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నారు.

సాంకేతిక వర్గం:

గతంలో "కరెంట్" మరియు "కుమారి 21ఎఫ్" సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సూర్య ప్రతాప్ పలనాటి ఈ సినిమాతో కూడా బాగానే ఆకట్టుకున్నారు. ఎప్పుడూ విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకి వచ్చే సూర్య ప్రతాప్ ఈ సినిమాతో కూడా ఒక సరికొత్త కథతో కథను తెరకెక్కించారు. సినిమా కథ మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. కానీ ఎమోషన్స్ మొత్తం హీరో పాత్రకి ఉంటాయి. రొటీన్ కధలకి ఈ కథ చాలా భిన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గోపి సుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. సినిమాలోని ప్రతి సన్నివేశానికి గోపి సుందర్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ మంచి మూడ్ ను సెట్ చేస్తుంది. ఏ వసంత్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ పరవాలేదు అనిపిస్తుంది. అక్కడక్కడా రైటింగ్ ఇంకొంచెం బాగుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సినిమాలోని కొన్ని ఎమోషనల్ డైలాగులు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి.

బలాలు:

కథ

మ్యూజిక్

స్క్రీన్ ప్లే

ట్విస్ట్ లు

నటినటులు

బలహీనతలు:

కామెడీ తక్కువగా ఉండటం

క్లైమాక్స్

కొన్ని సాగతీత సన్నివేశాలు

చివరి మాట:

సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కథని ఎస్టాబ్లిష్ చేయడానికి పాత్రలను ఇంట్రడ్యూస్ చేయడానికి సరిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా బాగానే మొదలవుతుంది. కానీ నిజం తెలుసుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు మొదలైనప్పటి నుంచి కథ కొంచెం డైల్యూట్ అయినట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి ఈ సినిమా ప్లాట్ లైన్ కొంత దెబ్బతింటుంది. అప్పుడప్పుడు వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్నాయి కానీ క్లైమాక్స్ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. కొన్ని ఎమోషన్స్ కి మాత్రమే ప్రేక్షకులు కనెక్ట్ అవ్వగలుగుతారు. హీరోయిన్ పాత్రకు కూడా కేవలం ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ ఆల్ గా "18 పేజెస్" సినిమా ఒక మంచి ప్రేమ కథ గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ కొంచెం సాఫ్ట్ గా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వలేకపోవచ్చు.

బాటమ్ లైన్:

"18 పేజెస్" లోని కొన్ని పేజీలు ప్రేక్షకులను బాగానే అలరిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories