సరిలేరు నీకెవ్వరు రివ్యూ : బొమ్మ దద్దరిల్లింది

సరిలేరు నీకెవ్వరు రివ్యూ : బొమ్మ దద్దరిల్లింది
x
Highlights

భరత్ అను నేను, మహర్షి చిత్రాల తర్వాత మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ..

భరత్ అను నేను, మహర్షి చిత్రాల తర్వాత మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' .. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొద్దిరోజులుగా సందేశాత్మక సినిమాలు చేసుకుంటూ వస్తున్న మహేష్ ఈ సారి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ మొదటిసారి ఆర్మీ లుక్ లో కనిపించడం, 13 ఏళ్ల తరవాత లేడి అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి అ అంచనాలను ఈ సినిమా ఎంత వరకు నిలబెట్టుకుందో మన సమీక్షలో చూద్దాం..

కథ :

ఇండియన్ ఆర్మీలో పనిచేస్తుంటాడు అజయ్‌ కృష్ణ(మహేశ్‌బాబు).. అక్కడ కొందరు ఉగ్రవాదులు స్కూల్ విద్యార్థులను కిడ్నాప్‌ చేస్తారు. దీనితో అజయ్ అండ్ టీం రంగంలోకి దిగి వారిని కాపాడుతాడు. అయితే ఆ సమయంలో అజయ్‌ కృష్ణకి ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. దీనితో అక్కడి నుండి అజయ్ మెడికల్ కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్‌ భారతి(విజయశాంతి)ని వెతుక్కుంటూ కర్నూల్ కి వస్తాడు. అప్పటికే భారతి ఓ మర్డర్ కేసులో విలన్ నాగేంద్రప్రసాద్‌(ప్రకాష్‌రాజ్) పై పోరాటం చేస్తుంది. అప్పుడు భారతికి అజయ్ కృష్ణ ఎలాంటి సహాయం చేశాడు. ఇందులో సంస్కృతి(రష్మిక) పాత్ర ఏంటి ? ఇందులో సూపర్ స్టార్ కృష్ణ ఎలా కనిపించనున్నారు అన్నది తెలియాలంటే తెరపైన చూడాల్సిందే..

ఎలా ఉందంటే ?

దూకుడు సినిమా తర్వాత మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాని చేసింది అయితే లేదు. ఈ సినిమాలో మహేష్ లోని అన్ని యాంగిల్స్ ని టచ్ చేస్తూ అభిమానులకి ఎం కావాలో అన్ని సమకూర్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి. మహేష్ ని ఆర్మీలుక్ లో చూపించిన విధానం సింప్లీ సూపర్బ్.. సినిమా ప్రధమార్ధంలో ఆర్మీ సన్నివేశాలతో కథను సీరియస్ గా నడిపించిన దర్శకుడు ఆ తర్వాత మహేష్ కర్నూల్ వెళ్లేందుకు ట్రైన్ ఎక్కుతాడు. అప్పుడు రష్మిక ఫ్యామిలీతో వచ్చే సన్నివేశాలు , బ్లేడ్‌ గ్యాంగ్‌గా బండ్ల గణేష్‌ తో కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇక సినిమా కర్నూల్ వెళ్ళాక మళ్ళీ సీరియస్‌నెస్‌ వస్తుంది.

ఇంటర్వెల్ లో వచ్చే కొండారెడ్డి బురుజు ఫైట్ సీన్ ఒక్కడు సినిమాని తలపిస్తుంది. మొదటి భాగాన్ని ఎక్కువగా కామెడీతోనే నడిపించిన దర్శకుడు రెండవ భాగంలో అసలు కథని రివిల్ చేస్తూ సీరియస్ గా నడిపించాడు. రెండవభాగం మొత్తం అజయ్‌-భారతి-నాగేంద్రప్రసాద్‌ మూడు పాత్రల చూట్టునే తిరుగుతుంది. విలన్ నాగేంద్రప్రసాద్‌ ప్రసాద్ వేసే స్కేచ్ లను మహేష్ బాబు అడ్డుకోవడం, అక్కడ మహేష్ బాబుని హైలెట్ చేస్తూ సాగే సన్నివేశాలు ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టిస్తాయి. ఇక రాజకీయ నాయకులను బంధించి మహేశ్‌బాబు చెప్పే పిట్ట కథ, వాళ్ల భయపెట్టడానికి బాంబు పెట్టడం లాంటి సన్నివేశాలు బాగున్నాయి. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు రొటీన్ గానే అనిపిస్తాయి. చివర్లో వచ్చే కృష్ణ ఎపిసోడ్ సినిమాకి హైలెట్ అని చెప్పాలి.

ఎవరెలా చేసారంటే?

దూకుడు సినిమా తర్వాత మహేష్ బాబు ఇంత ఎనర్జిటిక్ గా కనిపించిన సినిమా ఇదేనని చెప్పాలి. ఆర్మీ పాత్రలో, భారతి కుటుంబాన్ని రక్షించే పాత్రలో మహేష్ బాబు అదరగొట్టాడు. ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ కామెడీ టైమింగ్ ఖలేజా సినిమాని గుర్తుకు తెస్తుంది. ఇక యాక్షన్ సీన్స్ లో మహేష్ బాబుని చూసిన అభిమానులు విజిల్స్ వేయక మానరు. మహేష్ తరవాత సినిమాకి విజయశాంతి మెయిన్ పిల్లర్ గా చెప్పుకోవాలి. భారతి పాత్రలో జీవించారు. ప్రకాష్ రాజ్ తో వచ్చే సన్నివేశాలలో ఆమె నటన అద్భుతం. ఇక ప్రకాష్ రాజ్ విలన్ గా బాగా రాణించారు. రష్మిక, సంగీత, రాజేంద్రప్రసాద్ తదితరులు తమ పాత్రల మేరకు ఒకే అనిపించారు.

సాంకేతిక వర్గం :

తక్కువ టైం లో సినిమాని తీసినప్పటికీ ఎక్కడ కూడా రిచ్ నెస్ మిస్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ ఆదరిపోయింది. కాశ్మీర్ లోకేషన్స్ ని బాగా చూపించారు. దేవి అందించిన నేపధ్య సంగీతం సినిమాకి ప్లస్ అయింది. ఆర్మీ సీన్స్, యాక్షన్స్ ఎపిసోడ్స్ కి దేవి ఇచ్చిన నేపధ్య సంగీతం వావ్ అనిపిస్తుంది. రామ్ లక్ష్మణ్ యాక్షన్ సన్నివేశాలను బాగా తెరకెక్కించారు. ఎడిటింగ్ కి ఇంకొంచం పనిపెడితే బాగుండు అనిపిస్తుంది.

దర్శకుడు :

కామెడీని టచ్ చేస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ ని టచ్ చేయడంలో అనిల్ రావిపూడి సిద్దహస్తుడు. అలాంటి దర్శకుడికి మహేష్ లాంటి స్టార్ దొరకడం, దానిని కరెక్ట్ గా వాడుకోవడంలో సక్సెస్ అయ్యాడు అనిల్.. ఫ్యాన్స్ కి బొమ్మ దద్దరిల్లింది అనే సినిమాని అందించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.

చివరగా : 'బొమ్మ దద్దరిల్లిందమ్మా'

Show Full Article
Print Article
More On
Next Story
More Stories