Satyam Sundaram Movie Review: అప్రయత్నంగా కన్నీళ్ళు వస్తే... అది మీ తప్పు కాదు!
Satyam Sundaram 2024 Movie Review: కార్తీ (Karthi), అరవింద్ స్వామి (Arvind Swamy) ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచాయి.
Satyam Sundaram Movie Review: తమిళంలో తెరకెక్కిన 96 సినిమాకు తెలుగులో కూడా ఫాన్స్ ఉన్నారు. ఆ సినిమా తీసినప్రేమ్ కుమార్ దర్శకత్వంలోనే ఇప్పుడు సత్యం సుందరం అనే సినిమా తెరకెక్కింది. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచాయి. దానికి తోడు కార్తీ అన్న వదిన సూర్య- జ్యోతికలు ఈ సినిమాను నిర్మించడంతో పాటు తెలుగులో ఏషియన్ సురేష్ సంస్థ సినిమాని రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా సినిమా మీద తెలుగు ప్రేక్షకులలో కూడా ఆసక్తి ఏర్పడింది.
ట్రైలర్ కూడా ఫీల్ గుడ్ గా ఉండడంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉంది? ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనిపించిందా? 96 సినిమాను ఇష్టపడిన ప్రేక్షకులను చిత్ర దర్శకుడు మరోసారి ఆకట్టుకున్నారా?
సత్యం సుందరం కథ:
చిన్నప్పుడే తండ్రి ఆస్తులు పోగొట్టుకోవడంతో ఉన్న ఊరి నుంచి విశాఖపట్నం షిఫ్ట్ అవుతాడు సత్యమూర్తి(అరవింద్ స్వామి). తన సొంత ఊరిలో ఉన్న ఏకైక బంధం తన చెల్లెలు భువన. ఆమె వివాహం కోసం ఇష్టం లేకపోయినా తన సొంత ఊరికి వెళ్లాల్సి వస్తుంది. చుట్టం చూపుగా వెళ్లి రాత్రి బస్సుకు తిరిగి వచ్చేద్దాం అనుకుంటే పెళ్లిలో పరిచయమైన ఒక భోళా మనిషి(కార్తి) కారణంగా బస్ మిస్ అవుతాడు.
ఆ సందర్భంలో అనుకోకుండా చేసిన ఒక చిన్న పని ఆ కుటుంబ సభ్యుల జీవితాలను మార్చేసిందని తెలుసుకుంటాడు. అయితే, ఉదయాన్నే లేవగానే తమను పేర్లతో దీవించాలని వారు అనడంతో, పేరు కూడా తెలియదని గిల్టీగా ఫీలయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అలా వెళ్ళిపోయిన సత్యం సదరు భోళా మనిషి పేరు ఎలా తెలుసుకున్నాడు? పేరు తెలుసుకున్నాక మళ్ళీ అతన్ని కలిసే ప్రయత్నం చేశాడా? అసలు అనుకోకుండా సత్యం చేసిన మంచి పని ఏంటి? ఆ మంచి పని సదరు వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? లాంటి వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథ విశ్లేషణ:
ఇది ఒక నవల అని, నవలగా రాసుకున్న కథతోనే సినిమా చేశామని సినిమా యూనిట్ ముందు నుంచి చెబుతూ వచ్చింది. దానికి అనుగుణంగానే సినిమా మొదలైనప్పటి నుంచి ఒక రిఫ్రిషింగ్ ఫీల్ తో సినిమా సాగుతుంది. ఏదో సినిమా చూస్తున్నట్టు కాకుండా చిన్నప్పటినుంచి మనం చూసిన వ్యక్తును మరోసారి తెర మీద చూస్తున్నామేమో అనిపిస్తుంది. ఆస్తులు విషయంలో అయిన వాళ్లే మోసం చేస్తే అసలు మనుషుల మీద నమ్మకం పోగొట్టుకున్న ఒక యువకుడు జీవితంలో ఎలా మారాడు? అతని జీవితాన్ని మరో మలుపు తిప్పేందుకు అతనికి బావమరిది వరస అయ్యే మరో యువకుడు ఎలా దోహదమయ్యాడు? అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కించారు.
సింగిల్ లైన్ ఆర్డర్లో చెప్పుకుంటే చాలా మామూలుగా అనిపిస్తుంది. కానీ, తెరమీద కార్తీతో పాటు అరవింద్ స్వామి నటన సినిమాను వేరే లెవల్ కు తీసుకువెళ్లింది. అమాయకత్వం కూడిన క్యారెక్టర్ లో కార్తి, గిల్టీ భారాన్ని మోసే క్యారెక్టర్ లో అరవింద్ స్వామి ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. సినిమా మొత్తం మీద కొన్ని సీన్లు అయితే గుర్తుండిపోతాయి. చెల్లెలికి పట్టీలు పెట్టే సీన్, బావా బావమరుదులు సైకిల్ మీద షికార్లు కొట్టే సీన్ వంటివి బాగా రిజిస్టర్ అయిపోతాయి.
Also Read: రికార్డు కలెక్షన్ల దిశగా దేవర.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు రాబట్టనుందో తెలుసా?
అలాగే జీవితంలో ఈరోజు మంచి అనుకున్నది రేపు చెడు అవచ్చు, ఈరోజు చెడు అనుకున్నది రేపు మంచి అవ్వచ్చు అనే ఒక పాయింట్ని అత్యద్భుతంగా చెప్పడం ఆసక్తికరం. ఒక్కొక్క క్యారెక్టర్ ను మరో క్యారెక్టర్ తో లింక్ చేసిన విధానం మంచి సినిమాటిక్ ఫీల్ ఇచ్చేలా ఉంది. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేస్తే అది మీ తప్పు కాదు అంతలా మీరు సినిమాలో లేనమైపోయారని అర్థం.
కమర్షియల్ మీటర్ పక్కన పెడితే సినిమా చూసిన తర్వాత మన అనుకున్న వాళ్ళతో ఒక్కసారి ఐనా ఫోన్లో అయినా కనీసం పలకరించాలని భావన కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అదే సమయంలో సినిమా సాగ తీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా ఎంతసేపు చూడాలా? అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే అలా అనిపించినప్పుడే కార్తీ తనదైన అమాయకత్వంతో నవ్వించే ప్రయత్నం చేస్తూ అందులో సక్సెస్ అయ్యాడు.
నటీనటులు ఎలా చేశారు..
ఇక నటీనటుల విషయానికి వస్తే ఒకపక్క కార్తీ మరొకపక్క అరవింద్ స్వామి ఇద్దరూ తమను ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న నటీనటులు. ఈ సినిమాలో అమాయకుడైన పాత్రలో కార్తీ ఇమిడిపోయాడు. ఎప్పటిలాగే తనకు బాగా సెట్ అయ్యే సిటీ నుంచి వచ్చిన రిజర్వ్డ్ పెద్దమనిషి క్యారెక్టర్ లో అరవింద్ స్వామి కూడా బాగా సెట్ అయ్యాడు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. ఇక సినిమాలో మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్ టీమ్ బాగుందా...
ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని సినిమాటోగ్రాఫర్ ఒక కలర్ఫుల్ పెయింటింగ్ లా ప్రేక్షకులకు ప్రజెంట్ చేసే ప్రయత్నం అభినందనీయం. ఇక డబ్బింగ్ విషయంలో రాకేందు మౌలికి ప్రత్యేక అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఇది ఒక తమిళ్లో డబ్బింగ్ సినిమా అనే ఆలోచన మరిచిపోయి సినిమాలో లీనం అయ్యేలా ఆ ప్రాసెస్ ఉంది.
అయితే గోవింద్ వసంత 96 మ్యూజిక్ తర్వాత మరోసారి ప్రేమ్ తో కలిసి పనిచేయడంతో అదే మ్యాజిక్ కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశ పడక తప్పదు. అయితే సినిమాకు ఎంతవరకు అవసరమో అంతవరకు తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎడిటింగ్ టేబుల్ మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే నిడివి కంట్రోల్ చేసే అవకాశం ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
కార్తీ - అరవింద్ స్వామి నటన - కెమిస్ట్రీ,
కథ,
కామెడీ
మైనస్ పాయింట్స్:
సాగతీత నిడివి,
మిస్సయిన కొంత ఎమోషనల్ కనెక్ట్
హెచ్ఎంటీవీ వర్డిక్ట్:
సత్యం సుందరం నవ్విస్తూ ఏడిపిస్తూ బంధాలను గుర్తు చేస్తూ ప్రేక్షకులను ఇమోషనల్‌గా వెంటాడే సినిమా.
రేటింగ్: 3/5
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire