5 Underrated Tourist Attractions in India: 2025లో తప్పకుండా చూడాల్సిన టూరిస్ట్ స్పాట్స్ ఇవే...

5 Under-Rated Tourist Attractions in India
x

5 Under-Rated Tourist Attractions in India: 2025లో తప్పకుండా చూడాల్సిన టూరిస్ట్ స్పాట్స్ ఇవే...

Highlights

భారతదేశంలో టూరిజం అంటే చాలా మంది గోవా, హిమాచల్ ప్రదేశ్, తిరుపతి, కాశీ వంటి ప్రదేశాలకు వెళ్తుంటారు.

భారతదేశంలో టూరిజం అంటే చాలా మంది గోవా, హిమాచల్ ప్రదేశ్, తిరుపతి, కాశీ వంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. అజంతా ఎల్లోరా గుహలు, ఆగ్రాలో తాజ్ మహల్, జైపూర్ ప్యాలేస్‌ ఇవన్నీ కూడా మనకు వెంటనే గుర్తుకు వస్తాయి. అయితే, ఇవి కాకుండా భారతదేశంలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కొత్త ప్రదేశాలను చూడాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలని అని ప్రయాణాలు చేసే వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇవి. వీటి గురించి పెద్దగా ప్రచారం లేదు. కానీ, అవి పర్యాటకులకు కనువిందు చేస్తాయి. మరచిపోలేని అనుభవాన్ని బహుమానంగా ఇస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.


1. జైరో వ్యాలీ – అరుణాచల్ ప్రదేశ్

ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జైరో లోయ భూతల స్వర్గంలా ఉంటుంది. ఆకుపచ్చని కొండ ప్రాంతాలు, లోయలతో ఈ ప్రాంతం కనువిందు చేస్తుంది. విశాలంగా పరచుకున్న వరి చేల మీద నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటే ప్రాణం లేచివచ్చినట్లుంటుంది. వీటికి తోడు అపతాని ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలను చూడడం ఒక మరిచిపోలేని అనుభూతి.

జైరో వ్యాలీ ప్రత్యేకతలు:

- ప్రకృతి సౌందర్యానికి నిలయం. ఏడాది పొడవునా చల్లని వాతావారణం.

- జైరో మ్యూజిక్ ఫెస్టివల్ ఇక్కడ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారు. అప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే ప్రకృతి-సంగీతాల సమ్మేళనం అంటే ఏమిటో అనుభవంలోకి వస్తుంది.

- కొండలు ఎక్కాలనే ఆసక్తి ఉన్నవారు ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ట్రెకింగ్ చేయొచ్చు. పైకి ఎక్కుతున్న కొద్దీ తూర్పు హిమాలయాల మనోహర దృశ్యం కనిపిస్తుంది.

- స్థానిక అపతానీ తెగల వ్యవసాయ పద్ధతులు ప్రకృతికి అనువుగా ఉంటాయి. అక్కడి ప్రజలతో మాట్లాడితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి.


2. మండు, మధ్యప్రదేశ్

మాండవగడ్ అని కూడా ఈ పిలిచే ఈ ప్రాంతానికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. అందమైన ప్రకృతి దృశ్యాల నడుమ అఫ్గాన్ వాస్తుకళతో నిర్మించిన కట్టడాలు చూపరులను కట్టి పడేస్తాయి.

మండు ప్రత్యేకతలు:

- రెండు చెరువుల మధ్య కట్టిన జహాజ్ మహల్ అంటే నౌకా భవనాన్ని చూడవచ్చు. అలాగే, ఎంతో అందంగా నిర్మించిన రాణి రూపమతి నివాసంలోకి వెళ్ళవచ్చు.

- సుల్తాన్ బాజ్ బహదూర్, రాణి రూపమతిలో ప్రేమకథను తెలుసుకుంటే మీ టూర్ మరింత రొమాంటిగ్గా మారుతుంది.

- వానాకాలంలో వెళితే ఈ ప్రాంతమంతా పచ్చని తివాచీని పరచుకున్నట్లు కనిపిస్తుంది. ఫోటోగ్రాఫర్లకు ఈ ప్రదేశం ఒక స్వర్గం లాంటింది.

- మండులో మాత్రమే దొరికే తీయగా కరకరలాడే ‘మండు కా ఇమ్లీ’ పండును రుచి చూడడం మాత్రం మరిచిపోవద్దు.


3. మజూలీ, అస్సాం

బ్రహ్మపుత్ర నదిలోని దీవి మజూలీ. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపం. అస్సాంలో వెలిసిన వజ్రం అని కూడా అంటారు. ఇక్కడి ప్రకృతి, సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

మజూలీ ప్రత్యేకతలు:

- ప్రాచీన సాహిత్య, నృత్య, చిత్ర కళారీతులనకు నెలవు మజూలీ.

- సుందరమైన ఈ దీవిలో విశాలమైన వరిచేలు, వలస పక్షులు, స్వచ్ఛమైన సరస్సులు పర్యాటకులను కదలకుండా చేస్తాయి.

- స్థానిక హస్తకళాకారులు చేసిన కళారూపాలను కొని తెచ్చుకోవడం మాత్రం మరిచిపోవద్దు.

- ముఖ్యంగా, అక్టోబర్ – మార్చి నెల మధ్యలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం చాలా బాగుటుంది. అప్పుడు జరిగే రాస్ మహోత్సవ వేడుకలను చూడడం ఒక మరిచిపోలేని అనుభూతి.


4. గోకర్ణ, కర్నాటక

గోవా గురించి అందరికీ తెలుసు. కానీ, అంతే అందంగా ఉండే మరో బీచ్ టౌన్ గోకర్ణ గురించి చాలా మందికి తెలియదు. స్వచ్ఛమైన తీర ప్రాంతాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. గోకర్ణ ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రకంపనలు మనసును కుదిపేస్తాయని అక్కడి వెళ్ళి వచ్చిన వారు చెబుతుంటారు.

గోకర్ణ ప్రత్యేకతలు:

- రద్దీ లేకుండా ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉండే ఓమ్ బీచ్, పారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్‌లను చూడడం ఒక ప్రత్యేక అనుభవం. ఇవి చూస్తే అన్ని సముద్ర తీరాలూ ఒకేలా ఉండవని ఒప్పుకుంటారు.

- ఇక, ఆ సమీపంలోనే మహాబలేశ్వర ఆలయాన్ని కూడా చూడవచ్చు.

- బీచ్ క్యాంపింగ్, యోగ – ధ్యాన కేంద్రాలు గోకర్ణ ప్రత్యేక ఆకర్షణలు.

- అరేబియా సముద్ర తీరం వెంబడి ఉన్న కొండల మీదకు ట్రెకింగ్ చేస్తుంటే కంటికి కనిపించనంత మేరా పసందైన దృశ్యాలే.

-గోకర్ణలో విభూతి జలాపాతాలు మరో ఆకర్షణ. అన్నట్లు, అంతదాకా వెళ్ళి యానా గుహలు చూడకుండా రావద్దు.


5. తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్

హిమాలయాల ఒడిలో ఉంటుందీ తవాంగ్. ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక ఘన వారసత్వం తవాంగ్‌ను ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా మార్చేశాయి.

తవాంగ్ ప్రత్యేకతలు:

- మహాయాన బౌద్ధానికి కేంద్రంగా నిలిచిన తవాంగ్ మోనాస్టరీని చూసి తీరాల్సిందే.

- నిరంతరం మంచుతో ఉండే సేలా పాస్, అందమైన పీటీ సో సరస్సులు చూస్తే ప్రకృతి సౌందర్యం అంటే ఏమిటో కొత్తగా అనుభవంలోకి వస్తుంది.

- స్థానిక మోంపా తెగ ప్రజల ఆతిథ్యం, సంస్కృతీ సంప్రదాయాలు గొప్పగా ఉంటాయి.

- మార్చి, మే, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడం మరీ బాగుంటుంది. మంచు టోపీలు పెట్టుకున్నట్లు కొండలు ఈ సీజన్లో చాలా అద్భుతంగా కనిపిస్తాయి.

ఈ ప్రదేశాలే ఎందుకు?

ఎందుకంటే, ఇవి భారతదేశంలోని రహస్య సౌందర్య క్షేత్రాలు. జన సందోహం నడుమ యాత్రలు చేయడం కాకుండా, కొన్ని రోజులు ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో గడపాలనుకునే వారికి ఇవి భూతల స్వర్గాలు. ఈ అయిదు ప్రదేశాలు అయిదు భిన్నమైన పర్యాటక అనుభవాలను ప్రసాదిస్తాయి. ఈ 2025లో ఈ ప్రదేశాలకు పర్యటించండి. ప్రకృతి ఒడిలో సేదదీరుతూ, కొత్త సంస్కృతులను తెలుసుకోండి. సరికొత్త అనుభవాలను సొంతం చేసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories