Raksha Bandhan 2024 Gift Ideas: ఈ రాఖీ పండగకు మీ అక్కాచెల్లెళ్లను ఇలా సర్‌ప్రైజ్ చేయండి
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆప్యాయతలకు, అనురాగాలకు వేదికగా నిలిచే రాఖీ పండగను ఏ ఏడాదికి ఆ ఏడాది మరింత స్పెషల్ చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. ఈసారి అక్కాచెల్లెమ్మలను ఎలాంటి కానుకలతో సర్‌ప్రైజ్ చేయాలా అని తెగ ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ గిఫ్ట్ ఐడియాలు.
Raksha Bandhan 2024 Gift Ideas: రాఖీ పండగకు భారతీయ సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ముళ్లతో అక్కచెల్లెళ్లకు ఉండే అనుబంధాలకు, ఆప్యాయతలకు ప్రతీకగా రాఖీ పండగ నిలుస్తుంది. సంవత్సరం పొడుగునా ఎన్నో పండగలు వస్తుంటాయి, పోతుంటాయి. అలాగే ఏ పండగకు ఉండే ప్రత్యేకతలు వాటికి ఉంటాయి. కానీ మిగతా పండగలకు ఆడపిల్లలు తమ అన్నదమ్ముళ్లను కలిసినా, కలవకపోయినా... రాఖీ పండగకు మాత్రం తప్పకుండా కలుస్తారు. ఎన్ని కష్టాలను ఓర్చుకునయినా సరే ఆ రోజు మాత్రం తమ సోదరుడిని కలిసి రాఖీ కట్టనిదే వారికి కాలు నిలవదు.
అన్నాదమ్ముళ్లు సైతం తమ అక్కచెల్లెళ్లకు ఏ కష్టం వచ్చినా వారికి తాము జీవితాంతం అండగా ఉంటాం అని భరోసా ఇస్తుంటారు. అలాంటి ఆప్యాయతలకు, అనురాగాలకు వేదికగా నిలిచే రాఖీ పండగను ఏ ఏడాదికి ఆ ఏడాది మరింత స్పెషల్ చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. అందులో భాగంగానే తమ అక్కాచెల్లెమ్మలను ఎలాంటి కానుకలతో సర్‌ప్రైజ్ చేయాలా అని తెగ ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ గిఫ్ట్ ఐడియాలు.
పర్సనలైజ్డ్ జువెలరీ : మామూలుగానే ఆడపిల్లలకు జువలెరీ అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం. అందులోనూ పర్సనలైజ్డ్ జువెలరీ అంటే ఇక వారికి ఉండే ఇష్టం ఏ స్థాయిలో ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఉదాహరణకు వారి పేరుతో లేక పేరులో తొలి అక్షరంతోనో లేదా వారి ముద్దు పేరు వచ్చేలా ఏదైనా చైన్ లాకెట్, లేదా బ్రేస్‌లెట్, రింగ్ వంటివి డిజైన్ చేయించి ఇచ్చారే అనుకోండి.. ఇక వారి ఆనందానికి హద్దులే ఉండవు.
స్మార్ట్ ఫోన్స్ : స్మార్ట్ ఫోన్ అంటే ఎవరికి చేదు చెప్పండి !! అందులోనూ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్తకొత్త ఫీచర్స్‌తో ఎన్నో మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. మీ సిస్టర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి ఉపయోగపడేలా ఒక మాంచి స్మార్ట్ ఫోన్ గిఫ్టుగా ఇచ్చారనుకోండి.. ఆ హ్యాప్పీనెస్సే వేరు కదా. ఉదాహరణకు ఇప్పుడు చాలామంది లేడీస్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి ఎన్నో కొత్తకొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. కొంతమంది తమ చదువు కోసం ఉపయోగిస్తే, ఇంకొంతమంది తమ జాబ్ స్కిల్స్ పెంచుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు. మరికొంతమంది యూట్యూబర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్స్ అవతారమెత్తి వాళ్లు కూడా సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు కృషి చేస్తున్నారు. అలా మీరు ఇచ్చే ఫోన్ వారికి ఏదో ఒక మంచి అవసరానికి ఉపయోగపడితే మీ ఇద్దరికీ అంతకంటే కావాల్సింది ఏముంటుంది.
స్మార్ట్ వాచ్ : ఒకప్పుడు వాచ్ అంటే కేవలం టైమ్ తెలుసుకునే ఒక సాధనం. కానీ ఇప్పుడు స్మార్ట్ వాచ్ అంటే అంతకుమించి ఇంకెంతో ఉంది. ఒకవైపు ఫ్యాషన్ యాసెసరిగా ఉపయోపగపడుతూనే, మరోవైపు బీపీ, పల్స్, సాచ్యురేషన్ వంటి కీలకమైన హెల్త్ ట్రాకింగ్ కోసం కూడా పనిచేస్తోంది. అంతేకాదు.. వారి స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసి కాల్స్ మాట్లాడటం నుండి మెసేజెస్ రీడ్ చేయడం, లొకేషన్ ట్రాకింగ్ వరకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
సూపర్ గిఫ్ట్ ఓచర్స్ : మీరు ఎలాంటి గిఫ్ట్ కొనిచ్చినా ఆ గిఫ్ట్ ఆమెకు నచ్చుతుందో లేదోనని ఆలోచిస్తున్నారా ? ఐతే దానికి కూడా ఓ సొల్యూషన్ ఉంది. మీరు ఎంత మొత్తమైతే మీ సిస్టర్‌కి కొనిచ్చే గిఫ్ట్ కోసం వెచ్చించాలి అని అనుకున్నారో అంతే మొత్తాన్ని గిఫ్ట్ ఓచర్ రూపంలోనూ ఇవ్వొచ్చు. అప్పుడు వాళ్లే ఆ గిఫ్ట్ ఓచర్‌ని ఉపయోగించి వాళ్లకు నచ్చింది వాళ్లు కొనుక్కుంటారు. ఇది ఇంకా సూపర్ కదా.. అందుకోసం అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కొన్ని యూపీఐ పేమెంట్స్ సంస్థలు, ఇంకొన్ని గిఫ్ట్ సెల్లింగ్ బిజినెస్ సంస్థలు గిఫ్ట్ ఓచర్ రెడీ చేసి ఇస్తున్నాయి. మార్కెట్లో రెడీమేడ్ గిఫ్ట్ ఓచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
కస్టమైజ్డ్ గిఫ్ట్స్ : మార్కెట్లో ఉన్న గిఫ్ట్స్ ఏవీ మీ సిస్టర్ ఇష్టాయిష్టాలు, అభిరుచులకు అనుగుణంగా కనిపించకపోతే.. మీరే ప్రత్యేకంగా ఓ కస్టమైజ్డ్ గిఫ్ట్ బాక్స్ రెడీ చేయించి అందించండి. ఉదాహరణకు ఆమెకు నచ్చిన మేకప్ ఐటమ్స్, హానీ కలిగించని కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్, పర్‌ఫ్యూమ్స్, లేదా వెల్‌నెస్ కేర్ తీసుకునే వారి కోసం అలాంటి ఐటమ్స్ ప్యాక్ చేయించండి. వాళ్లు అవి ఉపయోగిస్తున్నప్పుడల్లా మీరు వారి అభిరుచికి ఇచ్చే ప్రాధాన్యతలను, వారి ఇష్టాలను గౌరవించే తత్వాన్ని గుర్తుచేస్తుంటుంది.
డెకరేషన్ కిట్స్ : లేడీస్ ఇల్లుని అందంగా అలంకరించుకోవడానికి బాగా ఇష్టుపడుతుంటారు. అందులోనూ ఇకపై రాబోయేదంతా వరుసగా పండగల సీజన్ కావడంతో ఇంటికి వచ్చిపోయే వారిని ఆకట్టుకునేలా మరింత అందంగా అలంకరించుకోవాలనే కోరిక సహజంగానే ఉంటుంది. అందుకే వారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకుని అందుకు అవసరమైన డెకరేషన్ మెటీరియల్, డిజైన్స్ అందించే ప్లాన్ చేశారనుకోండి.. అవి చూసినప్పుడల్లా మీరు మీ సిస్టర్ మదిలో మెదులుతూనే ఉంటారు.
ఇలా చెప్పుకుంటూపోతే ఇవేకాకుండా ఇంకెన్నో రకాలుగా మీరు మీ సిస్టర్‌కి ఇష్టమైన కానుకలు అందించవచ్చు. ఉదాహరణకు ల్యాప్‌టాప్, కెమెరా, స్కూటీ, కారు... ఇలా ఎవరి ఆర్థిక స్తోమతకు తగిన విధంగా వారు స్పందిస్తుంటారు. ఐతే, అవన్నీ కూడా ఆమె ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చేవే. కానీ అన్నింటికిమించి ముందుగా ఆమె అవసరాలు ఏంటో గుర్తించి, అవి అందిస్తే.. మీ సిస్టర్ అవసరం తీరడంతో పాటు ఆమె ముఖంలో ఆనందం కూడా కనిపిస్తుంది.
అన్నట్టు అక్కచెల్లెళ్లను మురిపించాలంటే అందుకోసం ప్రతీసారి భారీగా డబ్బే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండోయ్... ఎందుకంటే డబ్బు కంటే అత్యంత విలువైనవి ప్రేమ, ఆప్యాయత-అనురాగాలు. అవి వారికి ఎప్పుడూ అందించండి. " మీ తోబుట్టువులకు ఏ కష్టమొచ్చినా అమ్మానాన్నల తరువాత మీ కోసం నేనున్నాను " అని వారికి భరోసా ఇవ్వగలిగితే.. దానిముందు ఎంత ఖరీదైనదైన బహుమతి అయినా చిన్నబోవాల్సిందే కదా!!
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire