సోషల్ మీడియాతో విచ్ఛిన్నమవుతున్న బంధాలు.. కొత్త బంధాలతో ఎలాంటి చిక్కులొస్తున్నాయి ?
సామాజిక అనుబంధాలను పెంచాల్సిన సోషల్ మీడియా చివరకు కుటుంబ బంధాలను తెంచేసిదిగా మారుతోంది. హత్యలకు, విడాకులకు కారణమవుతోంది. ఇటీవల ప్రకాశం జిల్లా లో...
సామాజిక అనుబంధాలను పెంచాల్సిన సోషల్ మీడియా చివరకు కుటుంబ బంధాలను తెంచేసిదిగా మారుతోంది. హత్యలకు, విడాకులకు కారణమవుతోంది. ఇటీవల ప్రకాశం జిల్లా లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియా వికృత రూపానికి అద్దం పట్టింది. భార్య టిక్ టాక్ వీడియోలు చేయడం నచ్చని భర్త చివరకు భార్యను హత్య చేశాడు. కనిగిరిలో లో టైలర్ గా పని చేస్తున్న చిన పాచ్చూ తన భార్య ఫాతిమా పై అనుమానం పెంచుకున్నాడు. దానికి తోడు ఆమె టిక్ టాక్ వీడియోలు చేయడం ఆగ్రహం తెప్పించింది. చివరకు ఆమెను హత్య చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన వారి కోసం ఇళ్ళు వదిలిపెట్టి వచ్చిన అమ్మాయిలూ ఉన్నారు. తెలంగాణ లోని సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలో ఇలాంటి సంఘటనే జరిగింది. ముక్త మాసనపల్లి గ్రామానికి చెందిన అమ్మాయికి అనంతపురం జిల్లా దర్గా వన్నూరు కు చెందిన అబ్బాయితో టిక్ టాక్ లో పరిచయం పెరిగింది. పెళ్ళి చేసుకుంటాడని భావించిన ఆ అమ్మాయి ఇల్లు వదిలి వచ్చేసింది. తోడుగా మరో అమ్మాయిని వెంట తెచ్చుకుంది. అబ్బాయి ఇంటికి వెళ్తే నీవెవరో తెలియదు అనడంతో షాక్ కు గురైంది. మరికొన్ని సంఘటనల్లో భార్యాభార్తలు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకోకున్నా సోషల్ మీడియా విషయంలో రోజూ తగాదాలు పడే భార్యాభర్తలూ ఎంతో మంది ఉన్నారు. ఇక ఆఫీసుల్లో టిక్ టాక్ వీడియోలు చేసి ఉద్యోగాలు పోగొట్టుకున్న వారూ ఉన్నారు. అసలు సోషల్ మీడియా మన జీవితాల్లోకి ఎందుకిలా చొచ్చుకొచ్చిందో చూద్దాం.
సోషల్ మీడియా ఈ రోజున అందరి జీవితాల్లో విడదీయలేని భాగమైపోయింది. దీంతో కొంత మంచి ఉన్నప్పటికీ చెడునే ఎక్కువగా జరుగుతోంది. చాలా మందికి అదో వ్యసనంలా మారిపోయింది. కొత్తగా వచ్చిన టిక్ టాక్ లాంటి యాప్ లతో ఈ వ్యసనం మరింత ముదిరిపోయింది. కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. అవి విడాకులకు, హత్యలకూ దారి తీస్తున్నాయి. అంతేగాకుండా ఇతరుల నుంచి లైక్ లు రావాలనే కోరిక పెరిగిపోతోంది. దాంతో ఎలా పడితే అలా డ్రెస్సింగ్ చేసుకొని వీడియోలు పోస్ట్ చేయడం, సాహసాలు చేయడం చేస్తున్నారు. పులులు, సింహాలు, ఏనుగులు వంటి వాటికి దగ్గరగా వెళ్ళి ప్రమాదాల బారిన పడుతున్నారు. నదులు, సముద్రాలు, చెరువుల్లో మునిగిపోతున్నారు. ఎత్తయిన ప్రాంతాల నుంచి కిందపడిపోతున్నారు. ఇలాంటి సంఘటనలెన్ని జరిగినా ఇంకా మరెంతో మంది అదే బాటలో వెళ్తున్నారు. సోషల్ మీడియాలో వెలిగిపోతాం అనే భావన వారిని ఇలాంటి పనులు చేసేందుకు ప్రేరేపిస్తోంది.
ఇక విద్యార్థుల విషయానికి వస్తే గంటల తరబడి సోషల్ మీడియాలో కాలం గడిపే వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారు తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నారు. పెద్దలకు తెలిస్తే తిడుతారనుకునే పిల్లలు చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫేస్ బుక్ లాంటి సంస్థలు కొంత బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి. అదే సమయంలో టిక్ టాక్ లాంటి యాప్ లు మాత్రం ఎవరేం చేసినా తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నాయి. చైనాకు చెందిన టిక్ టాక్ సంస్థ ధనార్జనే ధ్యేయంగా పని చేస్తోంది. ఆదాయానికే ప్రాధాన్యం ఇస్తోంది. యూజర్లు ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు అది ఇతర యూజర్ల పై ఎలాంటి ప్రభావం కలిగిస్తోంది లాంటి అంశాలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇన్నాళ్లుగా కొనసాగుతూ వచ్చిన భారతీయ సంస్కృతి దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది. పేరుకు కొన్ని గైడ్ లైన్స్ పెట్టినా వాటిని అమలు చేసిన దాఖలాలు మాత్రం లేవు. హేట్ స్పీచ్, ఎక్స్ పోజింగ్ లాంటి అంశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ట్రోలింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం అధికమైపోయింది. కొంతమంది కలసి ఓ గ్రూప్ గా ఏర్పడి ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకుంటున్నారు. దీంతో గొడవలు జరిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. టిక్ టాక్ యూజర్లలో మెచ్యూరిటీ లేకపోవడంతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతోమంది అప్ కమింగ్ కళాకారులు ఈ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. ఈ విధమైన ట్రోలింగ్ వారి కెరీర్ ను దెబ్బ తీస్తోంది. ఇలాంటి నెగెటివ్ పాయింట్స్ ఎన్నో టిక్ టాక్ లో ఉన్నాయి. అందుకే ఇప్పడు టిక్ టాక్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.
టిక్ టాక్ ను ఉపయోగించే వారిలో చాలామంది 20 ఏళ్ళ లోపువాళ్లే. 15 సెకన్ల లోపు వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు. వీటిలో అధిక శాతం పాటలకు పెదాలు సింక్ చేస్తూ పాడే వీడియోలే. కామెడీ దృశ్యాలు కూడా ఉంటాయి. యూజర్ల ఫాలోవర్లుకు మాత్రమే కాకుండా అపరిచితులకూ ఈ వీడియోలు అందుబాటులో ఉంటాయి. అంటే టిక్ టాక్ లో ఉండే అకౌంట్లు పబ్లిక్ అందరికీ అందుతాయి. తాము కోరుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉండేలా చేసుకునే ఆప్షన్ ఉన్నా దాన్ని ఉపయోగించుకునే వారు తక్కువే. ఏదో ఒకటి చేసి టిక్ టాక్ స్టార్ కావాలనే తపన యూజర్లలో పెరిగిపోతున్నది. 13 ఏళ్ళకు పైబడిన వారెవరైనా టిక్ టాక్ ఉపయోగించవచ్చు. పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నా, వాటిని ఉపయోగించే వారు తక్కువే. చైనాకు చెందిన యాప్స్ తమకు సహకరించాలని అక్కడి ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. టిక్ టాక్ తో దేశభద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అనేక దేశాలు భావిస్తున్నాయి. అమెరికాలోనూ ఇప్పుడు టిక్ టాక్ పై పెద్ద వివాదం నడుస్తోంది. టిక్ టాక్ పై విచారణ జరపాలని అమెరికా చట్టసభల సభ్యులు కోరుతున్నారు.
టిక్ టాక్ కు అలవాటు పడిన వాళ్ళు ఇక దాన్నే ప్రపంచంగా భావిస్తుంటారు. తమకు ఇష్టమైన వీడియోలను ఒకదాని తరువాత ఒకటి చూస్తుంటారు. అలా వరుసగా వారికి ఇష్టమైన వీడియోలు వచ్చేలా చేసే ఆల్గోరిథమ్ టిక్ టాక్ లో ఉంది. దీంతో గృహిణులు అవి చూస్తూ ఇంటి విషయాలు పట్టించుకోకపోవడం పిల్లలు చదువుకోకుండా వీడియోలు చూడడం వంటివి చేస్తున్నారు. ఇక ఆఫీస్ లోనూ టిక్ టాక్ చూడడం అలవాటు చేసుకున్న వారు ఆ తరువాత పని ఒత్తిడితో అనారోగ్యాలకు గురవుతుంటారు. ఏ విషయంలోనైనా మంచీ, చెడూ ఉంటాయి. చెడును వదిలేసి మంచినే స్వీకరిద్దాం. ఈ వ్యసనానికి బానిసలం కాకుండా చూసుకునే బాధ్యత మనపైనే ఉంది. మనల్నే కాదు రేపటి తరాన్ని కూడా కాపాడుకుందాం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire