Inclisiran Injection: గుండెపోటు రాకుండా చేసే కొత్త ఇంజక్షన్ వచ్చేసింది...

ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్: గుండెపోటుకు చెక్
x

ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్: గుండెపోటుకు చెక్

Highlights

Inclisiran injection: గుండెపోటు రాకుండా చేసే ఒక కొత్త ఇంజెక్షన్ వచ్చింది. దీనిపేరు ఇంక్లిసిరాన్. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దీనికి అనుమతులు ఇచ్చింది.

Inclisiran injection: గుండెపోటు రాకుండా చేసే ఒక కొత్త ఇంజెక్షన్ వచ్చింది. దీనిపేరు ఇంక్లిసిరాన్. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దీనికి అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు ఈ డ్రగ్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇండియా కంటే ముందే అమెరికా, యూకేలలో దీనికి అనుమతులు లభించాయి.

ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్ ఏం చేస్తుంది…

సాధారణంగా గుండెలోని రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రవాహం నిలిచిపోయి గుండెపోటు వస్తుంది. కొత్తగా వచ్చిన ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్ రక్తనాళాల్లో పెరిగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని పరిశోధకులు చెప్పారు.

శరీరంలో చెడు కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించేందుకు ప్రస్తుతం స్టాటిన్స్ అనే డ్రగ్ ఉపయోగిస్తున్నారు. దీనికంటే ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్ చాలా మెరుగ్గా పనిచేస్తుందని పరిశోధనలు తేల్చాయి.

ఆరు నెలలకోసారి ఈ ఇంజెక్షన్ తీసుకొంటే గుండెపోటు దరిచేరదని సైంటిస్టులు చెబుతున్నారు. ప్లాస్మాలో తక్కువ సాంద్రత గల కొవ్వు( ఎల్ డీ ఎల్)ను ఇది నియంత్రిస్తుంది. అంతేకాదు , ఈ ఎల్ డీ ఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ను కాలేయం గ్రహించేలా చేస్తుంది. తద్వారా గుండెపోటు రాకుండా చేస్తుందని పరిశోధనలు నిరూపించాయి.

ఇంక్లిసిరాన్ ఎఫెక్ట్ పై లాన్సెట్ రిపోర్ట్

గుండె పోటు రాకుండా ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్ సమర్ధంగా పనిచేస్తోందని లాన్సెట్ నివేదిక తెలిపింది. ఈ ఇంజెక్షన్ తీసుకున్న రోగుల్లో మంచి ఫలితాలు కన్పించినట్టుగా ఈ నివేదిక వివరించింది.

ఐదు దేశాల్లో నిర్వహించిన ట్రయల్స్ కు సంబంధించిన నివేదికను లాన్సెట్ జర్నల్ 2023 జనవరిలో విడుదల చేసింది. ఏడాదికి రెండుసార్లు ఈ ఇంజెక్షన్ తీసుకొంటే శరీరంలో తక్కువ సాంద్రత గల కొవ్వును తగ్గిస్తోందని ఈ నివేదిక వివరించింది.

ఎల్ డీ ఎల్ స్థాయిలను ఈ ఇంజెక్షన్ 50 శాతానికి పైగా తగ్గిస్తుందని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ 2023 నవంబర్ లో ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ లో ఈ ఇంజెక్షన్ పనితీరుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్, వాటి పనితీరును ప్రస్తావించారు.

ఇంక్లిసిరాన్ స్పెషాలిటీ ఏంటి?

ఇది శరీరంలోని పీసీఎస్ కె-9 కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. తద్వారా చెడు కొలెస్ట్రాల్ తయారీకి అడ్డుకట్ట వేస్తోంది. చెడు కొలెస్ట్రాల్ తయారీని నిలిపివేయడంలో ఈ ఇంజెక్షన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని యూకేలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో కూడా తేలింది. దీంతో యూకే నేషనల్ హెల్త్ సర్వీసెస్ కూడా ఈ డ్రగ్ వినియోగానికి పచ్చజెండా ఊపింది.

సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా?

యూకేలో ఈ ఇంజెక్షన్ తీసుకున్న రోగుల ఆరోగ్య పరిస్థితిపై నివేదికలను బయటకు వచ్చాయి. 382 మంది రోగులు నాలుగేళ్ల పాటు ఈ డ్రగ్స్ ఉపయోగించిన సమయంలో చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ ను గుర్తించారు. అందరూ రోగుల్లో సాధారణంగా ఒకే తరహా లక్షణాలు కన్పించాయి. ముక్కుతో పాటు గొంతు వాపు లక్షణాలు కన్పించినట్టుగా ఈ నివేదిక తెలిపింది. ఈ డ్రగ్ ఉపయోగించిన ప్రతి ఐదుగురిలో ఒక్కరికి ఈ లక్షణాలు కన్పించాయి. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి, దద్దుర్లు, చర్మం ఎరుపు రంగులోకి మారిన లక్షణాలు మరికొందరిలో కన్పించాయి. ప్రతి ఏడుగురిలో ఒక్కరికి ఈ లక్షణాలు కన్పించాయి.

ఇండియాలో గుండె జబ్బులతో 20 శాతం మంది పురుషులు, 17 శాతం మంది మహిళలు మరణిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గుండె జబ్బులున్న రోగులకు ఈ ఇంజెక్షన్ సంజీవనిగా పనిచేస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.

Note: ఈ కథనం ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. కచ్చితమైన సలహాలు, సూచనల కోసం డాక్టర్ ను సంప్రదించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories